చిన్నారుల భవిష్యత్తుకు ‘కేర్ అండ్ గ్రో’
ABN, Publish Date - Jun 28 , 2025 | 12:59 AM
కుప్పంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో రూ.2.89 కోట్లతో ప్రత్యేక కార్యక్రమం లోపాలున్న పిల్లలపై నిపుణులతో పర్యవేక్షణ
చిత్తూరు, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): కుప్పం నియోజకవర్గంలోని అంగన్‌వాడీ పిల్లల మానసిక లోపాలను గుర్తించి సరి చేసేందుకు ప్రభుత్వం ‘కేర్ అండ్ గ్రో’ ప్రాజెక్టును ప్రారంభించింది. నియోజకవర్గంలోని 428 అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ దీన్ని చేపట్టనుండగా.. ప్రస్తుతం కొన్నింట్లో మాత్రమే ప్రారంభించారు. సీఎం చంద్రబాబు జూలై 2న కుప్పంలో పర్యటించనున్న సందర్భంగా, మిగిలిన కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.గత ఏడాది అక్టోబరులో 25అంగన్వాడీ కేంద్రాల్లో ‘కేర్ అండ్ గ్రో’ ప్రాజెక్టును పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. 1711మంది పిల్లలకు ఏఐ ఆధారిత పరీక్షలు చేశారు. వీరిలో 612మందికి ఒకటి కంటే ఎక్కువ లోపాలున్నట్లు గుర్తించారు. 39 మందికి నాలుగుకు మించి లోపాలున్నట్లు గుర్తించి, నిపుణుల వద్దకు పంపించారు. 30 రోజుల పాటు చేయాల్సిన పనుల్ని వారి తల్లిదండ్రులకు సూచించారు. శిక్షణ పొందిన ఫీల్డ్ కో ఆర్డినేటర్లు ఇళ్లకు వెళ్లి లోపాలున్న పిల్లల్ని పర్యవేక్షిస్తున్నారు. వచ్చే నెల రెండో వారంలో రెండో దశ స్ర్కీనింగ్ పరీక్షల్ని ప్రారంభించనున్నారు.నియోజకవర్గంలోని 428 కేంద్రాలకు మే నెలలో జియోట్యాగింగ్ పూర్తి చేశాక ఈ నెల 11, 13 తేదీల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. లోపాలున్న పిల్లల తల్లిదండ్రులకు 90కిపైగా వాట్సాప్ గ్రూపుల్ని ఏర్పాటుచేశారు. రోజూ ఆ గ్రూపుల్లో పిల్లలతో చేయించాల్సిన పనుల గురించి వీడియోలు, మెసేజ్‌లు పంపిస్తుంటారు. మాట్లాడే, అరిచే, రాసే, భావోద్వేగాలు (ఎమోషన్స్) పలికించేలా శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రాజెక్టును నిర్వహించేందుకు రూ.2.89 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
Updated Date - Jun 28 , 2025 | 12:59 AM