CM Chandrababu: పెట్టుబడుల సాధనే లక్ష్యం
ABN, Publish Date - Jul 27 , 2025 | 03:40 AM
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన సాగనుంది. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ప్రమోషన్ కూడా అందులో భాగం కానుంది.
బ్రాండ్ ఏపీ ప్రచారంపైనా దృష్టి
సింగపూర్‌లో సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్
5 రోజులు.. 29 కార్యక్రమాలు మంత్రులు, పారిశ్రామికవర్గాలతో చర్చలు
ఆ దేశాధ్యక్షుడితోనూ సమావేశం
నేడు తెలుగు డయాస్పోరా భేటీకి హాజరు
విదేశాల్లో ఏపీ యువతకు ఉద్యోగాలపై చర్చ
పీ4లో భాగస్వామ్యం కావాలని పిలుపు
అమరావతి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన సాగనుంది. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ప్రమోషన్ కూడా అందులో భాగం కానుంది. శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన చంద్రబాబు నేతృత్వంలోని బృందం ఆదివారం ఉదయం సింగపూర్‌కు చేరుకున్నదే తడవుగా బిజీబిజీగా గడపనుంది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులుతో భేటీ అవుతారు. ఈ పర్యటనలో సీఎం మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందులో 6 ప్రభుత్వ భేటీలు, 14 వన్ టు వన్ సమావేశాలు, 4 సందర్శనలు, మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు, ఒక డయాస్పోరా సమావేశం, ఒక రోడ్‌షో కార్యక్రమం ఉన్నాయి. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఐటీ, పరిశ్రమలు, అర్బన్ డెవల్‌పమెంట్, క్రీడలు, నౌకాశ్రయాలు, ఫిన్‌టెక్ రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్య అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో సీఎం చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనతో అంతర్జాతీయ పెట్టుబడుల రాకకు గేట్‌వేగా ఏపీ మారనుంది. క్రీడారంగం అభివృద్ధితోపాటు పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ముందడుగుగా నిలవనుంది.
తొలి రోజు నుంచే బిజీ.. బిజీ..
సింగపూర్ చాంఘీ విమానాశ్రయం నుంచి హోటల్ కు చేరుకున్న వెంటనే చంద్రబాబు షెడ్యూల్ మొదలవుతుంది. తొలుత సింగపూర్‌లోని భారత్ హైకమిషనర్ శిల్పక్ అంబులేతో భేటీ అవుతారు. ఉదయం 11.30కు నిర్మాణ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సింగపూర్‌కు చెందిన కన్సెల్టెన్సీ సంస్థ సుర్బనా జురాంగ్ ప్రతినిధులతో సమావేశం అవుతారు. మధ్యా హ్నం 12.30 గంటలకు ఎవర్‌సెండాయ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తన్‌శ్రీ డాటో నాథన్‌ను కలసి మాట్లాడతారు. ప్రపంచస్థాయి స్ట్రక్చరల్ స్టీల్ అండ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీగా ఎవర్‌సెండాయ్‌కి గుర్తింపు ఉంది.
తెలుగువారితో సమావేశం
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఓవిస్ ఆడిటోరియంలో జరిగే ‘తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా’ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ సమావేశానికి సింగపూర్‌తోపాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ తదితర దేశాలకు చెందిన తెలుగు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరుకానున్నారు. ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి సుమారు 1,500 మంది ప్రతినిధులు రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిరుద్యోగ యువతకు దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులను ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించేలా చేయటం, ఏపీ నుంచి ఎగుమతులు పెంచడానికి ఎన్నారైల ద్వారా అవసరమైన ప్రణాళికలు అమలు, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన వంటి అంశాలపై తెలుగు డయాస్పోరా సమావేశం దృష్టి సారించనుంది. అలాగే జీరో పావర్టీ మిషన్‌లో భాగమైన పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలుగు పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలను సీఎం కోరనున్నారు.
పోర్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అధ్యయనం
పర్యటనలో రెండో రోజైన సోమవారం సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రి గన్ కిమ్ యాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో సుస్థిరాభివృద్ధి ప్రణాళికలపై అధ్యయనం కోసం సింగపూర్‌లోని బిడదారి ఎస్టేట్‌ను సీఎం బృందం సందర్శించనుంది. అనంతరం సస్టెయినబుల్ అర్బన్ డెవల్‌పమెంట్‌పై నిర్వహించే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులో సీఎం బృందం పాల్గొంటుంది. యువతకు క్రీడలపై ఆసక్తి కలిగించేలా సింగపూర్ నిర్మించిన స్పోర్ట్స్ స్కూల్‌ను కూడా సీఎం బృందం సందర్శిస్తుంది. పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోర్టు ఆధారిత ఎకో సిస్టమ్ తదితర అంశాలను పరిశీలించేందుకు సీఎం బృందం టువాస్ పోర్టులో పర్యటిస్తుంది. అనంతరం పెట్టుబడిదారులతో నెట్‌వర్కింగ్ కోసం ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్‌షో కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.
సింగపూర్ బిజినెస్ లీడర్లతో సమావేశం
సీఎం పర్యటనలో మూడో రోజు ఏఐ సింగపూర్, ఎస్‌ఐఏ ఇంజనీరింగ్, కేప్పెల్, జీఐసీ లాంటి ప్రముఖ సంస్థలతో వరుస భేటీలు జరుగుతాయి. ఐటీ, ఫిన్ టెక్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో 10కిపైగా అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం సమావేశమై చర్చలు జరుపుతారు. అనంతరం సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. సింగపూర్ మాజీ ప్రధాని లీ హ్సియన్ లూంగ్‌తో కూడా భేటీ అవుతారు. సింగపూర్‌లోని జురాంగ్ పెట్రో కెమికల్ ఐల్యాండ్‌ను సందర్శించి పారిశ్రామిక అభివృద్ధి మోడల్‌పై అధ్యయనం చేస్తారు. సింగపూర్‌లోని ప్రముఖ కంపెనీల సీఈవోల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని పోర్టులు, మౌలిక సదుపాయాలపై సీఎం చర్చించనున్నారు.
హోం, విదేశాంగ మంత్రులతో భేటీ
నాలుగో రోజు పర్యటనలో భాగంగా కేపిటా ల్యాండ్, సుమితోమో మిట్సుయి బ్యాంక్, టెమసెక్ సంస్థలతో సీఎం సమావేశం అవుతారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తోనూ భేటీ కానున్నారు. చివరి రోజైన 31వ తేదీన సింగపూర్ హోం మంత్రి కె.షణ్ముగంతోపాటు స్థానిక ప్రతినిధులతో సమావేశం అవుతారు. అదే రోజు రాత్రి హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు. సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు లోకేశ్, నారాయణ, టీజీ భరత్, పలువురు ఐఏఎస్ అధికారులు సింగపూర్ పర్యటనలో పాల్గొంటున్నారు.
విశ్వసనీయ భాగస్వామ్యం పునరుద్ధరణకు అవకాశం
సీఎం చంద్రబాబు
సింగపూర్‌తో విశ్వసనీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు తన సింగపూర్ పర్యటన దోహదపడుతుందని సీఎం పేర్కొన్నారు. తన పర్యటనపై సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘సింగపూర్.. ఏపీకి అత్యంత విలువైన భాగస్వాముల్లో ఒకటి.. ఉత్సాహవంతమైన తెలుగు సమాజానికి నిలయం. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ ముఖ్యమైన భాగస్వామిగా ఉంది. ఆసియాలో అత్యంత అభివృద్ధి చెందిన, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఆర్థిక వ్యవస్థల్లో సింగపూర్ ఒకటి. సింగపూర్ పర్యటన.. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచవేదికపై ప్రచారం చేయడంతోపాటు ఏపీ కొత్తగా తీసుకొచ్చిన ప్రగతిశీల పారిశ్రామిక విధానాలను వివరించడానికి ఉపయోపడుతుందని ఆశిస్తున్నా.’ అని ఆ పోస్టులో తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు
లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..
Updated Date - Jul 27 , 2025 | 03:42 AM