CM Chandrababu: టువాస్ పోర్టు నిర్మాణంలో ఏఐ వినియోగం
ABN, Publish Date - Jul 29 , 2025 | 04:38 AM
సింగపూర్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న టువాస్ పోర్టును ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. రెండు గంటలపాటు పోర్టు నిర్మాణాన్ని రాష్ట్ర మంత్రులతో కలసి పరిశీలించారు.
ఆసక్తి చూపించిన చంద్రబాబు బృందం
అదే మోడల్‌లో ఏపీ పోర్టుల అభివృద్ధి
నిర్మాణ దశలు, వ్యయంపై సీఎం ఆరా
అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): సింగపూర్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న టువాస్ పోర్టును ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. రెండు గంటలపాటు పోర్టు నిర్మాణాన్ని రాష్ట్ర మంత్రులతో కలసి పరిశీలించారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్టు ఇది. ఏపీలో పెద్దఎత్తున తీర ప్రాంతం ఉందని అక్కడి అధికారులకు చంద్రబాబు తెలిపారు. తీరప్రాంతం ఆధారంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలనే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేస్తున్నామన్నారు. టువాస్ పోర్టు పరిశీలనలో భాగంగా పోర్ట్ ఆఫ్ సింగపూర్ అఽథారిటీ ప్రాంతీయ సీఈవో విన్సెంట్‌తో సీఎం సమావేశమయ్యారు. పోర్టు నిర్మాణం, నిర్వహణ కార్యకలాపాలపై ఆరాతీశారు. పోర్టు కార్యకలాపాల నిర్వహణలో కృత్రిమ మేథ (ఏఐ)లాంటి సాంకేతికాంశాలను ఏవిధంగా వినియోగిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. టువాస్ పోర్టులోని ఏఐతో కూడిన ఆటోమెషన్ వ్యవస్థను చంద్రబాబు బృందం పరిశీలించింది. పోర్టు నిర్మాణానికి అవుతున్న వ్యయం, ఎన్ని విడతలుగా నిర్మిస్తున్నారనేది తెలుసుకున్నారు. మొత్తంగా రూ.1,70 లక్షల కోట్ల వ్యయంతో పోర్టు నిర్మాణం చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఏపీలో ప్రతి 50 కిలోమీటర్ల తీరప్రాంతంలో ఓ పోర్టును నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని చంద్రబాబు వెల్లడించారు. ఏపీ పోర్టులను సింగపూర్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే అంశం గురించి అధికారులతో చంద్రబాబు బృందం సమీక్షించింది.
Updated Date - Jul 29 , 2025 | 04:38 AM