ఒంటరి ఏనుగు స్వైరవిహారం
ABN, Publish Date - Jun 28 , 2025 | 01:01 AM
కొనసాగుతున్న ఒంటరి ఏనుగు స్వైరవిహారం
రామకుప్పం, జూన్ 27(ఆంఽధ్రజ్యోతి): రామకుప్పం మండలం ననియాల గ్రామ సమీప తోటలపై ఒంటరి ఏనుగు స్వైరవిహారం కొనసాగుతోంది.శుక్రవారం తెల్లవారు జామున 2గంటల ప్రాంతంలో అరటి, టమోటా, మామిడితోటలపై విరుచుకుపడింది. నారాయణప్ప తోటలో గెలలు వచ్చిన సుమారు 15 అరటి చెట్లను, మూడు కొబ్బరి చెట్లను ధ్వంసం చేసింది.ఆయనకే చెందిన టమోటా తోటను కూడా ఏనుగు కొంత మేర తొక్కేసింది. శంకరప్పకు చెందిన తోటలో మామిడి రాశిని తిన్నంతగా తిని, తొక్కి నాశనం చేసింది. నాగరాజు, బెంగళూరప్పలకు చెందిన తోటల్లో కూడా మామిడి కాయలను తిన్నంతగా తిని, నేల రాల్చింది. పలు చెట్ల కొమ్మలను విరిచేసింది. అటవీశాఖ అధికారులు, ట్రాకర్లు అతి కష్టంపై ఏనుగును అటవీ లోతట్టు ప్రాంతం వైపు మళ్ళిస్తున్నా చీకటి పడితే తిరిగి అటవీ సమీప తోటల వైపు వస్తోంది. తోటలపై దాడులకు పాల్పడుతున్న అది ఏ క్షణంలో గ్రామంలోకి వస్తుందోనన్న ఆందోళన గ్రామస్థుల్లో నెలకొంది.ఏనుగు గ్రామం వైపు రాకుండా చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు భరోసా ఇస్తున్నప్పటికీ వారిని గజభయం వీడడం లేదు.
Updated Date - Jun 28 , 2025 | 01:01 AM