6.46 లక్షల మందికి పనిలేదు
ABN, Publish Date - May 17 , 2025 | 01:50 AM
ఇళ్ల వద్దనే ఉంటూ పనిచేసే విఽధానం తీసుకువస్తామని సీఎం చంద్రబాబునాయుడు సార్వత్రిక ఎన్నికల సమయంలో వెల్లడించారు.
ఇళ్ల వద్దనే ఉంటూ పనిచేసే విఽధానం తీసుకువస్తామని సీఎం చంద్రబాబునాయుడు సార్వత్రిక ఎన్నికల సమయంలో వెల్లడించారు. ఇంటి పని విధానాన్ని విస్తృత పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. వివిధ సంస్థల ద్వారా ప్రస్తుతం ఇళ్ల నుంచి పనిచేస్తున్న వారికి మెరుగైన సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. ఏ పని లేనివారిని గుర్తించి వారికి నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ఆ మేరకు 18 నుంచి 50 సంవత్సరాలలోపు వారి వివరాల సేకరణకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది చేపట్టిన వర్క్‌ఫ్రం హోం సర్వే దాదాపు పూర్తయింది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 5,25,506 కుటుంబాలను వర్క్ ఫ్రం హోం సర్వేలోకి తీసుకున్నారు. అందులో 18 నుంచి 50 ఏళ్లలోపు వారు 11,30,127 మంది ఉండగా.. ఇప్పటి వరకు 11,28,269 మంది వివరాలను నమోదు చేశారు. సర్వేలో ఆసక్తిగల వివరాలు వెలుగు చూశాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన వయసువారిలో ఎటువంటి పనిలేకుండా 6,46,236 మంది ఖాళీగా ఉన్నట్లు తేల్చారు.
వర్క్ ఫ్రం హోంకు ఆసక్తి
వర్క్ ఫ్రం హోంకు 2,52,599 మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే 36,927 మంది ఏదో ఒక రంగంలో పనిచేస్తున్నారు. నిరుద్యోగాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులోభాగంగా మొదటి విడత బీటెక్ పూర్తిచేసిన వారికి పనిచూపించేందుకు సామర్థ్య పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. అందులో ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఏ ఉపాధి లేని వారిని గుర్తించి వారందరికి ఆసక్తి గల రంగంలో శిక్షణ ఇప్పించి నైపుణ్యం పెంచేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక తగిన విద్యార్హతలు ఉన్నవారు ఇళ్ల నుంచే పని చేసుకునేలా (వర్క్ ఫ్రం హోం) వివిధ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. జిల్లాలో ఏ పనిలేనివారు 6,46,236మంది ఉన్నట్లు తేల్చారు. ఇక, ఇంటర్నెట్ సదుపాయం ఉన్నవారిని పరిశీలిస్తే బ్రాడ్‌బ్రాండ్ 16,339మంది ఇళ్లలో ఉంది. వైఫై 11,494 మంది ఇళ్లలో ఉంది. వర్క్‌ఫ్రం హోం ఆసక్తి ఉన్న వారికి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
ఎంత మంది.. ఏం చదివారంటే..
జిల్లాలో 1 నుంచి 9వ తరగతి వరకు చదివిన వారి సంఖ్య 26,252. 36,814 మంది పదో తరగతి చదివారు. ఇక, ఇంటర్ 41,323 మంది, డిప్లొమా 13,534 మంది, డిగ్రీ 60,920 మంది, ఇంజనీరింగ్ 32,705 మంది, ఎంబీబీఎస్ 541, లా (బీఎల్) 394, పీజీ 22,466 మంది, పీహెచ్‌డీ 583 మంది పూర్తి చేశారు. ఇతరులు 8,409 మంది ఖాళీగా ఉన్నారు. నిరక్ష్యరాస్యులు 8,658 మంది ఉన్నారు.
Updated Date - May 17 , 2025 | 01:50 AM