ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Central Govt: జవాబు చెప్పండి

ABN, Publish Date - Jul 04 , 2025 | 02:34 AM

పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై పలు వివరాలు, గణాంకాలు సమర్పించాలని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) రాష్ట్రాన్ని కోరింది. వరద జలాల ఆధారంగా ఈ పథకాన్ని తలపెట్టినందున..

  • బనకచర్లపై కేంద్ర జలసంఘం లేఖ

  • వరద జలాలంటే ఏంటి?.. వాటినెలా లెక్కిస్తారు?

  • ప్రాజెక్టులవారీగా నీటి వినియోగం, సాగునీటి వివరాలు సమర్పించండి

  • జలాశయాల నుంచి నీటి విడుదల లెక్కలు కూడా

  • ఏపీలో ప్రస్తుత, నిర్మాణ, ప్రతిపాదిత ప్రాజెక్టుల మ్యాప్‌ సైతం ఇవ్వండి

  • రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ స్పష్టీకరణ

  • జవాబులపై వ్యాప్కో్‌సతో కలిసి అధికారుల కసరత్తు

అమరావతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై పలు వివరాలు, గణాంకాలు సమర్పించాలని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) రాష్ట్రాన్ని కోరింది. వరద జలాల ఆధారంగా ఈ పథకాన్ని తలపెట్టినందున.. అసలు వరద జలాల నిర్వచనమేంటో చెప్పాలని, వాటిని ఎలా లెక్కిస్తారో వివరించాలని రాష్ట్రానికి సూచించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎఫ్ఆర్‌)ను రాష్ట్రప్రభుత్వం మే 26న జలసంఘానికి నివేదించిన సంగతి తెలిసిందే. దీనిని పరిశీలించిన జలసంఘం.. తన పరిశీలనలు, అభిప్రాయాలతో ప్రాథమిక నివేదికను నాలుగు రోజుల కిందట (గత నెల 30న) రాష్ట్రానికి పంపింది. అదే రోజు కేంద్ర పర్యావరణ-అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఢిల్లీలో ఈ ప్రాజెక్టుపై కొర్రీలు వేసి ప్రతిపాదనను వెనక్కి పంపడం గమనార్హం. గోదావరికి వరద సమయంలో రోజుకు 2 టీఎంసీల చొప్పున వంద రోజుల్లో 200 టీఎంసీలను పోలవరం నుంచి బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌కు తరలించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశమన్న సంగతి తెలిసిందే. అసలింత వరద ఉందా.. ఈ ప్రాజెక్టు గోదావరి జలవివాదాల ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారమే ఉందా అని జలసంఘం ప్రశ్నించడం గమనార్హం, అటు ఈఏసీ, ఇటు జలసంఘం లేవనెత్తిన సందేహాలు, అడిగిన వివరణలకు సమాధానాలు ఇచ్చేందుకు.. అన్ని రాష్ట్రాల డేటా కలిగి ఉన్న కేంద్రప్రభుత్వ సంస్థ వ్యాప్కో్‌స తో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ లోతుగా కసరత్తు చేస్తోంది.

రాష్ట్రాన్ని జలసంఘం అడిగిన డేటా ఇదీ

  • ఇంద్రావతి, శబరి, దిగువ గోదావరి సబ్‌బేసిన్లలో మిగులుజలాలు అందుబాటులో లేవని సాధ్యాసాధ్యాల నివేదికలో అధికారులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని జలవనరుల ప్రాజెక్టులు.. అనుమతులు ఉన్నవి, లేనివీ.. పూర్తయినవి, నిర్మాణంలో ఉన్న వాటి వివరాలు, ప్రతిపాదిత నీటి వినియోగం గణాంకాలు సమర్పించాలి. ఎంత నీటి అందుబాటుతో ఈ ప్రాజెక్టులు తలపెట్టారో కూడా తెలియజేయాలి.

  • రాష్ట్రంలో ప్రస్తుత, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేసే ఇండెక్స్‌ మ్యాప్‌లు సమర్పించాలి.సాగునీరు, బహుళార్థ సాధక ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ల రూపకల్పన మార్గదర్శకాల (2010) ప్రకారం.. ఏదైనా ప్రాజెక్టును పరిశీలించాలంటే.. నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిన విధంగా 75 శాతం నీటి డిపెండబిలిటీ ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఆంధ్ర సహా బేసిన్‌ రాష్ట్రాలకు గోదావరి ట్రైబ్యునల్‌ కేటాయింపులు, ప్రాజెక్టులవారీ వినియోగాన్ని లెక్కించాక.. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి 200 టీఎంసీల వరద జలాల మళ్లింపునకు ఎంత డిపెండబిలిటీ ఉందో లెక్కించి చెప్పాలి.

  • అధికారులు సమర్పించిన ఎక్సెల్‌ షీట్‌లో ఎలాంటి ఫార్ములాలు గానీ, గణాంక విధానాలు గానీ లేవు. వాటన్నిటినీ సమర్పించాలి.

  • ప్రాజెక్టులవారీగా నీటి వినియోగం డేటా, సాగు ప్రాంతం, రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల రికార్డుల గణాంకాలను మాకు పంపాలి.

  • గోదావరి ట్రైబ్యునల్‌ అవార్డు కేటాయింపులను మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిసా, తెలంగాణ, ఏపీ పూర్తిగా వాడుకున్నట్లు నివేదికలో తెలిపారు. ఆ కేటాయింపుల వినియోగం వివరాలు కూడా మాకు సమర్పించండి.

  • పోలవరం డ్యాం నుంచి వరద జలాలను.. పోలవరం కుడి ప్రధాన కాలువతో పాటు సమాంతరంగా తవ్వే కాలువ ద్వారా రోజుకు 18 వేల క్యూసెక్కుల (510 క్యూమెక్కులు) చొప్పున కృష్ణా నది(ప్రకాశం బ్యారేజీ)లోకి తరలిస్తామని నివేదికలో పేర్కొన్నారు. అయితే వరద జలాలను ఎలా లెక్కిస్తారు.. ఏ ప్రాతిపదికన లెక్కిస్తారు.. ట్రైబ్యునల్‌ అవార్డుకు అనుగుణంగానే అవి ఉన్నాయా అనే వివరాలను మాకు పంపండి.

  • రోజుకు 18 వేల క్యూసెక్కుల చొప్పున 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలంటే.. 129 రోజుల సమయం పడుతుంది. మరి ఇన్ని రోజులు వరద అందుబాటులో ఉంటుందో లేదో.. పోలవరం వద్ద వరద నీటి విడుదల లెక్కల ఆధారంగా తాజా సర్వే చేపట్టాలి. ట్రైబ్యునల్‌ అవార్డును పరిగణనలోకి తీసుకున్నారో లేదో కూడా చెప్పాలి.

సమర్థ జవాబుల కోసం కసరత్తు

పోలవరం-బనకచర్లపై జలసంఘం, ఈఏసీ గంటల వ్యవధిలోనే కొర్రీలు వేయడంతో.. వాటి సందేహాలకు సమర్థంగా సమాధానాలు సమర్పించాలని రాష్ట్ర జలవనరుల శాఖ నిర్ణయించింది. వాప్కో్‌సతో కలసి ఈ దిశగా కసరత్తు చేస్తోంది. ఈ నెల ఏడో తేదీనాటికి ఈ ప్రక్రియను కొలిక్కి తీసుకురావాలని యోచిస్తోంది. వివరాలన్నీ సిద్ధమయ్యాక.. సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు నేతృత్వంలో అధికారుల బృందాన్ని ఢిల్లీ పంపి.. సమగ్ర సమాచారాన్ని వ్యక్తిగతంగా జలసంఘానికి సమర్పించాలని నిర్ణయించింది.

Updated Date - Jul 04 , 2025 | 02:37 AM