తిరుపతిలో 5 గంటల అంధకారం!
ABN, Publish Date - Apr 22 , 2025 | 01:23 AM
ఇంట్లో ఉక్కపోత. బయటకొస్తే దోమల బెడద. కరెంటు సరఫరా లేకపోవడంతో తిరుపతివాసులు సోమవారం సాయంత్రం దాదాపు ఐదు గంటలపాటు సతమతమయ్యారు. తరచూ కరెంటు రావడం.. మళ్లీ పోవడంతో ఇబ్బంది పడ్డారు.
చంద్రగిరి సబ్ స్టేషన్‌లో కాలిన ప్రొటెక్షన్ కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్
తిరుపతి(ఆటోనగర్), ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో ఉక్కపోత. బయటకొస్తే దోమల బెడద. కరెంటు సరఫరా లేకపోవడంతో తిరుపతివాసులు సోమవారం సాయంత్రం దాదాపు ఐదు గంటలపాటు సతమతమయ్యారు. తరచూ కరెంటు రావడం.. మళ్లీ పోవడంతో ఇబ్బంది పడ్డారు. చంద్రగిరి 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో 7.30 గంటలకు ప్రొటెక్షన్ కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. చంద్రగిరి 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి అలిపిరి సమీపంలోని 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌కు.. అక్కడ్నుంచి నగరంలోని 33-11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లకు కరెంటు సరఫరా అవుతోంది. ఈ క్రమంలో తిరుపతితో పాటు చంద్రగిరిలో విద్యుత్ వినియోగం పెరగడంతో 132 కేవీ కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులను నియంత్రించే ప్రొటెక్షన్ కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయింది. దీంతో తిరుపతికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సాయంత్రం నుంచి రాత్రి 12.30 గంటల వరకు కరెంటు కాసేపు రావడం.. ఆపై సరఫరా ఆగిపోవడంతో జనం అవస్థలు పడ్డారు. ఇళ్ల బయటే జాగారం చేశారు. నెల రోజులుగా జిల్లాలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీనిని అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారు. ముందస్తుగా 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో స్పేర్‌లో ప్రొటెక్షన్ కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులో ఉంచలేదు. విద్యుత్ వినియోగం పెరిగిందని చెబుతున్న అధికారులు.. ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - Apr 22 , 2025 | 01:23 AM