ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: బిడదారి హౌసింగ్‌ ప్రాజెక్టు భేష్‌

ABN, Publish Date - Jul 29 , 2025 | 04:41 AM

కొత్త ఆలోచనలు .. ఆధునికతల కలయికే అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉత్తమ విధానాలతో ఏపీకి భవిష్యత్‌ నగరం నిర్మిస్తున్నామని వెల్లడించారు. సింగపూర్‌-ఆంధ్రప్రదేశ్‌ మధ్య సహకారం కొనసాగాలని....

  • చెట్లు కొట్టకుండా,నీటి వనరుల్ని పరిరక్షిస్తూ పర్యావరణహితంగా నివాస సముదాయాలు

  • సింగపూర్‌లో 2గంటలపాటు కాలినడకన ప్రాజెక్టును పరిశీలించిన సీఎం

అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): కొత్త ఆలోచనలు .. ఆధునికతల కలయికే అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉత్తమ విధానాలతో ఏపీకి భవిష్యత్‌ నగరం నిర్మిస్తున్నామని వెల్లడించారు. సింగపూర్‌-ఆంధ్రప్రదేశ్‌ మధ్య సహకారం కొనసాగాలని, ప్రభుత్వాల మధ్య అంతరం తగ్గించడమే పర్యటన ఉద్దేశమని స్పష్టం చేశారు. రెండో రోజు సింగపూర్‌ పర్యటనలో భాగంగా చంద్రబాబు సోమవారం రెండు గంటల పాటు కాలినడకన బిడదారి హౌసింగ్‌ ప్రాజెక్టును పరిశీలించారు. పర్యావరణహితంగా నివాస సముదాయ నిర్మాణంపై ప్రశంసలు కురిపించారు. పదివేల కుటుంబాలు నివాసం ఉండేలా బిడదారి ఎస్టేట్‌ను రూపొందించారు. రాష్ట్రంలో భారీ ఎత్తున అర్బన్‌ హౌసింగ్‌ ప్రాజెక్టులను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ హౌసింగ్‌ ప్రాజెక్టు ప్లాన్‌ను చంద్రబాబు బృందం పరిశీలించింది. ‘సిటీ ఇన్‌ ఎ గార్డెన్‌’ పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టు విశిష్ఠతలను సింగపూర్‌ అధికారులు వివరించారు. మొత్తం 250 ఎకరాల్లో నిర్మించారు. ఈ సమయంలో సింగపూర్‌కూ, ఆంధ్రప్రదేశ్‌కూ మధ్య ఉన్న అనుబంధాన్ని అక్కడి అధికారులకు చంద్రబాబు వివరించారు. ఇదే సమయంలో రాజధాని నిర్మాణ ఉద్దేశాన్ని కూడా వెల్లడించారు. సింగపూర్‌ ప్రభుత్వం ఇప్పటికే మాస్టర్‌ ప్లాన్‌ ఇచ్చిందని, రాజధాని నిర్మాణంలో ప్రపంచబ్యాంకూ భాగస్వామి అయిందన్నారు. బిడదారి ఎస్టేట్‌లో గృహ సముదాయాల నిర్మాణం చేపట్టిన విధానాన్ని ఆయనకు సింగపూర్‌ అధికారులు వివరించారు. చెట్లు తొలగించకుండా సహజ నీటి వనరులు దెబ్బతినకుండా ఇళ్ల నిర్మాణాలను చేపట్టిన విధానం గురించి తెలిపారు. ఆహ్లాదకరంగా గృహాలు ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. పర్యావరణానికి హాని కలిగించకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అయిన వ్యయం గురించి చంద్రబాబు ఆరాతీశారు. శ్మశాన ప్రాంగణాన్ని సుందర పార్కుగా సింగపూర్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ మార్చడం అద్భుతంగా ఉందని అధికారులను చంద్రబాబు అభినందించారు.

అర్బన్‌ హౌసింగ్‌ ప్రాజెక్టులకు సహకరించండి

అనంతరం సింగపూర్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ, సింగపూర్‌ కార్పొరేషన్‌ ఎంటర్‌ప్రైజెస్‌తోపాటు ప్రపంచ బ్యాంకు అధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో అర్బన్‌ హౌసింగ్‌ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలని సింగపూర్‌ హౌసింగ్‌ అథారిటీని సీఎం కోరారు.

  • క్రీడలతో పర్యాటక, వాణిజ్య రంగాల్లో వృద్ధి

  • సింగపూర్‌లో అత్యుత్తమ స్పోర్ట్స్‌ స్కూల్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు

అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): ‘క్రీడలతోనూ పర్యాటక, వాణిజ్య రంగాల్లో వృద్ధి సాధ్యం. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సోమవారం సింగపూర్‌లో ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, మంత్రులు, అధికారులతో కలసి సింగపూర్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ను ఆయన సందర్శించారు. అత్యుత్తమ క్రీడాకారుల్ని తయారు చేయడంతో పాటు క్రీడా సదుపాయాలు, పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ స్పోర్ట్స్‌ పాలసీని తీసుకువచ్చామని చెప్పారు. అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయడంతో పాటు వినోదం, పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రాలుగా స్పోర్ట్స్‌ స్కూళ్లు ఉండాలని సింగపూర్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఒంగ్‌ కిమ్‌ సూన్‌తో సీఎం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాలన్న సంకల్పంతో పెద్దఎత్తున ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు చెప్పారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న క్రీడా రిజర్వేషన్లను మూడు శాతానికి పెంచామని చెప్పారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.7 కోట్లు, రజతం సాధిస్తే రూ.5 కోట్లు, కాంస్య సాధిస్తే రూ.3 కోట్లు ప్రోత్సాహకంగా ఇస్తున్నామని వెల్లడించారు. ఏషియన్‌ గేమ్స్‌లో పతక విజేతలకు గ్రూప్‌-1 ఉద్యోగాలిస్తున్నామని చెప్పారు. అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ, తిరుపతి, వైజాగ్‌, అమరావతిలో ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తామన్నారు. సింగపూర్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ తరహాలోనే కడప, విజయవాడ, విజయనగరంలో క్రీడా పాఠశాలల ఏర్పాటు యోచనలో ఉన్నామన్నారు.

ప్రపంచ స్థాయి క్రీడా కేంద్రంగా సింగపూర్‌ని తీర్చిదిద్దేందుకు స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రయత్నిస్తోందని సీఎంకు ఆ సంస్థ ప్రిన్సిపాల్‌ ఒంగ్‌ కిమ్‌ సూన్‌ వివరించారు. సింగపూర్‌ స్పోర్ట్ప్‌ స్కూల్‌లో హైపెర్ఫార్మెన్స్‌ స్పోర్ట్స్‌ సిస్టమ్‌ను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకు ఉన్నత ప్రమాణాలు, అత్యున్నత పనితీరు కలిగిన వ్యవస్థలను రూపొందించుకున్నామని అన్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు స్పోర్ట్స్‌ స్కూళ్లలో అడ్మిషన్లు ఇచ్చేలా నిబంధనలు రూపొందించామని చెప్పారు. విద్యార్థులకు 12 ఏళ్లు వచ్చిన తర్వాతే అడ్మిషన్లు ఇచ్చి క్రీడల్లో తర్ఫీదు ఇస్తున్నామని చెప్పారు. జాతీయ క్రీడా సంఘాలు, అకాడెమీలతో స్కూల్‌ను అనుసంధానించామని వివరించారు.

Updated Date - Jul 29 , 2025 | 04:43 AM