Chandrababu Naidu: మన్యం వీరుడు అల్లూరికి ఘన నివాళి
ABN, Publish Date - Jul 05 , 2025 | 03:57 AM
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు.
జయంతి సందర్భంగా నివాళులర్పించిన బాబు, పవన్
మోగల్లులో అల్లూరి ధ్యాన కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
అమరావతి, పాలకోడేరు, గుంటూరు, జూలై 4(ఆంధ్రజ్యోతి): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్, ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి విజయానంద్ అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు జాతి పౌరుషానికి ప్రతీకగా నిలిచిన అల్లూరి పోరాట స్ఫూర్తిని, అణగారిన వర్గాలకు అండగా నిలిచే తత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళుల్పంచారు. అలాగే, టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వర్లరామయ్య, పర్చూరి అశోక్‌బాబు తదితరులు అల్లూరికి నివాళులర్పించారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అసెంబ్లీ భవనంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేర ప్రసన్న కుమార్ అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్, స్పెషల్ కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ ఘన నివాళులర్పించారు.
మోగల్లులు ధ్యాన కేంద్రం
పశ్చిమగోదావరి జిల్లా మోగల్లు గ్రామంలో అల్లూరి నడయాడిన ప్రాంతంలో నిర్మించిన అల్లూరి ధ్యాన కేంద్రాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్ నుంచి శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. అందే సమయంలో ధ్యాన కేంద్రం వద్ద.. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తనయుడు భరత్, క్షత్రియ సేవా సమితి నాయకులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, మన్యం వీరుడు అల్లూరికి నివాళులర్పించారు.
Updated Date - Jul 05 , 2025 | 03:58 AM