నల్లమలలో జీవవైవిఽధ్యం
ABN, Publish Date - May 21 , 2025 | 11:25 PM
నల్లమల జీవ వైవిధ్యానికి మారుపేరు. నల్లమల జీవవైవిధ్య సమతౌల్యాన్ని సజావుగా సాగిస్తూ జీవుల మనుగడకు తోడ్పాటునందిస్తోంది.
ప్రపంచీకరణతో వెంటాడుతున్న ముప్పు
అంతరించిపోయిన పలు జీవులు
నేడు అంతర్జాతీయ జీవవైవిధ్య దినం
ఆత్మకూరు, మే 21(ఆంధ్రజ్యోతి): నల్లమల జీవ వైవిధ్యానికి మారుపేరు. నల్లమల జీవవైవిధ్య సమతౌల్యాన్ని సజావుగా సాగిస్తూ జీవుల మనుగడకు తోడ్పాటునందిస్తోంది. ప్రత్యేకించి పర్యావరణ పరిరక్షణకు ప్రతిబింబంగా నిలిచే పెద్దపులుల ఆవాసానికి కీలకమైన నల్లమల అడవులు ప్రకృతి నిధులుగా, సహజ సంపదలుగా వేల సంవత్సరాల నుంచి ఎంతో విశిష్టతను సంతరించుకున్నాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నల్లమలలో ప్రస్తుతం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రపంచీకరణ వల్ల జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లుతోంది. పలు జీవుల ఉనికే కనుమరుగైపోయింది. ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్యం దెబ్బతింటున్న సందర్భంలో ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి సకల జీవుల సంరక్షణకు తోడ్పాటునందించాలన్న సంకల్పంతోనే ప్రతిఏటా మే 22వ తేదిన అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి పిలుపు ఇచ్చింది.
నల్లమలలో సుమారు 1500 రకాల వృక్షజాతులు, 200 రకాల పక్షిజాతులు, 80రకాల గడ్డిజాతులు, 350 రకాల ఔషదమొక్కలు, 55 రకాల మత్స్యసంపద, 80రకాల సరీసృపాలు, 20 రకాల ఉభయ చరజీవులకు నల్లమల అడవులు ఆవాసాన్ని కల్పిస్తున్నాయి. ప్రత్యేకించి పర్యావరణ సూచికలో త్రికోణ అగ్రభాగాన నిలిచిన పెద్దపులి ఆవాసానికి సైతం నల్లమల అనుకూలంగా వుంది. ఎంతో సున్నితమైన జీవనం సాగించే పులుల ఎక్కడైతే ఆవాసాన్ని ఏర్పర్చుకుంటాయో ఆ ప్రాంతం పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతాయని చెప్పవచ్చు. వాస్తవానికి జాతీయ అటవీ విధానం ప్రకారం భూవిస్తీర్ణంలో 33శాతం అడవులు ఉండాల్సి వుండగా ప్రపంచవ్యాప్తంగా 31శాతం అటవీ విస్తీర్ణం వుండగా మన దేశంలో మాత్రం కేవలం 23శాతం మాత్రమే అడవులు విస్తరించి ఉన్నాయి. అయితే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రం 21శాతం మాత్రమే అడవుల విస్తీర్ణం వున్నట్లు తెలుస్తోంది. అంటే జిల్లా వ్యాప్తంగా 17,658 చ.కి.మీల విస్తీర్ణం వుండగా అందులో 3482.65చ.కిమీల విస్తీర్ణంలో మాత్రమే అడవులు విస్తరించాయి.
ఈ పరిస్థితి వల్ల నల్లమలలో అనేక జీవ జాతులు అంతరించిపోతున్నాయి. ప్రత్యేకించి రాబందుల సంచారం నల్లమలలో కనుమరుగైంది. అలాగే పిచ్చుక జాతులు ఉనికే లేకుండా పోయింది నల్లమలలో ఒకప్పుడు విస్తారంగా ఉండే జిట్రేగి, బంక చెట్లు నేడు కనుమరుగయ్యాయి. పలు నీటి కుంటలు, సరస్సుల్లో గుర్రపుడెక్క అల్లుకుపోవడం వల్ల జలచరాల జీవనానికి ఇబ్బందిగా మారుతున్నట్లు తెలుస్తోంది.
సుస్థిరమైన అభివృద్ది కోసం అటవీశాఖ కసరత్తు :
సుస్థిరమైన జీవ వైవిధ్యాన్ని అభివృద్ధి పరిచేందుకు అటవీశాఖ ఎంతగానే కసరత్తు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రత్యేకించి జీవవైవిధ్య సంరక్షణలో భాగంగా జీవజాతులకు అవసరమయ్యే ఆహారం, ఆవాసం, తాగునీటిని సమకూర్చేందుకు అటవీశాఖ చొరవ తీసుకుంటున్నది. వీటితో పాటు అడవుల పరిరక్షణ, అభివృద్ధి, రక్షణ అనే అంశాలను పరిగణలోకి తీసుకుని అటవీశాఖ ముందుకెళ్తోంది. ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల పరిధిలో వున్న నల్లమల అడవుల్లో 3727.82 చ.కిమీలో నాగార్జునసాగర్ - శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం విస్తరించింది. ఇందులో పెద్దపులి ఆవాసానికి అనువైన ప్రాంతమైన కోర్‌ఏరియా 1250.46 చకిమీలు కాగా, గుండ్లబ్రహ్మేశ్వర అభయారణ్యంలోని కోర్- ప్రాంతం 1193.68 చకిమీలు ఉంది.
జీవవైవిధ్య సంరక్షణలో ఆదివాసుల పాత్ర :
వందల ఏళ్ల నుంచే అడవి తల్లికి ఆదివాసులే అండగా నిలుస్తున్నారు. అటవీశాఖ ఆవిర్భావానికి మునుపే అటవీరక్షణలో చెంచులు రాణిస్తున్నారు. వృక్షసందపను కొల్లకొట్టే స్మగ్లర్లను, వన్యప్రాణులను వేటాడే వేటగాళ్లపై అనేక సందర్భాల్లో ఎదిరించి అటవీ రక్షణలో భాగస్వాములై జీవవైవిధ్య సంరక్షణకు పాటుపడుతున్నారు. అయితే ప్రస్తుతం అటవీరక్షణలో చెంచులకు అటవీశాఖ సరైన ప్రాముఖ్యత కల్పించడం లేదు.
జీవవైవిధ్య పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి - సాయిబాబా, డిప్యూటీ డైరెక్టర్, ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్
అడవుల సంరక్షణలో ప్రజలు భాగమైనప్పుడే జీవవైవిధ్యాన్ని పరిరక్షించే అవకాశం వుంటుంది. జీవవైవిధ్య సంరక్షణకై అటవీశాఖ అనేక విధాలుగా కృషి చేస్తున్నది. దీనికి అనేక ప్రచార సాధనాల ద్వారా చర్యలు తీసుకుంటున్నది.
Updated Date - May 21 , 2025 | 11:25 PM