ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జెడ్పీ బదిలీల్లో నిబంధనలకు తిలోదకాలు

ABN, Publish Date - May 26 , 2025 | 01:00 AM

ప్రభుత్వం అన్ని విభాగాల ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. విధివిధానాలను విడుదల చేసింది. అయితే ఏ శాఖలో లేని విధంగాజిల్లా పరిషతలో ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఇష్టానుసారంగా చేర్పులు, మార్పులు చేసి బదిలీలు చేస్తామని ఆ శాఖ అధికారులు చెబుతుండటంతో ఆ విభాగంలోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారంతో ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం బదిలీలు చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ కలసి విజ్ఞప్తి చేస్తే, ఈ విషయంపై తన వద్దకు రావద్దని, కొద్దిపాటి మార్పులతో బదిలీలు జరుగుతాయని చెప్పడంతో ఉద్యోగులు ఖంగుతిన్నారు. జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో, ఇన్‌చార్జి కలెక్టర్‌ను కలిసినా భరోసా లభించకపోవడంతో ఉద్యోగులను బదిలీల భయం వెంటాడుతోంది.

- ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఇష్టానుసారంగా చేర్పులు, మార్పులు

- కౌన్సెలింగ్‌ లేకుండా బదిలీలు అంటూ సంకేతాలు

- ముగిసిన దరఖాస్తు స్వీకరణ గడువు

- జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో, ఇన్‌చార్జి కలెక్టర్‌ను కలిసిన ఉద్యోగులు

- లభించని భరోసా.. వెంటాడుతున్న బదిలీల భయం

ప్రభుత్వం అన్ని విభాగాల ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. విధివిధానాలను విడుదల చేసింది. అయితే ఏ శాఖలో లేని విధంగాజిల్లా పరిషతలో ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఇష్టానుసారంగా చేర్పులు, మార్పులు చేసి బదిలీలు చేస్తామని ఆ శాఖ అధికారులు చెబుతుండటంతో ఆ విభాగంలోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారంతో ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం బదిలీలు చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ కలసి విజ్ఞప్తి చేస్తే, ఈ విషయంపై తన వద్దకు రావద్దని, కొద్దిపాటి మార్పులతో బదిలీలు జరుగుతాయని చెప్పడంతో ఉద్యోగులు ఖంగుతిన్నారు. జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో, ఇన్‌చార్జి కలెక్టర్‌ను కలిసినా భరోసా లభించకపోవడంతో ఉద్యోగులను బదిలీల భయం వెంటాడుతోంది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లా పరిషత ఉద్యోగుల బదిలీలపై పంచాయతీరాజ్‌ విభాగం ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఈ నెల 22వతేదీన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని స్పష్టం చేశారు. రెండేళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తూ రిక్వెస్ట్‌ బదిలీలకు దరఖాస్తు చేసుకునే వారికి వెసులుబాటు కల్పించారు. వివిధ యూనియన్‌లలో ఆఫీస్‌ బేరర్లుగా పనిచేస్తున్న వారికి, ఐదు నెలల్లోపు పదవీ విరమణ చేసేవారికి, అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడేవారికి బదిలీల నుంచి మినహాయింపును ఇచ్చారు. బదిలీలను కౌన్సెలింగ్‌ పద్ధతిలో నిర్వహించి, ఖాళీలు ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగులు తమకు ఇష్టమైన ప్రాంతాన్ని కోరుకుంటే, అక్కడకు బదిలీ అయ్యే అవకాశం కల్పించారు. దీంతో పాటు ఉద్యోగుల బదిలీల్లో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తే జెడ్పీ సీఈవోనే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో కీలకమైన పాయింట్‌లను తొలగించిన జిల్లాపరిషత అధికారులు తమ చిత్తానుసారంగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు తయారు చేసి, ఈ నిబంధనల ప్రకారం బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాలని జెడ్పీ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు చెప్పారు. జెడ్పీ ఉద్యోగులకు కౌన్సెలింగ్‌ పద్ధతిలో కాకుండా, బదిలీ కోసం దరఖాస్తు చేసే సమయంలో మూడు ప్రాంతాలను ఆప్షన్‌గా పెట్టుకోవాలని, దీని ప్రకారం కౌన్సెలింగ్‌ లేకుండా బదిలీలు ఉంటాయనే సంకేతాలు పంపడంతో జెడ్పీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో, ఇన్‌చార్జి కలెక్టర్‌కు ఉద్యోగుల వినతి

జెడ్పీ పరిధిలోకి వచ్చే పంచాయతీరాజ్‌లోని వివిధ విభాగాల్లో బదిలీలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో కొన్ని కీలకమైన సూచనలను జెడ్పీ అధికారులు మార్పులు చేసి, తాము అనుకున్న విధంగా జిల్లా పరిషత నుంచి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేశారు. మార్పు చేసిన ఉత్తర్వుల ప్రకారం బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో ఉద్యోగులు ఖంగుతిన్నారు. ఈ పరిణామం అనంతరం జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో ఆనందకుమార్‌ను ఉద్యోగులు కలిశారు. ఉద్యోగుల బదిలీల్లో ప్రభుత్వ ఉత్తర్వులనే మార్చివేశారని ఆయనకు వివరించారు. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులను మార్పు చేసిన ఉద్యోగులను పిలిపించి ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల బదిలీల అంశంలో జెడ్పీ ఇన్‌చార్జి సీఈవోపైనా ఒత్తిడి రావడంతో ఆయన గత రెండు, మూడు రోజులుగా మిన్నకుండిపోయారని ఉద్యోగులు అంటున్నారు. ఒత్తిడి కారణంగా తాను సెలవు పెట్టి వెళ్లిపోతానని సూచనప్రాయంగా జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో చెబుతున్నారని ఉద్యోగులు చెప్పుకోవడం గమనార్హం. దీంతో జెడ్పీ ఉద్యోగులు ఇన్‌చార్జి కలెక్టర్‌ గీతాంజలి శర్మను ఇటీవల కలసి విషయం తెలియజేశారు. కలెక్టర్‌ వచ్చిన తర్వాత ఈ అంశాన్ని పరిశీలిస్తారని ఆమె చెప్పారు. దీంతో కొందరు ఉద్యోగులు ఆదివారం జెడ్పీ చైర్‌పర్సన్‌ ఇంటికి వెళ్లి మరీ కలసి, ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా బదిలీలు చేయాలని కోరారు. బదిలీలు జరుగుతాయని, కానీ కొద్దిపాటి మార్పులతో జరుగుతాయని ఆమె చెప్పారని జెడ్పీ ఉద్యోగులు అంటున్నారు. జెడ్పీలో ఐదేళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న వారు 40 మంది, రెండేళ్లు అంతకు మించి ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న వారు 300 మంది వరకు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. వీరిని ఎక్కడెక్కడకు బదిలీ చేస్తారనే అంశంపై జెడ్పీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. వైసీపీ పాలనలో జెడ్పీ ఉద్యోగులపై ఒత్తిడి కత్తి పెట్టడంతోపాటు తమకు అనుకూలంగా లేరనే కారణం చూపి వివిధ విభాగాల్లో అత్యంత కీలక విధులను నిర్వహించేవారిని గతంలో దూర ప్రాంతాలకు బదిలీ చేశారు. మరి కొందరు ఉద్యోగులు వేధింపులు తాళలేక బదిలీ చేయించుకుని ప్రాధాన్యతలేని పోస్టుల్లోకి వెళ్లారు. దీంతో జెడ్పీలో కీలక విభాగాల్లో పనులను చక్కబెట్టేవారు లేకుండా పోయారని ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం జరిగే బదిలీల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే భయం ఉద్యోగులను వెంటాడుతోంది.

సెలవులో జెడ్పీ సీఈవో!

జెడ్పీ సీఈవో కన్నమనాయుడు కొన్నిరోజులుగా సెలవులో ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో ఆయన సెలవు పెట్టారని పైకి చెబుతున్నా, తెరవెనుక అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనాన్ని జెడ్పీ జనరల్‌ ఫండ్స్‌ నుంచి విడుదల చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు జెడ్పీటీసీ సభ్యులు ఇటీవల పట్టుబట్టారు. జెడ్పీ జనరల్‌ ఫండ్స్‌ నుంచి జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనం విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని, ఆడిట్‌ అభ్యంతరాలు వస్తాయని సీఈవో ఆ ఫైల్‌ను పక్కన పెట్టేశారు. దీంతో సీఈవోపై జెడ్పీ పాలకవర్గ సభ్యులు గుర్రుగా ఉన్నారు. ఈ కారణం చూపి ఇటీవల జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని సభ్యులు బహిష్కరించారు. ఈ నెల 26వ తేదీతో జెడ్పీ సీఈవో సెలవు ముగుస్తుంది. జెడ్పీ ఉద్యోగుల బదిలీలను కౌన్సెలింగ్‌ పద్ధతిలో జూన్‌ 1, 2 తేదీల్లో జరపాల్సి ఉంది. సీఈవో కన్నమనాయుడు వస్తే ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఉద్యోగుల బదిలీలను చేస్తారని, అయితే ఆయనపై ఒత్తిడి తెచ్చి సెలవు పొడిగించేలా తెరవెనుక వ్యవహారం నడుస్తోందని జెడ్పీ ఉద్యోగులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. రానున్న రోజుల్లో జెడ్పీ విభాగంలో ఉద్యోగుల బదిలీల అంశం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.

.

Updated Date - May 26 , 2025 | 01:01 AM