గంజాయి చాక్లెట్లు!
ABN, Publish Date - Jul 12 , 2025 | 12:52 AM
నగరాలు, పట్టణాలు, పల్లెల్లో మత్తుకు పెరుగుతున్న డిమాండ్ గంజాయి అక్రమ రవాణాను కొత్త పుంతలు తొక్కిస్తోంది. స్మగ్లర్లు ఎప్పటికపుడు వారి మెదడుకు పదును పెడుతూ పోలీస్ శాఖకు సవాల్ విసురుతున్నారు. పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ, గంజాయిని గుర్తించేందుకు రోడ్లపై సెస్సార్‌లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిఘా ఉంచినా ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు(ఏవోబీ) నుంచి ప్రయాణం కొనసాగుతూనే ఉంది. దీని కోసం స్మగ్లర్లు గంజాయికి రోజుకో కొత్త రూపాన్ని ఇచ్చి నిర్భయంగా క్షేత్ర స్థాయికి చేరవేస్తూనే ఉన్నారు.
- రూటు మార్చిన కేటుగాళ్లు
- చాక్లెట్ రూపంలో తయారు చేసి తరలింపు
- గతంలో నూనె, పొడిగా, తెల్లటి క్రీమ్‌గా చేసి సరఫరా
- పోలీసుల కళ్లు గప్పి కొరియర్ ద్వారా అక్రమ రవాణా
- స్కూల్, కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా వ్యాపారం
నగరాలు, పట్టణాలు, పల్లెల్లో మత్తుకు పెరుగుతున్న డిమాండ్ గంజాయి అక్రమ రవాణాను కొత్త పుంతలు తొక్కిస్తోంది. స్మగ్లర్లు ఎప్పటికపుడు వారి మెదడుకు పదును పెడుతూ పోలీస్ శాఖకు సవాల్ విసురుతున్నారు. పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ, గంజాయిని గుర్తించేందుకు రోడ్లపై సెస్సార్‌లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిఘా ఉంచినా ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు(ఏవోబీ) నుంచి ప్రయాణం కొనసాగుతూనే ఉంది. దీని కోసం స్మగ్లర్లు గంజాయికి రోజుకో కొత్త రూపాన్ని ఇచ్చి నిర్భయంగా క్షేత్ర స్థాయికి చేరవేస్తూనే ఉన్నారు.
(ఆంధ్రజ్యోతి విజయవాడ సిటీ):
ఐదేళ్ల క్రితం ఐవోబీ నుంచి గంజాయి ఆకులను కూరగాయల బుట్టల్లోనూ, వస్తు సామగ్రి మధ్యలోనూ, ఆయిల్ ట్యాంకర్‌లలోనూ, దేవుడు పటాల వెనుక ఉంచి స్మగ్లింగ్ చేశారు. ఆ తర్వాత వాసన బయటకు రాకుండా ఆకర్షణీయమైన ప్యాకెట్లలోకి గంజాయిని చేర్చారు. నాలుగేళ్ల క్రితం ప్లాస్టిక్ వేజలైన డబ్బాల్లోకి.. వేజలైన రూపంలోనే తెల్లగా ఉండేలా తయారు చేసి కేసరపల్లి వద్ద పట్టుబడ్డారు. మూడేళ్ల క్రితం గంజాయి ఆకులను లిక్విడ్‌గా మార్చి కొబ్బరి నూనె సీసాల్లో పోసి రవాణా చేశారు. ఆ తర్వాత పోడులుగా మార్చారు. ప్రస్తుతం గంజాయికి చాక్లెట్ రూపాన్ని ఇచ్చి అందమైన ప్యాకెట్‌లోకి చేర్చారు. ఈ చాక్లెట్‌లకు అందమైన డిజైన ఇవ్వడంతో పాటు చార్మినార్ గోల్డ్ వంటి బ్రాండెడ్ కంపెనీ పేరును చాక్లెట్ ప్యాకెట్‌కు అతికించారు.
అక్రమ రవాణాకు కొరియర్ సర్వీసులు
వాహనం సీజ్, జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు కొరియర్ మార్గాన్ని ఎంచుకుని అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్న ఉదంతాలు ఇటీవల కాలంలో అనేకం వెలుగు చూశాయి. కొరియర్ సంస్థలకు పాడుబడి, ఎవరూ ఉండని ఇళ్ల అడ్రస్‌లను ఇచ్చి రవాణా చేస్తున్నారు. ఇదే వ్యవహారాన్ని గతంలో విజయవాడ పోలీసులు బహిర్గతం చేశారు. కొన్ని ప్రైవేటు ట్రాన్సపోర్ట్ కంపెనీలను సైతం కేటుగాళ్లు కేసుల్లో ఇరికించిన ఉదంతాలు ఉన్నాయి.
స్కూల్, కాలేజీ విద్యార్థులే లక్ష్యం
గడిచిన ఐదేళ్లలో గంజాయి నగరాలను దాటి పట్టణాలు, పల్లెలకు విస్తరించిన విషయం తెలిసిందే. 13 నుంచి 22 ఏళ్ల వయసున్న యువత నేడు గంజాయికి బానిసలయ్యారు. ఎనిమిది, తొమ్మిది తరగతి విద్యార్థులను సైతం స్మగ్లర్లు అక్రమ రవాణాకు వాడుకుంటున్నారు. యువతకు పెద్ద పెద్ద మాల్స్‌లో జల్సా లైఫ్‌ను రుచి చూపించి కొరియర్‌లుగా మార్చేస్తున్న వైనాన్ని గతంలో పోలీసులు గుర్తించి, బాధ్యులైన స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు. విద్యా సంస్థల్లో మత్తుకు పెరిగిన డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు గంజాయిని చాక్లెట్ రూపంలోకి మార్చారు. ఒక్కో చాక్లెట్‌ను రూ.20 నుంచి రూ.50కి విక్రయిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా పాలల్లో సైతం కలిపి తాగేందుకు వీలుగా గంజాయి మొత్తటి పొడి(బూస్ట్, హార్లిక్స్ రంగుల మాదిరి)గా తీర్చిదిద్దుతున్నారు. ఇంట్లో వారికి సైతం అనుమానం రాకుండా ఉండటంతో మత్తుకు బానిసలైన యువతీయువకులు ఈ పొడి, చాక్లెట్‌లను ఇష్టపడుతున్నట్లు పోలీసు విచారణలో తేలింది. విజయవాడ నగరంలోని చిల్లర దుకాణాలు, బడ్డీ కొట్లలో వీటి విక్రయాలు ఊపందుకుంటున్నట్లు పోలీసు శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బడ్డీ కొట్లు, చిల్లర దుకాణాల్లో తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. జనావాసాలకు కాస్త దూరంగా ఉండే దుకాణాల్లో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల సమీపంలోని దుకాణాల్లో జరిపిన సోదాల్లో పలు చోట్ల గంజాయి మూలాలను గుర్తించారు.
Updated Date - Jul 12 , 2025 | 12:52 AM