అడుగంటిన భూగర్భ జలాలు
ABN, Publish Date - May 12 , 2025 | 01:18 AM
ఓ వైపు వెంటాడుతున్న వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు పెరిగిన నీటి వినియోగంతో జిల్లాలోని 17 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. ఎప్పటిలాగే కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో ఈ సమస్య అధికంగా ఉన్నా.. గుడుపల్లె, వి.కోట మండలాల్లో తీవ్రంగా మారింది.
గుడుపల్లె, వి.కోట మండలాల్లో సమస్య తీవ్రం
33 గ్రామాల్లో ట్యాంకర్లతో నీటి సరఫరా
జూలైలో హంద్రీ-నీవా నీళ్లతోనే సమస్య పరిష్కారం
ఓ వైపు వెంటాడుతున్న వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు పెరిగిన నీటి వినియోగంతో జిల్లాలోని 17 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. ఎప్పటిలాగే కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో ఈ సమస్య అధికంగా ఉన్నా.. గుడుపల్లె, వి.కోట మండలాల్లో తీవ్రంగా మారింది. గుడుపల్లె, వి.కోట, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో గతేడాదితో పోల్చుకుంటే ప్రస్తుతం భూగర్భజలాలు మరింత లోతుకు వెళ్లిపోయాయి. చౌడేపల్లె, నగరి, విజయపురం, తవణంపల్లె వంటి మండలాల్లో గతేడాదితో పోల్చుకుంటే ఇప్పుడు భూగర్భజలాలు పైకి అందుబాటులోకి వచ్చాయి.
- చిత్తూరు, ఆంధ్రజ్యోతి
కలెక్టర్ ఆందోళన
‘కుప్పం నియోజకవర్గంలో భూగర్భ జలాలు అడుగంటడంతో సమస్య తీవ్రంగా మారింది. కుప్పం తర్వాత పలమనేరు నియోజకవర్గం రెండో స్థానంలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 17 మండలాల్లో భూగర్భజలాలు ఆందోళనకరంగా ఉన్నాయి.’ ఇటీవల చిత్తూరులో జరిగిన డీడీఆర్సీ సమావేశంలో స్వయంగా కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్న మాటలివి. అంతేకాదు, జిల్లాలోనే గుడుపల్లె మండలంలో భూగర్భ జలమట్టం చాలా దారుణంగా పడిపోయిందని ఆందోళన చెందిన కలెక్టర్.. శుక్రవారం ఆ మండలంలో పర్యటించారు. భూగర్భజలాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో, ప్రజాప్రతినిధులతో చర్చించారు. చెరువుల్లో పూడికతీయడం, చెరువు కట్టలను బలోపేతం చేయడం, చెరువల్ని అనుసంధానం చేయడం.. వంటి పనుల్ని చేపట్టాలని సూచించారు.
ట్యాంకర్లతో నీటి సరఫరా
ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 33 గ్రామాల్లో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంఖ్య బాగా తక్కువని చెప్పుకోవచ్చు. గతేడాది 95 గ్రామాలకు ట్యాంకర్లు వెళ్లేవి. ప్రస్తుతం 33 గ్రామాలూ గుడుపల్లె, వి.కోట మండలాల్లోనే ఉండడం ఆందోళనకరం. గుడుపల్లెలో 12 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా, 2 గ్రామాలకు స్థానిక బోర్లతో అనుసంధానం చేశారు. అలాగే వి.కోటలో 16 గ్రామాలకు ట్యాంకర్లతో, 3 చోట్ల స్థానిక బోర్లతో అనుసంధానం చేయించారు. గతేడాదితో పోల్చుకుంటే 62 గ్రామాలు తగ్గాయి.
ఏప్రిల్‌లో భూగర్భ జలాలు అడుగంటిన వివరాలు (మీటర్లలో..)
మండలం ఈ ఏడాది గతేడాది
గుడుపల్లె 58.26 49.39
వి.కోట 28.94 20.08
కుప్పం 20.13 24.64
రామకుప్పం 19.42 15.15
శాంతిపురం 15.71 14.61
గుడుపల్లె, వి.కోట మండలాల్లో గతేడాది కంటే ప్రస్తుతం సుమారుగా 9 మీటర్ల లోతుకు భూగర్భజలాలు అడుగంటాయి. అందుకే జిల్లా యంత్రాంగం ఆందోళన చెందుతోంది.
ఏప్రిల్‌లో భూగర్భజలాలు పుష్కలంగా ఉన్న వివరాలు (మీటర్లలో..)
మండలం ఈ ఏడాది గతేడాది
చౌడేపల్లె 2.37 2.65
విజయపురం 3.08 3.85
నగరి 3.25 3.47
తవణంపల్లె 3.06 5.34
ప్రతి వేసవిలోనూ పశ్చిమ ప్రాంతంలోనే తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తూర్పు ప్రాంతాల్లో అవసరమైన మేరకు భూగర్భజలాలు అందుబాటులో ఉంటున్నాయి.
కుప్పం బ్రాంచి కెనాల్‌తోనే పరిష్కారం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించడంతో హంద్రీ-నీవా కుప్పం బ్రాంచి కెనాల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. గతేడాది డిసెంబరులో ఈ కెనాల్‌కు కాంక్రీట్ లైనింగ్ పనులు చేసేందుకు రూ.197 కోట్లను కేటాయించారు. ప్రస్తుతం ఆ పనులు 50 శాతానికిపైగా పూర్తవ్వగా.. జూన్ ఆఖరునాటికి వందశాతం పూర్తయ్యేలా జరుగుతున్నాయి. శుక్రవారం అనంతపురం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు జూలై 10న హంద్రీ-నీవాను పూర్తి చేసి నీళ్లను వదులుతామని ప్రకటించారు. కుప్పం బ్రాంచి కెనాల్ కుప్పం నియోజకవర్గంలోని 110 చెరువుల్ని నింపుతుంది. దీంతో భూగర్భజలం పుష్కలంగా పెరుగుతుంది. గుడుపల్లెలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు పరిష్కారం లభిస్తుంది.
Updated Date - May 12 , 2025 | 01:18 AM