గంజాయి విక్రయిస్తూ చిక్కిన ఆటో డ్రైవర్
ABN, Publish Date - Jun 18 , 2025 | 01:30 AM
మద్యం తాగేందుకు చేసిన అప్పులు తీర్చడం కోసం ఆటో డ్రైవర్ ముసుగులో రైల్వే స్టేషన్ వద్ద గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులను చూసి పొదల్లో పడేసిన ప్యాకెట్
డ్రైవర్ అరెస్టు.. 21 కిలోల గంజాయి స్వాధీనం
విజయవాడ/సత్యనారాయణపురం, జూన్ 17(ఆంధ్రజ్యోతి):
మద్యం తాగేందుకు చేసిన అప్పులు తీర్చడం కోసం ఆటో డ్రైవర్ ముసుగులో రైల్వే స్టేషన్ వద్ద గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణపురం ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. సత్యనారాయణపురం శ్రీనగర్ కాలనీకి చెదిన గోళ్ల సాంబశివరావు ఆటోడ్రైవర్. రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌ల వద్ద ప్రయాణికుల కోసం తిరుగుతుంటాడు. అతడు పగలు కంటే రాత్రిపూట ఎక్కువగా ఆటో నడుపుతుంటాడు. ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకోవడం కంటే వ్యసనపరులకు గంజాయిని విక్రయించడంపైనే దృష్టి కేంద్రీకరిస్తాడు. సాంబశివరావుకు అనేక వ్యసనాలు ఉన్నాయి. వాటిలో మద్యం ఒకటి. ముందుగా ఆటో నడుపుకునే అతడు కొన్ని రోజుల తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇంట్లో ఉంటూ మద్యం తాగుతుండేవాడు. మద్యానికి డబ్బులు లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ అప్పులు చేశాడు. వాటిని తీర్చుకోవడానికి గంజాయి అమ్మకాలకు దిగాడు.
15 కేసుల్లో నిందితుడు
ఒడిసా, సీలేరు ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నాడు. కొన్నాళ్లుగా సాంబశివరావు ఈవిధంగా చేస్తున్నాడు. సోమవారం రాత్రి రైల్వే కాలనీ రోడ్డులో ఆటోలో సాంబశివరావు గంజాయి స్టాకు పెట్టుకుని ఉన్నాడు. పోలీసులు రాత్రి పూట గస్తీ తిరుగుతుండగా వారిని చూసి గంజాయి ప్యాకెట్లను పొదల్లోకి విసిరేశాడు. దీన్ని గమనించి పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సాంబశివరావుపై 15 కేసులు ఉన్నాయి. అతడిపై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ సస్పెక్ట్ షీట్ ఉంది. సత్యనారాయణపురం, నున్న పీఎస్‌ల్లో రెండు గంజాయి కేసులు ఉన్నాయి. ఒక అత్యాచారం కేసు, హత్యాయత్నం కేసు ఉన్నాయి. ఇవి కాకుండా వాహన దొంగతనాలు, ఇళ్లలో చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
Updated Date - Jun 18 , 2025 | 01:31 AM