CM Chandrababu: నాణ్యమైన మద్యమే అమ్మాలి
ABN, Publish Date - Jul 15 , 2025 | 03:54 AM
రాష్ట్రంలో నాణ్యమైన మద్యం మాత్రమే అమ్మాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అనుమానాస్పదంగా ఉన్న మద్యం బ్రాండ్ల విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించారు.
అంతర్జాతీయ,జాతీయస్థాయి నాణ్యత ఉండాలి..నాటుసారా కనపడొద్దు
అనుమానాస్పద బ్రాండ్లు అమ్మనీయొద్దు..ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు
గత ప్రభుత్వంలో జే బ్రాండ్లతో అనారోగ్యం..ఆన్‌లైన్ పేమెంట్లను ప్రోత్సహించాలి
ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష..పొరుగురాష్ట్రాల కంటే ఏపీలోనే
మద్యం ధరలు తక్కువ.. వినియోగదారులపై నెలకు 116 కోట్ల భారం తగ్గింది
అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నాణ్యమైన మద్యం మాత్రమే అమ్మాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అనుమానాస్పదంగా ఉన్న మద్యం బ్రాండ్ల విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఇటీవల రాష్ట్రంలో నకిలీ మద్యం పట్టుబడిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది.ఎక్సైజ్ శాఖపై సోమవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో అంతర్జాతీయ, జాతీయ స్థాయి నాణ్యత కలిగిన మద్యం మాత్రమే అమ్మాలన్నారు. ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని, అందువల్ల నాణ్యత విషయంలో రాజీపడొద్దని స్పష్టంచేశారు. ఎట్టిపరిస్థితుల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటుసారా విక్రయాలు జరగకూడదన్నారు. గత ప్రభుత్వంలో పెద్దఎత్తున నకిలీ బ్రాండ్ల మద్యం విక్రయించడంతో ప్రజల ఆరోగ్యం పాడైపోయిందన్నారు. నకిలీ మద్యం వల్ల వ్యాపారం తగ్గి, రాష్ట్ర ఆదాయం తగ్గిందన్నారు. 2014-2019 మధ్య అమలైన మద్యం పాలసీ ఎలా ఉందనే దానిపై అధ్యయనం చేసి నివేదికను ప్రజల ముందుంచాలని ఆదేశించారు. గతంలో ఏపీకి దక్కాల్సిన ఆదాయం పొరుగు రాష్ర్టాలకు తరలిపోయిందన్నారు. గత ప్రభుత్వంలో జే బ్రాండ్ల వల్ల వినియోగదారులు గంజాయి, డ్రగ్స్‌కు అలవాటుపడ్డారని సీఎం చెప్పారు. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందన్నారు.
చరిత్రలో తొలిసారి ధరలు తగ్గాయి
గత ప్రభుత్వంలో విక్రయించిన నకిలీ బ్రాండ్ల అమ్మకాలు ఎంతవరకు వరకు ఆగాయని సీఎం అధికారులను అడిగారు. గతంలో విక్రయించిన అనామక మద్యం బ్రాండ్లు ఈ ప్రభుత్వంలో పూర్తిగా తగ్గిపోయాయన్నారు. చరిత్రలో తొలిసారి మద్యం ధరలు తగ్గాయని అధికారులు తెలిపారు. ఒక్కో సీసాపై రూ. 10 నుంచి రూ. 100 వరకు ధరలు తగ్గాయన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. పేదల జేబులు కొట్టేలా ప్రభుత్వం వ్యవహరించకూడదన్నారు. దోపిడీ ఉండకూడదనే ధరలు తగ్గించామన్నారు. ఈ చర్యల కారణంగా ప్రతినెలా వినియోగదారులపై రూ. 116కోట్ల భారం తగ్గిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పొరుగు రాష్ర్టాలతో పోలిస్తే ఏపీలో టాప్- 30 బ్రాండ్ల ధరలు తక్కువగా ఉన్నాయని వివరించారు. పర్మిట్ రూమ్‌లు లేకపోవడం వల్ల బహిరంగంగా మద్యం తాగే పరిస్థితి కనిపిస్తోందని అధికారులు తెలిపారు. కేసులు నమోదు చేస్తున్నా పరిస్థితికి అడ్డుకట్ట పడట్లేదన్నారు. పర్మిట్ రూమ్‌లకు అనుమతిస్తే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఎక్సైజ్‌లో కూడా ఏఐని వినియోగించి ట్రాక్ అండ్ ట్రేస్ వ్యవస్థను పటిష్ఠంగా అమలుచేయాలని సీఎం ఆదేశించారు. డిస్టిలరీల నుంచి షాపుల వరకు మద్యం ఎలా వెళ్తుందో ట్రాక్ చేయాలన్నారు. అలాగే మద్యం అమ్మకాల్లో ఆన్‌లైన్ నగదు లావాదేవీలను ప్రోత్సహించాలన్నారు. డేటా అనలటిక్స్ ద్వారా స్టాకుపై అంచనా వేయాలని చెప్పారు. నాటుసారాపై నిఘాకు డ్రోన్లు వినియోగించాలని సూచించారు. సమీక్షలో ఉన్నతాధికారులు ఎంకే మీనా, నిషాంత్‌కుమార్, రాహుల్‌దేవ్ శర్మ పాల్గొన్నారు.
Updated Date - Jul 15 , 2025 | 03:57 AM