Family Appeal: మా అమ్మను భారత్‌కు రప్పించండి
ABN, Publish Date - Jul 27 , 2025 | 04:16 AM
జీవనోపాధి కోసం కువైట్ వెళ్లిన తమ తల్లిని స్వదేశానికి తిరిగి రప్పించాలని ఆమె పిల్లలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ప్రభుత్వానికి కుటుంబసభ్యుల వినతి
జీవనోపాధి కోసం 3నెలల క్రితం కువైత్‌కు
కొయ్యలగూడెం, జూలై 26(ఆంధ్రజ్యోతి): జీవనోపాధి కోసం కువైట్ వెళ్లిన తమ తల్లిని స్వదేశానికి తిరిగి రప్పించాలని ఆమె పిల్లలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఏలూరు జిల్లా బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన మర్రిపూడి సుమ 3 నెలల క్రితం కువైత్‌లో ఇంటి పనులు చేసేందుకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేస్తానని కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సుమ సమాచారం ఇచ్చారు. అక్కడి యాజమానులు ఆమె ఫోన్ తీసుకుని తమతో మాట్లాడనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీడీపీ మండల అధ్యక్షుడు పారేపల్లి నరేశ్ వద్ద శనివారం మొరపెట్టుకున్నారు. ఎంపీ పుట్టా మహేశ్ ద్వారా విషయాన్ని మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే ఆమెను భారత్‌కు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని నరేశ్ వారికి తెలిపారు.
Updated Date - Jul 27 , 2025 | 04:25 AM