బెజవాడ ఆటోనగర్‌కు కష్టమొచ్చింది!
ABN, Publish Date - Mar 19 , 2025 | 01:19 AM
ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆటోనగర్‌గా ప్రసిద్ధి చెందిన విజయవాడ జవహర్ ఆటోనగర్ నేడు టెక్నీషియన్స్ సమస్యతో సతమతమవుతోంది. 20 వేల మంది మెకానిక్ మేస్ర్తీలు, సీనియర్ మెకానిక్‌లు, హెల్పర్లతో కోలాహంగా ఉండే యూనిట్లు 1700 మందితో అతికష్టంపై నెటు ్టకొస్తున్నాయి. మారుతున్న ఆటోమొబైల్ రంగానికి అనుగుణంగా కొత్తతరం రాక నిలిచిపోవడంతో రోజురోజుకు సేవలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లాకే ఆటోనగర్ సేవలు పరిమితమయ్యాయి. పూర్వపు రోజుల్లో ఉన్న టెక్నీషియన్లలో ప్రస్తుతం కేవలం 18 శాతం లోపు మాత్రమే ఉన్నారు. దాదాపుగా 82 శాతం మంది టెక్నీషియన్ల కొరతను జవహర్ ఆటోనగర్ ఎదుర్కొంటోంది.
-తీవ్రంగా వేధిస్తున్న టెక్నీషియన్స్ కొరత
-20 వేల మంది నుంచి 1700 తగ్గిన సంఖ్య
-మెకానిక్ మేస్ర్తీలు, సీనియర్ మెకానిక్‌లు,హెల్పర్లు లేక ఖాళీగా యూనిట్లు
-ఆగిపోయిన ఇతర జిల్లాల నుంచి వచ్చే లారీలు
- కేవలం ఉమ్మడి కృష్ణాజిల్లాకే సేవలు పరిమితం
- ఉన్న వారిని కాపాడుకునే పనిలో ఆటోనగర్ టెక్నీషియన్స్ అసోసియేషన్
ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆటోనగర్‌గా ప్రసిద్ధి చెందిన విజయవాడ జవహర్ ఆటోనగర్ నేడు టెక్నీషియన్స్ సమస్యతో సతమతమవుతోంది. 20 వేల మంది మెకానిక్ మేస్ర్తీలు, సీనియర్ మెకానిక్‌లు, హెల్పర్లతో కోలాహంగా ఉండే యూనిట్లు 1700 మందితో అతికష్టంపై నెటు ్టకొస్తున్నాయి. మారుతున్న ఆటోమొబైల్ రంగానికి అనుగుణంగా కొత్తతరం రాక నిలిచిపోవడంతో రోజురోజుకు సేవలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లాకే ఆటోనగర్ సేవలు పరిమితమయ్యాయి. పూర్వపు రోజుల్లో ఉన్న టెక్నీషియన్లలో ప్రస్తుతం కేవలం 18 శాతం లోపు మాత్రమే ఉన్నారు. దాదాపుగా 82 శాతం మంది టెక్నీషియన్ల కొరతను జవహర్ ఆటోనగర్ ఎదుర్కొంటోంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
రాష్ట్ర వ్యాప్తంగా అనేక దశాబ్దాల పాటు విస్తృతంగా సేవలందించిన విజయవాడ జవహర్ ఆటోనగర్ నేడు టెక్నీషియన్ల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఇక్కడ పనిచేసే టెక్నీషియన్లలో ప్రధానంగా మెకానిక్ మేస్ర్తీలు, సీనియర్ మెకానిక్‌లు ఉంటారు. ఆ తర్వాత హెల్పర్లు. పూర్వపు రోజుల్లో టెక్నీషియన్స్ కేటగిరిలో 20 వేల మంది వర్కర్లు, హెల్పర్లు ఉండేవారు. ఇందులో రెండు వేల మంది మెకానిక్ మేస్ర్తీలు, సీనియర్ మెకానిక్‌లు ఉండేవారు. హెల్పర్లు 18 వేల మంది వరకు ఉండేవారు. ప్రస్తుతం అందరూ కలిపి 1700 మంది మాత్రమే ఉన్నారు. దీనిని బట్టి జవహర్ ఆటోనగర్‌కు ఏ స్థాయిలో టెక్నీషియన్స్ కొరత ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఆటోనగర్ టెక్నీషియన్స్ అసోసియేషన్ (ఏటీఏ) కూడా ఈ కొరతను అధిగమించటానికి ఏమీ చేయలేకపోతోంది. ఉన్న వాళ్ల సంక్షేమం, వారి ఇబ్బందులు వంటి అంశాల మీదనే దృష్టి సారించ గలుగుతోంది.
నిలిచిపోయిన కొత్తతరం రాక
ఆటోనగర్‌లో పూర్వం పనిచేసిన 20 వేల మంది టెక్నీషియన్స్ పిల్లలు వారసత్వంగా ఈ వృత్తిలోకి రావటం ఆగిపోయింది. ప్రధానంగా వారి పిల్లలు ఇంజనీరింగ్, మెడిసిన్, సీఏ వంటి ఉన్నత చదువులు చదుకుని స్థిరపడిపోయారు. దీంతో వంశపారంపర్యంగా టెక్నీషియన్స్ వృద్ధి చెందలేదు. ఇది ఒక ప్రధాన కారణమైతే.. ఆటోమొబైల్ రంగంలో గత కొంత కాలంగా వస్తున్న అనూహ్య మార్పులు మరో కారణం. గతంలో లారీలకు మరమ్మతులు చేయాలంటే మెకానిక్‌ల నైపుణ్యం మీద ఉండేది. ఇప్పుడొస్తున్న ఆధునిక లారీలను బాగు చేయాలంటే మెకానిక్‌ల కష్టం కంటే కూడా స్మార్ట్ వర్క్ ఎక్కువ పాత్ర పోషిస్తోంది. హై ఎండ్ లారీలకు మరమ్మతులు చేయాలంటే ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు ఉంటే సరిపోతోంది. బీఎస్-4, బీఎస్-6 వాహనాలు వచ్చాక అధునాతన లారీలకు మరమ్మతులు చేయాల్సి వస్తే పాత సంప్రదాయ మెకానిక్‌ల సామర్థ్యం సరిపోవటంలేదు. స్మార్ట్ టెక్నీషియన్స్ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో విజయవాడ ఆటోనగర్‌కు లారీలను తీసుకురావాల్సిన పని లేకుండా యజమాని గ్యారేజీ దగ్గరకు వారే వెళ్లి మరమ్మతులు చేసేస్తున్నారు. అలా అని సంప్రదాయ మెకానిక్‌లకు డిమాండ్ తగ్గలేదు. ఉమ్మడి కృష్ణాజిల్లానే పరిగణనలోకి తీసుకుంటే 45 వేల లారీలు ఉన్నాయి. వీటిలో 25 వేల లారీలు పెద్ద, చిన్న ట్రిప్పర్లు కాగా, మరో 20 వేల లారీలు నేషనల్ పర్మిట్స్ కలిగినవి ఉన్నాయి. వీటిలో సింహ భాగం పాతవే కావటంతో సంప్రదాయ మెకానిక్‌లపైనే ఎక్కువుగా ఆధారపడి ఉన్నారు.
ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచే..
జవహర్ ఆటోనగర్ విజయవాడలో ఉండటంతో నగరంలోని ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది యజమానులు ఇటు రావటం తగ్గించేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన లారీ యజమానులు మాత్రమే ప్రస్తుతం విజయవాడ వస్తున్నారు. ఇక్కడకు ఇతర జిల్లాల నుంచి వస్తే లారీ యజమానులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మెకానిక్ యూనిట్స్ దగ్గర లారీలను పార్కింగ్ చేసే సదుపాయాలు లేవు. మెకానిక్‌లు తక్కువుగా ఉండటం వల్ల డ్రైవర్, క్లీనర్‌లను రెండు, మూడు రోజుల పాటు ఇక్కడే ఉంచాల్సి వస్తోంది. దీంతో వీరంతా కూడా స్థానిక లాడ్జిలలో ఉండటం వల్ల వారికి రోజుకు రూ. 2 వేలు చొప్పున ఎన్ని రోజులుంటే అంత మేర ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది యజమానులకు ఆర్థిక భారంగా మారుతోంది. దీనికి తోడు ప్రతి జిల్లాలో కూడా ఆటోనగర్ల తరహాలో పారిశ్రామిక వాడలు విస్తరించటం వల్ల కూడా వారు స్థానికంగా రిపేర్లు చేయించుకోవటానికే ఆసక్తి చూపిస్తున్నారు. నెల్లూరు, కడప, అనంతపురం తదితర అనేక చోట్ల స్థానికంగా పారిశ్రామికవాడలు అభివృద్ధి చెందటం వల్ల కూడా విజయవాడ జవహర్ ఆటోనగర్‌కు లారీలు రావటం గణనీయంగా తగ్గిపోయింది.
అప్రంటీస్‌తో విధానంతో మేలు
టెక్నీషియన్స్ కొరతను తీర్చటంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని ఏటీఏ వర్గాలు చెబుతున్నాయి. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ మెకానిక్ విభాగాలు పూర్తి చేసిన వారికి ఆరు నెలల పాటు ఖచ్చితంగా ఆటోనగర్‌లోని మెకానిక్‌ల దగ్గర అప్రంటీస్‌గా పనిచేయించే విధానాన్ని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఒకరి దగ్గరే ఆరు నెలలు కాకుండా ఒక్కొక్కరి దగ్గర రెండు నెలల పాటు అప్రంటీస్ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నారు. దీని వల్ల చదువుకున్న మెకానిక్స్‌కు స్కిల్ డెవలప్‌మెంట్ (నైపుణ్యాభివృద్ధి) పెంపొందుతుందని అంటున్నారు. అప్రంటీస్ పూర్తయిన వారు ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా సొంతంగా వర్క్‌షాప్‌లు పెట్టుకోవటానికి కూడా దోహదపడుతుందని చెబుతున్నారు. లేనిపక్షంలో మరో దశాబ్ద కాలంలో తమ యూనిట్స్‌ను మూసివేసుకోవాల్సి వస్తుందని అంటున్నారు.
Updated Date - Mar 19 , 2025 | 01:19 AM