చిత్తూరు చిన్నబోతోంది!
ABN, Publish Date - May 23 , 2025 | 02:07 AM
వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనతో విద్య, వైద్య, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలను కోల్పోయి చిత్తూరు అనాథగా మిగిలింది. ఇప్పుడు ప్రజల అభ్యర్థనలు, పరిపాలనా సౌలభ్యం పేర్లతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చిత్తూరు మరింత చిన్నబోయేలా ఉంది.
నగరి నియోజకవర్గంలోని మూడు మండలాలు తిరుపతి జిల్లాలోకి?
భవిష్యత్తులో మిగిలేది 22 మండలాలే
చిత్తూరు, మే 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనతో విద్య, వైద్య, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలను కోల్పోయి చిత్తూరు అనాథగా మిగిలింది. ఇప్పుడు ప్రజల అభ్యర్థనలు, పరిపాలనా సౌలభ్యం పేర్లతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చిత్తూరు మరింత చిన్నబోయేలా ఉంది.ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ కోసం మంత్రివర్గ సబ్ కమిటీని నియమించారు. అప్పుడే పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలను మదనపల్లె రెవెన్యూ సబ్ డివిజన్‌లోకి మార్చేందుకు రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వాలని క్యాబినెట్ తీర్మానించింది. ఇందుకు అనుగుణంగా ఆయా మండలాలను మారుస్తున్నట్లు ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వాలని గురువారం చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.దీనిపై విస్తృతంగా ప్రచారం చేసి, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పుంగనూరులోని ఆరు మండలాలు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో కలిపేస్తే ఇక చిత్తూరులో 25 మండలాలే ఉంటాయి.అలాగే జిల్లాల విభజన సమయంలో నగరి నియోజకవర్గంలోని రెండు మండలాలు తిరుపతిలో, మూడు చిత్తూరులో కలిపారు. కానీ ఎన్నికల సమయంలో చిత్తూరులో ఉన్న నగరి, నిండ్ర, విజయపురం మండలాలను కూడా తిరుపతి జిల్లాలోనే కలిపేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా గురువారం చిత్తూరులో జరిగిన జిల్లా స్థాయి మహానాడులో నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ మాట్లాడుతూ.. ‘త్వరలో ఆ మూడు మండలాలను తిరుపతిలో కలిపేస్తున్నాం’ అని చెప్పారు.జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే చెప్పిన మాటలు అమలయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నగరిలోని ఆ మూడు మండలాలు తిరుపతిలో కలిసిపోతే, ఇక చిత్తూరు జిల్లాకు 22 మండలాలే మిగులుతాయి.
Updated Date - May 23 , 2025 | 02:07 AM