11ఏళ్లుగా..గప్‌చుప్‌గా
ABN, Publish Date - May 15 , 2025 | 01:56 AM
దశాబ్ద కాలానికి పైగా చిత్తూరులో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠాను కలెక్టర్ సుమిత్‌కుమార్ పట్టుకున్నారు.తమిళనాడు రాష్ట్రానికి చెందిన వైద్యశాఖ అధికారుల ఫిర్యాదుతో సుమారు రెండు నెలల పాటు నిఘా వుంచిన కలెక్టర్.. ఎవ్వర్నీ నమ్మకుండా ఒంటరిగా వెళ్లి పట్టుకున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ కేంద్రం నిర్వహణ
తమిళనాడు మహిళలే ఆదాయవనరు
రెండు నెలల పాటు నిఘా వేసి పట్టుకున్న కలెక్టర్ సుమిత్‌కుమార్
డీఎంహెచ్‌వోకు,డీసీహెచ్‌ఎస్‌కు నోటీసులు
చిత్తూరు, మే 14 (ఆంధ్రజ్యోతి): దశాబ్ద కాలానికి పైగా చిత్తూరులో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠాను కలెక్టర్ సుమిత్‌కుమార్ పట్టుకున్నారు.తమిళనాడు రాష్ట్రానికి చెందిన వైద్యశాఖ అధికారుల ఫిర్యాదుతో సుమారు రెండు నెలల పాటు నిఘా వుంచిన కలెక్టర్.. ఎవ్వర్నీ నమ్మకుండా ఒంటరిగా వెళ్లి పట్టుకున్నారు.పరీక్షా కేంద్రంతో పాటు యంత్రాలను సీజ్ చేసి.. 11 మంది గర్భిణుల్ని, ముగ్గురు నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. నెలకు సుమారు రూ.10 లక్షలు సంపాదిస్తున్న ఈ ముఠా గురించి అనేక విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. కడుపులో ఉన్న బిడ్డ ఆడా, మగా చెప్పడం తీవ్రమైన నేరం. ఈ చట్టాన్ని తమిళనాడులో పటిష్టంగా అమలు చేస్తున్నారు. దీంతో అక్కడి గర్భిణులు పెద్దఎత్తున చిత్తూరులో నిర్ధారణ పరీక్షల కోసం వస్తున్నారు. ఈ విషయాన్ని అక్కడి వైద్యారోగ్య శాఖ అధికారులు ఇటీవల గుర్తించారు.చిత్తూరు కలెక్టర్ సుమిత్‌కుమార్ దృష్టికి ఈ విషయాన్ని తెచ్చారు.చిత్తూరు నగరంలోని భరత్‌నగర్‌కాలనీలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న కలెక్టర్ సుమారు రెండు నెలలుగా నిఘా ఉంచారు. బుధవారం ఎస్పీ మణికంఠకు ఈ విషయమై సమాచారమిచ్చి భరత్‌నగర్‌కాలనీకి వెళ్లారు. స్పెషల్ బ్రాంచి ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ను ఎస్పీ అక్కడకు పంపించారు.ఆర్డీవో శ్రీనివాసుల్ని తాను వెళ్లిన చాలాసేపటికి లొకేషన్ పెట్టి కలెక్టర్ రమ్మన్నారు. ఆ తర్వాత కాసేపటికి తహసీల్దార్ చంద్రశేఖర రెడ్డిని పిలిచి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఇంటిని, స్కానింగ్ పరికరాలను సీజ్ చేయించారు.స్కానింగ్ కేంద్రం వద్ద వున్న 11మంది గర్భిణుల్ని విచారించి వదిలేశారు.ముగ్గురు మహిళా నిర్వాహకుల్ని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు.ఈలోపు పరారైన నిర్ధారణ పరీక్షలు చేసే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.చిత్తూరు ఆస్పత్రుల్లోని ల్యాబుల్లో, స్కానింగ్ కేంద్రాల్లో, మెడికల్ స్టోర్స్‌లో పనిచేసే సిబ్బంది పదిమంది దాకా మహిళలను ఈ కేంద్రానికి పంపుతున్నట్లు అనుమానిస్తున్నారు. 2014 నుంచీ చిత్తూరులో ఇలా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.ఈ 11 ఏళ్లలో ఒక్క కేసూ నమోదు కాకపోవడం,వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకు తెలియకపోవడం ఆశ్చర్యకరం.కలెక్టర్ నేరుగా కల్పించుకోవడంతో ఆ దిశగా కూడా విచారణ జరిగే అవకాశముంది. ఇప్పటికే కలెక్టర్ డీఎంహెచ్‌వోకు, డీసీహెచ్‌ఎస్‌కు నోటీసులు ఇచ్చారు.
నెలకు రూ.10 లక్షల సంపాదన..
వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో మాత్రమే భరత్‌నగర్‌కాలనీలోని రేకుల ఇంట్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ మూడు రోజుల్లో సుమారు 50 మంది గర్భిణులు వస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి ఎక్కువగా గర్భిణులు హాజరవుతుండగా...... మన జిల్లావాసులు కూడా వస్తున్నారు. ఒక్కో గర్భిణి నుంచి రూ.5 వేల నుంచి రూ.6 వేల దాకా వసూలు చేస్తున్నారు.రూ.లక్ష విలువ చేసే యంత్రాలతో నెలకు రూ.10 లక్షల దాకా సంపాదిస్తున్నారు.
Updated Date - May 15 , 2025 | 01:56 AM