రాజకీయ ఒత్తిళ్లకు తలవంచొద్దు
ABN, Publish Date - Jul 25 , 2025 | 02:00 AM
‘రాజకీయ ఒత్తిళ్లకు తలవంచొద్దు.. ఉద్యోగ ధర్మాన్ని విస్మరించొద్దు’ అని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సుమిత్‌కుమార్ సూచించారు.
- రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సూచన
చిత్తూరు కలెక్టరేట్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ‘రాజకీయ ఒత్తిళ్లకు తలవంచొద్దు.. ఉద్యోగ ధర్మాన్ని విస్మరించొద్దు’ అని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సుమిత్‌కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో పుంగనూరు, పలమనేరు మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లతో డీఆర్వో మోహన్‌కుమార్‌తో కలిసి సమీక్షించారు. రెవెన్యూ సిబ్బందిపై దాడులు జరిగితే, అటువంటి సంఘటనలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూశాఖ పనితీరుపై ప్రజాభిప్రాయసేకరణ జరుగుతున్నదని, ఎక్కడైనా అవినీతి జరిగినట్లు తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా.. అవినీతికి తావు లేకుండా పనిచేయాలన్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉంటే ప్రజాసమస్యలను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని చెప్పారు. సరైన కారణం ఉంటేనే జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎ్‌స)కు పంపాలన్నారు. ప్రతి అర్జీని గరిష్ఠంగా ఐదురోజుల్లోగా పరిష్కరించాలని, లేకుంటే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి సోమవారం చిత్తూరులో నిర్వహించే పీజీఆర్‌ఎ్‌సకు సగటున 400 అర్జీలు అందుతుండగా, వాటిలో 300 వరకు రెవెన్యూ, రీసర్వే అంశాలకు సంబంధించినవే ఉంటున్నాయని తెలిపారు. తమ సమస్యలు విన్నవించడానికి ప్రతి మూడో శనివారం సాయంత్రం ఐదు గంటల తర్వాత డీఆర్వోను రెవెన్యూ సిబ్బంది సంప్రదించవచ్చన్నారు. పలమనేరు ఆర్డీవో భవాని పాల్గొన్నారు.
Updated Date - Jul 25 , 2025 | 02:00 AM