Chandrababu: ఉద్యమ స్ఫూర్తితో యోగాంధ్ర
ABN, Publish Date - Jun 20 , 2025 | 03:48 AM
యోగా భారతీయ వారసత్వ సంపద. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అని సీఎం చంద్రబాబు అన్నారు.
భారతీయ వారసత్వ సంపద యోగా.. ప్రజల జీవితంలో భాగస్వామ్యం చేస్తాం
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో శిక్షణ.. యోగాంధ్రలో 22 రికార్డులు బ్రేక్ చేస్తున్నాం
అందులో 2 గిన్నిస్ రికార్డులు.. రేపు రాష్ట్రంలో 2 కోట్ల మందికి పైగా
యోగాసనాలు.. దేశంలోని 7 లక్షల ప్రాంతాల్లో యోగాంధ్ర లైవ్: సీఎం
అమరావతి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): ‘యోగా భారతీయ వారసత్వ సంపద. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 21న విశాఖలో నిర్వహించనున్న యోగాంధ్రపై గురువారం ఆయన సమీక్షించారు. అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. ఉద్యమ స్ఫూర్తితో యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం యోగాకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. తొమ్మిదో తరగతి, ఆపైన చదివే విద్యార్థులతో రోజూ 10నిమిషాల పాటు యోగా చేయించడం ద్వారా వారికి చదువుపై శ్రద్ధ పెరుగుతుందన్నారు. భవిష్యత్తులో యోగా కోర్సులు ప్రవేశపెడతామని, ప్రతి స్కూల్లో వారానికి రెండు క్లాస్‌లు ఉండేవిధంగా సిలబస్ రూపొందిస్తామని పేర్కొన్నారు. గతంలో ఎన్టీఆర్ యోగా పరిషత్‌ను ఏర్పాటు చేశామని, అది తెలంగాణకు వెళ్లిపోయిందని తెలిపారు. స్వర్ణాంధ్ర తరహాలో యోగా కోసం ఒక నాన్ ఫ్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి సీఎ్‌సఆర్ నిధులతో ప్రచారం కల్పించాలని నిర్ణయించామని చెప్పారు. యోగా, నేచురోపతి కోర్సులతో ఒక డీమ్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏడాదికి లేదా రెండేళ్లకు ఒకసారి జిల్లాల్లో యోగా పోటీలు పెట్టి సర్టిఫికెట్లు జారీ చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. యోగాంధ్రలో భాగంగా గత నెల 21 నుంచి ఈ నెల 21 వరకూ అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 1.29 లక్షల ప్రాంతాల్లో 2 కోట్ల మందికి పైగా యోగాసనాలు వేయనున్నారని వివరించారు. విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమం దేశంలోని 7 లక్షల ప్రదేశాల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుందని చెప్పారు.
యోగాకు మతంతో సంబంధం లేదు
యోగాకు మతంతో సంబంధం లేదని, దేశ, విదేశాల్లో క్రైస్తవులు కూడా యోగా చేస్తున్నారని సీఎం తెలిపారు. దీనిని మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు. యోగా, ఉపవాసం వంటివి సైన్స్ అని చెప్పారు. తాను చిన్నప్పుడు తిరుపతిలో ఉన్న సమయంలో ప్రతి శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ శ్రీవారి సేవలో ఉండి, మధ్యాహ్నం తర్వాత ఆహారం తీసుకునేవాడినని సీఎం గుర్తుచేసుకున్నారు. యోగాంధ్రలో భాగంగా 22 రికార్డులు బ్రేక్ చేయబోతున్నామని సీఎం తెలిపారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో 20, గిన్నిస్ బుక్‌కు సంబంధించి రెండు రికార్డులు బ్రేక్ చేయనున్నట్లు చెప్పారు. ఒకేసారి 2కోట్ల మందిపైగా యోగా చేయడం ద్వారా ఒక రికార్డు, ఒకే ప్రదేశంలో 3లక్షల మంది యోగా చేసి మరో రికార్డు సృష్టిస్తామని వివరించారు. శుక్రవారం 25వేల మంది గిరిజన విద్యార్థులతో 1.08 నిమిషాల్లోనే 108 సూర్య నమస్కారాలు చేయిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
‘యోగిఫై’ మ్యాట్‌కు ప్రశంసలు
‘యోగిఫై’ మ్యాట్‌ను రూపొందించిన సోమిశెట్టి మురళీధర్‌ను చంద్రబాబు ప్రశంసించారు. టెక్నాలజీ, ఏఐని కలిపి మ్యాట్‌ను తయారు చేయడం అద్భుతమని కొనియాడారు. మ్యాట్ తయారీ విధానం, అదెలా పని చేస్తుందన్న విషయాలను మురళీధర్ వివరించారు. ప్రత్యేక యాప్ ద్వారా పనిచేసే ఈ మ్యాట్ ఆసనాలు వేసే సమయంలో మార్గదర్శనం చేస్తుందని, ఒకసారి చార్జింగ్ పెడితే 8గంటల పాటు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ విషయాలను సీఎం ఆసక్తిగా విన్నారు. మ్యాట్ గురించి మరిన్ని వివరాలు ఆడిగి తెలుసుకున్నారు. ఇలాంటివి ఎవరు తయారు చేసినా తాము ప్రచారం కల్పిస్తామని, మార్కెటింగ్ మాత్రం వాళ్లే చేసుకోవాలని సీఎం నవ్వుతూ అన్నారు.
Updated Date - Jun 20 , 2025 | 04:01 AM