భార్యపై అనుమానంతో ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటికి నిప్పు
ABN, Publish Date - Jul 25 , 2025 | 02:12 AM
భార్యపై అనుమానంతో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌ను హత్య చేయాలని భావించాడు. బంధువులతో కలిసి గురువారం తెల్లవారుజామున దొడ్లమిట్టలోని అతడి ఇంటికి నిప్పు పెట్టారు.
రేణిగుంట జూలై 24 (ఆంధ్రజ్యోతి): భార్యపై అనుమానంతో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌ను హత్య చేయాలని భావించాడు. బంధువులతో కలిసి గురువారం తెల్లవారుజామున దొడ్లమిట్టలోని అతడి ఇంటికి నిప్పు పెట్టారు. ఇంట్లో ఉన్న నవీన్ అప్రమత్తం కావడంతో బయటపడ్డారు. సీఐ జయచంద్ర తెలిపిన ప్రకారం.. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ దొడ్లమిట్టలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వద్ద స్థానికంగా 200 మంది కూలీలు పని చేస్తున్నారు. వీరిలో ఒక మహిళతో నవీన్‌కు వివాహేతర సంబంధం ఉందని ఆమె భర్తకు అనుమానం. దీంతో అతడు నవీన్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 2 గంటలకు తన అన్న, అక్కతో కలిసి ఆ మహిళ భర్త రామాంజనేయులు.. నవీన్‌ను సజీవంగా దహనం చేసేందుకు అతడి ఇంటి చుట్టూ పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇంటికి మంటలు అంటుకోవడంతో నిద్రలో ఉన్న నవీన్ తేరుకొని బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఏసీ, ఇంట్లోని ముఖ్యమైన పరికరాలు కాలిపోగా, 70 శాతం ఇల్లు దగ్ధమైందని సీఐ తెలిపారు. బాధితుడు నవీన్ ఫిర్యాదు మేరకు రామాంజనేయులు, ఆదినారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Updated Date - Jul 25 , 2025 | 02:12 AM