CM Chandrababu : స్వర్ణాంధ్ర-2047కు సహకరించండి
ABN, Publish Date - Feb 08 , 2025 | 02:27 AM
స్వర్ణాంధ్ర-2047కు కేంద్ర ప్రభుత్వ సహాయ, సహకారాలు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
15% వృద్ధిరేటు సాధనకు అనుకూల సమయం
ఇంటికొకరిని ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దుతాం
పాలనాపరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా అభివృద్ధిలో ముందంజ వేసేందుకు శ్రమిస్తున్నాం
రీజినల్ గ్రోత్ హబ్‌లుగా అమరావతి, తిరుపతి
అత్యుత్తమ పాలసీల అమలే ప్రభుత్వ విధానం
నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు బేరీతో భేటీలో సీఎం
రాష్ట్రంలో అభివృద్ధికి అవకాశాలపై ప్రజెంటేషన్
అమరావతి/మంగళగిరి సిటీ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ‘వన్ ఫ్యామిలీ.. వన్ ఏఐ ప్రొఫెషనల్.. వన్ ఎంటర్‌ప్రెన్యూర్..’ లక్ష్యంతో రూపొందించుకున్న స్వర్ణాంధ్ర-2047కు కేంద్ర ప్రభుత్వ సహాయ, సహకారాలు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రాష్ట్ర సచివాలయానికి తొలిసారిగా వచ్చిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీకి సీఎం చంద్రబాబు శుక్రవారం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సచివాలయంలో బేరీ బృందం ఆయనతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్ర ఆకాంక్షలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఇంటికొకరిని ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్లను తీర్చిదిద్ది 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఏటా 15 శాతం వృద్ధిరేటు సాధించే దిశగా బలమైన ఆర్థిక వ్యవస్థను నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది అనుకూలమైన సమయమని పేర్కొన్నారు. విభజన గాయాలు, గత ఐదేళ్లలో మూలధన వ్యయంపై నిర్లక్ష్యం లాంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కి రాష్ట్రం బలపడేందుకు నీతి ఆయోగ్ సహకరించాలని కోరారు. హైదరాబాద్ స్థాయి నగరాన్ని పదేళ్ల క్రితమే వదలుకోవడం, పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడటం, గడిచిన ఐదేళ్లలో మౌలిక వసతుల కల్పన లేకపోవడం ఇబ్బందికరంగా పరిణమించాయని వివరించారు. పాలనాపరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా అభివృద్ధిలో ముందంజ వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలోనే మూడో అతిపెద్ద సముద్ర తీరం కలిగిన ఏపీలో పోర్టులు, హైవేలతో అతిపెద్ద కనెక్టివిటీ కలిగి ఉందని చెప్పారు.
మూడు పారిశ్రామిక కారిడార్లతో తూర్పు ఆగ్నేయాసియాకు రాష్ట్రం గేట్‌వేగా ఉందని వివరించారు. పునరుత్పాదక విద్యుత్, డేటా టెక్నాలజీలో పెట్టుబడులు ఆకర్షించడం అత్యంత సానుకూల అంశాలుగా పేర్కొన్నారు. దేశంలోని నాలుగు గ్రోత్ హబ్‌లలో ఒకటిగా ఉన్న విశాఖ ఎకనమిక్ రీజియన్‌తో పాటు తిరుపతి, అమరావతిని రీజినల్ గ్రోత్ హబ్‌లుగా మలిచేందుకు సహకారం అందించాలని నీతి ఆయోగ్ బృందాన్ని సీఎం కోరారు.
పది ప్రధాన సూత్రాలకు ప్రాధాన్యం
విజన్-2047లోని పది ప్రధాన సూత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇండస్ట్రియల్ కారిడార్లు, స్కిల్లింగ్ హబ్‌లు, స్మార్ట్ సిటీలు, మౌలిక వసతుల బలోపేతంలో ఏపీ ప్రభుత్వం, నీతి ఆయోగ్ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నదుల అనుసంధానం, పీ4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీ పోర్టులు, ఎయిర్ పోర్టులు ఉన్న తిరుపతి, చెన్నై, నెల్లూరును ట్రై సిటీగా తీర్చిదిద్దితే ప్రగతి పరుగులు పెడుతుందని చంద్రబాబు అన్నారు. అన్ని రకాల రవాణా కనెక్టివిటీ ఉన్న ఈ మూడు నగరాల మధ్య అభివృద్ధికి అత్యద్భుత అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో తాను అభివృద్ధి చేసిన జినోమ్ వ్యాలీలో ఇప్పుడు 700 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని, అదే స్ఫూర్తితో రాష్ట్రంలోనూ అత్యుత్తమ పాలసీలు అమలు చేయాలనేది కూటమి ప్రభుత్వ విధానమని వివరించారు. ప్రజా రవాణా సంస్థలో ఉన్న 11వేల డీజిల్ బస్సుల స్థానంలో ఈవీ బస్సులు ప్రవేశపెట్టడంతో పాటు, అన్ని ఆర్టీసీ బస్టాండ్లపై రూఫ్ టాప్ సోలార్ పవర్ యూనిట్ల ఏర్పాటుచేసే యోచన ఉన్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
ఎయిమ్స్ పురోగతిపై సమీక్ష
నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ సుమన్ బేరీ శుక్రవారం మంగళగిరి ఎయిమ్స్‌ను సందర్శించారు. ఎయిమ్స్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి, సంస్థ సాధించిన పురోగతిని సమీక్షించారు. వైద్య విద్య, రోగుల సంరక్షణ సేవలపై ఆయనకు అధికారులు నివేదిక సమర్పించారు. ఓపీడీ నమోదు ప్రక్రియ, రోగులు వేచి ఉండే ప్రాంతాలు, రేడియేషన్, ఆంకాలజీ బ్లాకులను బేరీ పరిశీలించారు. మంగళగిరి ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహంతెమ్ శాంతా సింగ్, అడ్మినిస్ట్రేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ శశికాంత్ తుమ్మా, అధికారులు పాల్గొన్నారు.
మీలాంటి నాయకుల వల్లే ప్రజల జీవితాలు మారతాయి
చంద్రబాబును ప్రశంసించిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు
సీఎం చంద్రబాబుపై నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ ప్రశంసలు కురిపించారు. 30ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా చేసిన రంగరాజన్‌తో కలిసి నాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును కలిసిన విషయాన్ని బేరీ గుర్తు చేసుకున్నారు. దేశంలో చాలామంది సీఎంలు ఉన్నా సంస్కరణలను అనుకూలంగా మార్చుకుని ప్రజలకు మేలు చేసిన నాయకుడు మీరేనని ప్రశంసించారు. వాజపేయి హయాంలో నాటి సంస్కరణలను అందిపుచ్చుకుని తీసుకొచ్చిన పాలసీలు ప్రజల జీవితాలను మార్చేశాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు అమలు చేసిన ప్రతి పాలసీ, ప్రతి సంస్కరణ తర్వాత కాలంలో దేశం పాటించిందని బేరీ వ్యాఖ్యానించారు. ఐటీకి ప్రోత్సాహంతో పాటు ఎయిర్‌పోర్టులు, ప్రైవేటు విద్యుత్తు ప్లాంట్లు, పీపీపీ పద్ధతిలో రోడ్లు వంటి అనేక ఆవిష్కరణలకు నాంది పలికారని ప్రశంసించారు. భవిష్యత్తు అవసరాలను గుర్తించి ఆలోచనలు, పాలసీలు అమలు చేసిన నాయకుల వల్లే ప్రజల జీవితాలు మారతాయని, సంస్కరణలు అందిపుచ్చుకున్న ఫలితాలు ఉమ్మడి ఏపీలో కనిపించాయని బేరీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..
Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం
Updated Date - Feb 08 , 2025 | 02:27 AM