ధర్మరాజస్వామి ఉత్సవాల్లో ఘర్షణ
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:26 AM
శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య దాడులు.. వీధి పోరాటాన్ని తలపించింది.
శ్రీకాళహస్తి, జూలై 7(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య దాడులు.. వీధి పోరాటాన్ని తలపించింది. సిబ్బంది ప్రాణరక్షణ కోసం గదిలోకి వెళ్లి దాక్కోవాల్సి వచ్చింది. రోగులు, వారి సంబంధీకులు ఏం జరుగుతుందో అర్థం కాక పరుగులు తీశారు. ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఆలయం వద్ద ఆదివారం రాత్రి అగ్నిగుండం తర్వాత జరిగిన కురుక్షేత్ర సంగ్రామం (యుద్ధపర్వం) ఘట్టం సందర్భంగా జరిగిన చిన్న వివాదమే.. ఈ దాడులకు కారణమైంది. ఆ ఉత్సవ సమయంలో ఆలయం వెనుక.. తొట్టంబేడు సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయం ఎదుట పట్టణానికి చెందిన రోహిత్, ధనుష్ ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్నారు. అదే సమయంలో భాను, కిరణ్, చరణ్ ధర్మరాజస్వామి ఆలయం వైపు వెళుతుండగా వారితో వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. రోహిత్, ధనుష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి కుటుంబసభ్యులైన మునిరత్నం, సుధాకర్, మునిరాజా గాయపడిన రోహిత్, ధను్‌షను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాసేపటికి భాను తన ఇద్దరు సోదరులతో పాటు మరికొంత మందిని వెంటబెట్టుకుని ఆస్పత్రికి వెళ్లారు. ఇరువర్గాలు కత్తులు, దుడ్డుకర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు విరుచకపడ్డారు. కొందరు ప్రాణభయంతో తప్పించుకునే క్రమంలో కాన్పుల రూంలోకి చొరబడ్డారు. అక్కడ బాలింతలు, గర్భిణులు, నవజాత శిశువులు ఉన్నారు. ఆస్పత్రిలో రోగులంతా వణికిపోయారు. అక్కడే సమీపంలోనే నర్సింగ్‌స్టేషన్‌లో ఉన్న స్టాఫ్‌నర్సులు ప్రాణభయంంతో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు కొందరు సెలైన్ స్టాండ్లతోనూ దాడికి దిగారు. ఆస్పత్రి సిబ్బంది సమాచారంతో శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, తన సిబ్బందితో ఆస్పత్రికి చేరుకున్నారు. ఇరువర్గాలు గాయాలతో రక్తస్రావం జరగుతున్నా పోరు తగ్గలేదు. డీఎస్పీ చొరవతో అల్లరి మూకలను అదుపు చేశారు. ఇదే వైద్యశాలలో చికిత్సలందిస్తే మళ్లీ దాడులకు దిగుతారని భావించి.. మునిరత్నం, సుధాకర్, మునిరాజాను ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండేళ్ల కిందట కూడా ఈ రెండు ప్రాంతాల మధ్య ఆస్పత్రి వద్ద జరిగిన దాడుల నేపథ్యంలో వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఆస్పత్రి యంత్రాంగం స్పందనేదీ?
అందుబాటులో ఉండాల్సిన ఆస్పత్రి సూపరింటెండెంట్ మణి, ఇన్‌ఛార్జి ఆర్‌ఎంవో మురళీకృష్ణ తిరుపతిలో నివాసం. నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్ట్ ఖాళీ. ఆ తరువాత స్థానంలోని ముగ్గురు హెడ్‌నర్సులు ఉండేదీ తిరుపతిలోనే. అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంత పెద్ద ఘటన జరిగితే సోమవారం ఉదయం ఆస్పత్రికి వచ్చారు. సీసీ కెమెరాల్లోని గొడవ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి.. పోలీసుల వైఫల్యంగా చూపేలా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయించారన్న విమర్శలున్నాయి. ఇంత బీభత్సంపై నిరసన తెలపలేదు. కనీసం అవుట్ పోస్ట్ కావాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి కూడా చేయకపోవడం గమనార్హం.
Updated Date - Jul 08 , 2025 | 12:26 AM