హామీల అమలులో ప్రభుత్వం విఫలం: బొత్స
ABN, Publish Date - Aug 02 , 2025 | 05:49 AM
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
విశాఖపట్నం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. వైసీపీ ఒత్తిడి ఫలితంగానే అమ్మఒడి పథకాన్ని అరకొరగా వాయిదాల పద్ధతిలో అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలుకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. హత్యలు సర్వసాధారణమైపోయాయి. పాలనను పూర్తిగా గాలికి వదిలేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. జగన్ పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు విధించడం దారుణం. మా పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగితే అధినేత పరామర్శించడం తప్పా? గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖలో డ్రగ్స్‌తో యువకులు పట్టుబడ్డారు. ఆ యువకులు అధికార పార్టీకి చెందిన నేతల సన్నిహితులు, బంధువులంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో యథేచ్ఛగా భూ దోపిడీ జరుగుతోంది. లులూ సంస్థకు ఉద్యోగాల కోసం భూములు ఇస్తున్నారా?, లాలూచీ పడి ఇస్తున్నారా?’ అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, శాసనమండలి సభ్యులు పెనుమత్స వీరవెంకట సూర్యనారాయణరాజు పాల్గొన్నారు.
Updated Date - Aug 02 , 2025 | 05:50 AM