సూళ్లూరుపేటలో భారీగా గంజాయి పట్టివేత
ABN, Publish Date - Jul 13 , 2025 | 01:51 AM
ఒడిశా నుంచి చెన్నైకి తీసుకెళ్తున్న రూ.20 లక్షల విలువ చేసే 70.560 కిలోల గంజాయిని సూళ్లూరుపేట పోలీసులు శనివారం పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
- రూ.20 లక్షల విలువ చేసే గంజాయి ప్యాకెట్లు, కారు స్వాధీనం
సూళ్లూరుపేట, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి చెన్నైకి తీసుకెళ్తున్న రూ.20 లక్షల విలువ చేసే 70.560 కిలోల గంజాయిని సూళ్లూరుపేట పోలీసులు శనివారం పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు సూళ్లూరుపేట పోలీసుస్టేషన్‌లో శనివారం ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ బ్రహ్మనాయుడు, తడ ఎస్‌ఐ కొండపనాయుడు సూళ్లూరుపేట హోలిక్రాస్ సర్కిల్ వద్ద జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. నెల్లూరు వైపు నుంచి చెన్నై వెళ్తున్న ఏపీ 09 సీబీ 2966నంబరు కారును తనిఖీ చేశారు. వెనుక సీటు, డిక్కీలో నాలుగు బ్యాగ్‌లలో 70.560 కిలోల గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న తమిళనాడుకు చెందిన టీ.బిబిన్‌నాథ్, జే.రోహన్‌ను అదుపులోకి తీసుకుని కారుతో సహా పోలీసుస్టేషన్‌కు తరలించారు. విచారించగా ఒడిశాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి చెన్నైలో అధిక ధరలకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి, వారి వద్దనున్న రెండు సెల్‌ఫోన్లు, రూ.20 లక్షల విలువ చేసే గంజాయి, కారును సీజ్ చేశారు. నిందితులు తమిళనాడులో గంజాయి రవాణా, హత్య కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.
Updated Date - Jul 13 , 2025 | 01:51 AM