‘వైట్ కాలర్’లో బ్లాక్ మనీ
ABN, Publish Date - Jul 09 , 2025 | 01:20 AM
యూపిక్స్ సినీ యానిమేషన్స్ సంస్థలో కోట్లాది రూపాయలుగా వచ్చిన పెట్టుబడిలో నల్లధనం ఉందా? కోట్లు పెట్టుబడిగా పెట్టామని లబోదిబోమంటున్న బాధితుల చేతికి నల్ల మరక అంటుకుందా? అంటే అవుననే సమాధానం దర్యాప్తు బృందాల నుంచి వస్తోంది. రూ.లక్ష పెట్టుబడిగా పెడితే ఏడాది తర్వాత రూ.2లక్షలు ఇస్తానని నిడుమోలు కిరణ్ ప్రకటన చేయగానే జనం ఎగబడి డబ్బులు పెట్టారు. కొంతమంది కోట్లాది రూపాయలు పెట్టారు. ఇలా యూపిక్స్‌లోకి పెట్టుబడిగా వచ్చిన మొత్తంలో నల్లధనం ఎక్కువగా ఉందని పోలీసులు గుర్తించారు.
అద్విక, యూపిక్స్ ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం!
న్యాయస్థానంలో మెమో దాఖలు చేయాలని అధికారుల నిర్ణయం
యూపిక్స్ యజమాని కిరణ్ పేరుతో రూ.23కోట్ల ఆస్తులు
అద్విక ఆదిత్య పేరుతో రూ.10కోట్ల ఆస్తులు ఉంటాయని అంచనా
యూపిక్స్ సినీ యానిమేషన్స్ సంస్థలో కోట్లాది రూపాయలుగా వచ్చిన పెట్టుబడిలో నల్లధనం ఉందా? కోట్లు పెట్టుబడిగా పెట్టామని లబోదిబోమంటున్న బాధితుల చేతికి నల్ల మరక అంటుకుందా? అంటే అవుననే సమాధానం దర్యాప్తు బృందాల నుంచి వస్తోంది. రూ.లక్ష పెట్టుబడిగా పెడితే ఏడాది తర్వాత రూ.2లక్షలు ఇస్తానని నిడుమోలు కిరణ్ ప్రకటన చేయగానే జనం ఎగబడి డబ్బులు పెట్టారు. కొంతమంది కోట్లాది రూపాయలు పెట్టారు. ఇలా యూపిక్స్‌లోకి పెట్టుబడిగా వచ్చిన మొత్తంలో నల్లధనం ఎక్కువగా ఉందని పోలీసులు గుర్తించారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
కొద్దిరోజులు అద్విక, యూపిక్స్ సంస్థల అధినేతలను పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. యూపిక్స్ అధినేత కిరణ్ ముందుగా పల్నాడు జిల్లా నుంచి వసూళ్ల పర్వం ప్రారంభించాడు. ఇలా ఒక్కో జిల్లా దాటుకుంటూ విజయవాడలో అడుగుపెట్టాడు. ఇందులో మొత్తం రూ.178 కోట్లు పెట్టుబడులుగా వచ్చాయని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఈ మొత్తంలో సగం వరకు నల్లధనం ఉందని భావిస్తున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు, ముగ్గురు ఒక గ్రూపుగా ఏర్పడి కోట్లలో పెట్టుబడి పెట్టినట్టు తేలింది. వాళ్లంతా చుట్టుపక్కల ఉన్న వారిలో ఆశలు రేకెత్తించడానికి ఈ విధంగా గ్రూపుగా ఏర్పడ్డారని గ్రహించారు. ఈ గ్రూపు మొత్తం సుమారుగా రూ.50-60కోట్లు పెట్టుబడిగా పెట్టింది. ఇదంతా నల్లధనమే అని పోలీసులు గుర్తించారు.
ఆస్తుల జప్తునకు అడుగులు
రెట్టింపు అన్న పదాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్లి కోట్లాది రూపాయలను వసూలు చేసి నిలువునా ముంచేసిన అద్విక ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్, యూపిక్స్ సినీ యానిమేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానుల పేరుతో ఉన్న ఆస్తులను జప్తు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆస్తులను గుర్తించిన అధికారులు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నారు. వాటిని జప్తు చేయాలని న్యాయస్థానంలో మెమో దాఖలు చేయబోతున్నారు. యూపిక్స్ అధినేత నిడుమోలు కిరణ్ పేరుతో రూ.23కోట్ల ఆస్తులు ఉన్నట్టు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అద్విక ట్రేడింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య పేరున సుమారుగా రూ.10 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయన్న అంచనా వేశారు. వీటిని జప్తు చేయడం ద్వారా బాధితులకు న్యాయం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు కంపెనీలలో మోసపోయిన బాధితుల లెక్కలను పోలీసులు పక్కాగా తేల్చారు. యూపిక్స్ కంపెనీలో రూ.178కోట్ల లావాదేవీలు జరిగినట్టు అధికారులు నిర్థారించారు. అందులో రూ.123 కోట్లు ఏజెంట్లకు కస్టమర్లకు చెల్లించినట్టు తేలింది. ఈ డబ్బులతో ఆ కంపెనీ ఎండీ కిరణ్ పలుచోట్ల స్థిరాస్తులను కొన్నట్టు నిర్థారించారు.
ఫారెక్స్ ట్రేడింగ్‌లో అద్విక
అద్విక ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ఆదిత్య ఏజెంట్లు, కస్టమర్ల ద్వారా సేకరించిన డబ్బులను దుబాయిలోని ఫారెక్స్ ట్రేడింగ్‌లో పెట్టినట్టు అధికారులు గుర్తించారు. ఇక్కడి నుంచి హవాలా మార్గంలో దుబాయికి ఈ డబ్బులను ఆదిత్య పంపించాడు. ఈ ఫారెక్స్ ట్రేడింగ్‌లో షేర్ల విలువ రోజురోజుకు పడిపోతున్నట్టు దర్యాప్తు బృందాలు కనుగొన్నాయి. రెండు రోజుల క్రితం వరకు రూ.3.50లు ఉన్న షేరు విలువ మంగళవారం నాటికి మూడు రూపాయలకు పడిపోయింది. ఇలా పడిపోతే అసలుకే నష్టం వస్తుందని కమిషనరేట్ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. కస్టమర్ల ద్వారా ఆదిత్య పెట్టుబడులుగా తీసుకొన్న డబ్బులను ఫారెక్స్ ట్రేడింగ్‌లో పెట్టినట్టు డీజీపీకి తెలియజేశారు. దీనిపై ఒక నిర్ణయాన్ని తీసుకోవలసి ఉందని సమాచారం ఇచ్చారు. ఫారెక్స్ ట్రేడింగ్‌లో ఉన్న షేర్లను మూసివేస్తే ఆ డబ్బు వెంటనే హవాలా రూపంలో ఆదిత్యకు చేరుతుంది. ఇలా చేస్తే లేనిపోని ఆరోపణలను మూటకట్టుకోవాల్సి వస్తుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల, న్యాయనిపుణుల సలహా తీసుకుని ఆ డబ్బును రప్పించడానికి రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి న్యాయస్థానంలో ఒక పిటిషన దాఖలు చేసి ఒక అకౌంటు తెరిచి అందులో ఈ డబ్బులను జమ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ డబ్బులు బాధితులకు న్యాయస్థానం ద్వారా ఇప్పిస్తే పోలీసులపై ఆరోపణలు చేసే అవకాశం ఉండదని యోచిస్తున్నారు.
Updated Date - Jul 09 , 2025 | 01:20 AM