Revenue Department: వేగంగా మ్యుటేషన్లు
ABN, Publish Date - Jun 30 , 2025 | 03:15 AM
రోజుల తరబడి ఎదురు చూపుల్లేవు.. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనీ లేదు... ఆటోమ్యుటేషన్ విధానంతో రాష్ట్రంలో ప్రజల కష్టాలకు చెక్ పడింది. ఒకప్పుడు ఆస్తి బదలాయింపు ప్రక్రియ ఒక పెద్ద ప్రహసనంగా ఉండేది.
రోజుల తరబడి ఎదురుచూపులకు స్వస్తి
ఆఫీసుల చుట్టూ తిరగకుండానే పని పూర్తి
రిజిస్ర్టేషన్ పూర్తయిన వెంటనే ఆటోమేటిగ్గా
వెబ్‌ల్యాండ్‌లో యాజమాన్య హక్కుల బదిలీ
మున్సిపాలిటీల్లో కూడా ప్రవేశపెట్టే యోచన
విజయవాడ కార్పొరేషన్‌లో ప్రయోగాత్మకంగా..
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రోజుల తరబడి ఎదురు చూపుల్లేవు.. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనీ లేదు... ఆటోమ్యుటేషన్ విధానంతో రాష్ట్రంలో ప్రజల కష్టాలకు చెక్ పడింది. ఒకప్పుడు ఆస్తి బదలాయింపు ప్రక్రియ ఒక పెద్ద ప్రహసనంగా ఉండేది. రిజిస్ర్టేషన్ పూర్తయ్యాక మ్యుటేషన్ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవడం, అది సవ్యంగా పూర్తవుతుందా.. కొర్రీలేమైనా పడతాయా అని కొనుగోలుదారులకు కునుకు పట్టేది కాదు. తహసీల్దారు కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగినా మ్యుటేషన్ జరగక ఇబ్బందులు పడేవారు. కొన్ని సందర్భాల్లో రిజిస్ర్టేషన్ పూర్తయిన ఆస్తిపై వివాదాలు తలెత్తడంతో మ్యుటేషన్ జరిగేదికాదు. 2018లో నాటి సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆటోమ్యుటేషన్, రెవెన్యూ సంస్కరణల ఫలితంగా ఇప్పుడు రిజస్ర్టేషన్లతో పాటే మ్యుటేషన్లు కూడా క్షణాల్లో జరిగిపోతున్నాయి. వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్ పూర్తయిన వెంటనే ఆటోమేటిగ్గా వెబ్‌ల్యాండ్‌లో యాజమాన్య హక్కుల బదలాయింపు కూడా పూర్తవుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు ఆటోమ్యుటేషన్‌ను కాగితాలకే పరిమితం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జిరాక్స్ రిజిస్ర్టేషన్లు, గ్రామ సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లంటూ ప్రజలను హడలెత్తించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఈ ప్రక్రియ మళ్లీ ఊపందుకుంది. 99శాతానికి పైగా డాక్యుమెంట్లలో రిజిస్ర్టేషన్ పూర్తయిన సమయంలోనే ఆటోమ్యుటేషన్ కూడా జరిగిపోతోంది. ఈ విధానం రిజిస్ర్టేషన్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసింది.
ఆటోమ్యుటేషన్‌తో క్షణాల్లో బదిలీ
గతంలో మ్యుటేషన్ చేయాలంటే భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం, దానిలోని నియమాలు, పరిమితులకు లోబడి తహసీల్దారు వ్యవహరించేవారు. మ్యుటేషన్ జరగాలంటే మీసేవ, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుని తాశీల్దారు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 18 రోజులు పట్టేది.ఇప్పుడు సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయంలో రిజిస్ర్టేషన్ పూర్తవగానే ఆటోమ్యుటేషన్ విధానంలో వెబ్‌ల్యాండ్‌లో కూడా బదిలీ జరిగిపోతుంది.
ఇకపై మున్సిపాలిటీల్లోనూ అమలు
వ్యవసాయ భూములు ఆటోమ్యుటేషన్ చేయడంలో మంచి ఫలితాలు రావడంతో ఇదే విధానాన్ని మున్సిపాలిటీల్లో కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పట్టణాలు, నగరాల్లో రిజిస్ర్టేషన్లు జరిగిన వెంటనే కొనుగోలుదారుల పేరుతో ఆస్తి పన్ను వివరాల మార్పు (ఆటోమ్యుటేషన్) జరిగే విధానాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, స్పందనను పరిగణనలోకి తీసుకుని మార్పుచేర్పులతో మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీ పరిధుల్లో క్రమంగా విస్తరించాలని భావిస్తున్నారు. విజయవాడ పరిధిలో అసె్‌సమెంట్ నంబర్లపై ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపు జరిగే ఆస్తుల క్రయవిక్రయాలకు మాత్రమే ఆటోమ్యుటేషన్ విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. అసె్‌సమెంట్ నంబరు కలిగిన పూర్తి ఆస్తి అమ్మకం జరిగితేనే ఈ విధానం వర్తిస్తుంది. కొత్త ప్లాట్ల కొనుగోలుకు కూడా నూతన విధానాన్ని అమలు చేస్తారు. సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్ జరిగిన వెంటనే ఆ వివరాలు సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఆన్‌లైన్ ద్వారా తెలియజేస్తారు.
స్లాట్ బుకింగ్‌తో గంటల తరబడి నిరీక్షణకు తెర
సాధారణంగా రిజిస్ర్టేషన్ కార్యాలయాలు జనాలతో కిటకిటలాడుతుంటాయి. ఏ సమయంలో పిలుస్తారో తెలియక ఉదయం నుంచి అక్కడే గంటల తరబడి ఎదురుచూసేవారు. కొనుగోలుదారు చలానా కట్టి, డాక్యుమెంట్లు రాయించడానికి కనీసం 3గంటల సమయం పట్టేది. అందరూ కార్యాలయంలో గుమికూడి ఉండటంతో అధికారులు, సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారు. సేవల కోసం వచ్చినవారిని ఎక్కువ సేపు నిరీక్షించకుండా త్వరగా పంపేయాలని గతంలో ప్రభుత్వం ఎన్నో ప్రయోగాలు చేసినా ఫలితం దక్కలేదు. ఇప్పుడు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానంతో ఈ నిరీక్షణకు తెరపడింది. పెద్ద కార్యాలయాల్లో ఒక్కోచోట రోజుకి 70 నుంచి 80 స్లాట్లు ఇస్తున్నారు. ఈ విధానంలో అధికారులు సూచించిన సమయానికి 15 నిమిషాల ముందు కార్యాలయానికి చేరుకుంటున్నారు. వారికిచ్చిన సమయానికి 10 నిమిషాల్లో రిజిస్ర్టేషన్ పూర్తవుతోంది. అదే సమయంలో మ్యుటేషన్ కూడా జరిగిపోతోంది. రిజిస్ర్టేషన్ పత్రాలు కూడా అదే రోజు ఇచ్చేస్తుండటంతో వచ్చిన వారు గంటలోపే పని పూర్తిచేసుకొని వెళ్లిపోతున్నారు.
ఆటోమ్యుటేషన్ రేటు 99శాతం
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్ పూర్తయిన 99శాతం డాక్యుమెంట్లకు అదే క్షణంలో ఆటోమ్యుటేషన్ జరిగిపోతోంది. గతంలో రిజిస్ర్టేషన్ పూర్తయిన మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత కొనుగోలుదారులకు డాక్యుమెంట్లు ఇచ్చేవారు. ఇప్పుడు 89 శాతం రిజిస్ర్టేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లను అదే రోజున, మిగిలిన వాటిని మరుసటి రోజున అందజేస్తున్నారు. కర్నూలులో ఆటోమ్యుటేషన్ రేటు 99.65 శాతం, కడపలో 99.66 శాతం, ఒంగోలు 99.51 శాతం, నెల్లూరులో 99.3 శాతం, రాజమండ్రిలో 99.51 శాతం, గుంటూరులో 99.71 శాతం, బాపట్లలో 99.41 శాతం ఉంది. అన్ని కార్యాలయాల్లో కలిపి సగటు ఆటోమ్యుటేషన్ రేటు 99 శాతం ఉంది.
Updated Date - Jun 30 , 2025 | 03:15 AM