జీఎ్‌సఎల్వీ-ఎఫ్ 16 ప్రయోగం సక్సెస్
ABN, Publish Date - Jul 31 , 2025 | 12:18 AM
శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎ్‌సఎల్వీ-ఎఫ్ 16 రాకెట్ నిప్పులు చెరుగుతూ.. నింగిలోకి దూసుకెళ్లింది
సూళ్లూరుపేట, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : ప్రయోగానికి 27.30 గంటల ముందు.. మంగళవారం తెల్లవారుజామున 2.10 గంటలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ‘0’కి చేరగానే.. సమయం బుధవారం సాయంత్రం 5.40 గంటలు అయింది. అంతే ఒక్కసారిగా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎ్‌సఎల్వీ-ఎఫ్ 16 రాకెట్ నిప్పులు చెరుగుతూ.. నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ మూడు దశలను విజయవంతంగా పూర్తిచేసి 18.40 నిమిషాల్లోనే 2,392 కిలోల బరువైన నిసార్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇస్రో-నాసా సంయుక్తంగా చేపట్టిన ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ ప్రకటించడంతో షార్‌లో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాలతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఈ విజయం.. రోదసి ప్రయోగాల్లో మరోసారి మన శాస్త్రవేత్తల సత్తా చాటింది. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి సుమారు ఆరువేల మందిదాకా వచ్చారు. ఎండను సైతం లెక్కచేయకుండా రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు వీక్షకులు మధ్నాహ్నమే షార్‌కు తరలివచ్చారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులున్నారు. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోట వరకు తెల్లవారుజామునుంచే వాహనాలు బారులు తీరాయి. రాకెట్ నింగికి ఎగురుతున్న సమయంలో వీక్షకుల చప్పట్లు, ఈలలు, కేకలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. రాకెట్ నింగికెగిరినంతరం విజయవంతం కావడంతో వీక్షకులు గ్యాలరీ వద్దే ఆనందంతో సంబరాలు చేసుకొన్నారు.
సవాల్‌గా తీసుకుని..
ఈ ఏడాది జనవరి 29న ప్రయోగించిన జీఎ్‌సఎల్వీ-ఎఫ్ 15 ప్రయోగం అనంతరం ఉపగ్రహ సంకేతాలు అందలేదు. అనంతరం మే 18న ప్రయోగించిన పీఎ్‌సఎల్వీ-సీ 61 ప్రయోగం విఫలం చెందింది. ఈ రెండు వైఫల్యాలను శాస్త్రవేత్తలు సవాల్‌గా తీసుకున్నారు. మూడోసారి.. అత్యంత ఖరీదైన, నాసా, ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో మన శాస్త్రవేత్తలకు అగ్రదేశాల నుంచీ ప్రశంసలు అందాయి. కాగా, ఈ ఏడాది ఇస్రోకు ఇది తొలి విజయం. కాగా, భూ పరిశీలన, సునామీ, విపత్తుల హెచ్చరికలు ముందుగానే పసిగట్టి సమాచారాన్ని చేరవేసేందుకు నిసార్ ఎంతో దోహదపడుతుంది.
రాకెట్ వీక్షణకు ఇస్రో మాజీ చైర్మన్లు
షార్ వేదికగా జరిగిన నిసార్ ఉపగ్రహ ప్రయోగ వీక్షణకు ఇస్రో మాజీ చైర్మన్లు డాక్టర్ కె,రాధాకృష్ణ, ఏఎ్‌స.కిరణ్ కుమార్ విచ్చేశారు. వీరిలో పాటు పలువురు శాస్త్రవేత్తలు కూడా విచ్చేసి మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి రాకెట్ ప్రయోగాన్ని తిలకించారు.
చరిత్రలో నిలిచిపోయే ప్రయోగం
ఇది చరిత్రలో నిలిచిపోయే ప్రయోగం. బుడిబుడి అడుగల నుంచి నేడు స్వదేశీ పరిజ్ఞానంతో అమెరికా వంటి అగ్రదేశంతో కలిసి భారీ ప్రయోగాలు చేపట్టే స్థాయికి ఎదిగాం. ఇదంతా మన శాస్త్రవేత్తల సమష్టి కృషి ఫలితమే. ఊహించిన ప్రకారమే నిసార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టాం. ఇది ఇస్రో,నాసా ఘన విజయం.
- వి.నారాయణన్, ఇస్రో చైర్మన్
Updated Date - Jul 31 , 2025 | 12:18 AM