మంగినపూడిలో బీచ్ ఫెస్టివల్
ABN, Publish Date - Apr 30 , 2025 | 01:34 AM
మంగినపూడి బీచ్‌లో ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జాతీయస్థాయి బీచ్ కబడ్డీ, పడవ పోటీలు, పారాగ్లైండింగ్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బీచ్ ఫెస్టివల్ ఏర్పాటుపై జాయింట్ కలెక్టరు గీతాంజలి శర్మ, మెప్మాపీడీ సాయిబాబు, ఆర్‌అండ్‌బీ, పంచాయితీరాజ్, రెవెన్యూ, పర్యాటకశాఖ అధికారులతో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం సమీక్షించారు.
- 15 నుంచి మూడు రోజుల పాటు నిర్వహణ
- జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ, పడవ పోటీలు
- పారాగ్లైడింగ్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు
- నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి రవీంద్ర సమీక్ష
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి):
మంగినపూడి బీచ్‌లో ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జాతీయస్థాయి బీచ్ కబడ్డీ, పడవ పోటీలు, పారాగ్లైండింగ్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బీచ్ ఫెస్టివల్ ఏర్పాటుపై జాయింట్ కలెక్టరు గీతాంజలి శర్మ, మెప్మాపీడీ సాయిబాబు, ఆర్‌అండ్‌బీ, పంచాయితీరాజ్, రెవెన్యూ, పర్యాటకశాఖ అధికారులతో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం సమీక్షించారు. ప్రస్తుతం బీచ్‌కు వెళ్లే రోడ్డును విస్తరించాలని ఆర్‌అండ్‌బీ ఆధికారులను మంత్రి ఆదేశించారు. జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ, పడవ పోటీలు, పారాగ్లైడింగ్, వాటర్ స్పోర్ట్స్, స్టాల్స్, ఫుడ్ కోర్టుల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు స్థలాలను పరిశీలించారు. మంగినపూడి బీచ్‌కు వచ్చే వాహనాల రాకపోకలకు అనువైన పార్కింగ్‌పై చర్చించారు. బీచ్‌కు, దత్తరామేశ్వరం, పోలీసు ఔట్ పోస్టు వరకు వచ్చే పర్యాటకులకు అనువైన మార్గంపై సమీక్షించారు. దీనిపై మెప్మా పీడీ సాయిబాబు రూపొందించిన మ్యాప్‌ను మంత్రి పరిశీలించారు. 2018లో బీచ్ ఫెస్టివల్‌కు వచ్చిన పర్యాటకుల సంఖ్య ఈ సారి రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు.
ప్రముఖ పర్యాటక కేంద్రంగా మంగినపూడి బీచ్
ప్రముఖ పర్యాటక కేంద్రంగా మంగినపూడి బీచ్‌ని అభివృద్ధి చేస్తామని మంత్రి రవీంద్ర తెలిపారు. కోస్తాతీర ప్రాంతంలో పర్యాటకులకు మంగినపూడి బీచ్ అనువైన ప్రాంతమన్నారు. బీచ్‌లో నిర్వహించే ఫెస్టివల్‌లో యువతకు స్ఫూర్తిని ఇచ్చేలా సాహస ఆటల పోటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతీయ బీచ్ కబడ్డీ, వాటర్ రైడింగ్, వాటర్ గేమ్స్ ఉంటాయన్నారు. పడవ పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు వచ్చే అవకాశం ఉందన్నారు.
స్వదేశీ దర్శన్ కింద 150 ఎకరాల్లో ఒక మెగా ప్రాజెక్టు
మంగినపూడి బీచ్‌ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందించామని మంత్రి తెలిపారు. స్వదేశీ దర్శన్ కింద 150 ఎకరాల్లో ఒక మెగా ప్రాజెక్టు డిజైన్ చేసి కేంద్రప్రభుత్వానికి పంపామని చెప్పారు. ఆ ప్రాజెక్టు కింద నిధులు మంజూరైతే వివిధ ప్రైవేటు, పబ్లిక్ రంగ సంస్థలు రూ.1500 కోట్లతో స్టార్ హోటల్స్, రిసార్టులు నిర్మించేందుకు మందుకు వస్తాయని తెలిపారు. హైదరాబాద్ నుంచి గన్నవరానికి విమానంలో వచ్చే పర్యాటకులు గంటలో మంగినపూడి బీచ్‌కు చేరుకునే అవకాశం ఉందన్నారు. వారాంతపు సెలవులు గడిపేందుకు యాత్రికులు వచ్చే విధంగా బీచ్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. మచిలీపట్నం గేట్‌వే ఆఫ్ అమరావతిగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు హసీంబేగ్, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, లంకే శేషగిరి, లంకే హరికృష్ణ, మాజీ జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 01:34 AM