ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Revenue Department: అసైన్డ్‌ భూములకు రెక్కలు

ABN, Publish Date - Jun 15 , 2025 | 04:43 AM

ఏడాది క్రితం ఆయన కరుడు గట్టిన వైసీపీ నేత. పేదల చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూములతో ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా పెద్ద వ్యాపారమే చేశారు. ఆ నాటి ప్రభుత్వంలో ముఖ్యపాత్రలో ఉన్న ఓ ఐఏఎస్‌ కుమారుడు, అల్లుడితో కలిసి అసైన్డ్‌ భూచక్రం తిప్పారు.

  • రూ.75 కోట్ల భూమిని సెటిల్‌చేసిన రెవెన్యూ మనిషి

  • విశాఖలో మళ్లీ మొదలైన ఎన్‌వోసీ దందా

  • 3 ఎకరాలు ఆయనకు.. 2 ఎకరాలు బ్రోకర్‌కు

  • మాజీ సైనికుడి సతీమణికి కుచ్చుటోపీ

  • ఈ డీల్‌తో రంగం మీదకు మరో మాజీ మంత్రి

  • మనోరమ హిల్స్‌పక్కనే ఐదు ఎకరాలపై కన్ను

  • బెజవాడ కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు

  • ఎండాడ,పెందుర్తిలో 60 ఎకరాల డీ పట్టాపై డీల్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఏడాది క్రితం ఆయన కరుడు గట్టిన వైసీపీ నేత. పేదల చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూములతో ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా పెద్ద వ్యాపారమే చేశారు. ఆ నాటి ప్రభుత్వంలో ముఖ్యపాత్రలో ఉన్న ఓ ఐఏఎస్‌ కుమారుడు, అల్లుడితో కలిసి అసైన్డ్‌ భూచక్రం తిప్పారు. భీమిలీ, పెందుర్తి, ఎండాడ, భోగాపురం ప్రాంతాల్లోని అతి ఖరీదైన భూములను హస్తగతం చేసుకొని ఒప్పందాలు చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని బోధపడి ఎన్నికలకు కొద్దిరోజుల ముందే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారినా భూదోపిడీ స్వభావం మారలేదు. రెవెన్యూ శాఖలో కీలకమైన ఓ పెద్దమనిషిని ముందుపెట్టి విశాఖ కేంద్రంగా అసైన్డ్‌ భూములను చేజిక్కించుకునే ప్రయత్నాలు మళ్లీ ప్రారంభించారు. ఇందులో రూ.75 కోట్ల విలువైన ఓ ఐదు ఎకరాల భూమిని అడ్డదారిలో చేజిక్కించుకున్నారు. ఫలితంగా రెవెన్యూ పెద్దమనిషికి మూడు ఎకరాలు, ఈయనకు రెండు ఎకరాల చొప్పున వాటాల పంపిణీ జరిగింది. మనోరమ హిల్స్‌ సమీపంలోని అత్యంత ఖరీదైన 5 ఎకరాల డీ పట్టా భూమిని ఓ మాజీ మంత్రికి సెటిల్‌ చేసేందుకు ఇప్పుడు పావులు కదుపుతున్నారు. ఇలా రెండో మూడో కాదు..ఏకంగా 46 ఎకరాల డీ పట్టా భూమిని సెటిల్‌ చేసేందుకు విజయవాడ కేంద్రంగా విశాఖ రెవెన్యూ అధికారులతో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. నాటి టీడీపీ ప్రభుత్వం 2016లో జీవో 279 జారీ చేసింది. దీని ప్రకారం, మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు అసైన్డ్‌ చేసిన భూములకు పదేళ్ల కాలపరిమితి తీరితే ఇక వాటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తీసుకోనక్కరలేదు.

ఈ జీవో ప్రకారం 10 ఏళ్ల కాలపరిమితి దాటిన మాజీ సైనికులు, రాజకీయ బాధితులు, స్వాతంత్య్ర సమర యోధుల భూముల రిజిస్ట్రేషన్‌, క్రయవిక్రయాలకు ఎన్‌వోసీలు అక్కరలేదని, వాటికి ఏపీ అసైన్‌మెంట్‌ చట్టం-1977లోని భూ బదలాయింపు నిషేధం వర్తించదని రెవెన్యూశాఖ గడిచిన 8 ఏళ్లలో 15 ఆదేశాలు ఇచ్చింది. అయినా, మళ్లీ ఎన్‌వోసీ డ్రామాను తెరపైకి తీసుకొచ్చి ఈ నేత మాజీ సైనికుల కుటుంబాలను బురిడీ కొట్టించి మరీ భూములు హస్తగతం చేసుకుంటున్నారు. ఇందుకు రెవెన్యూశాఖలోని ఓ పెద్దమనిషి, విశాఖలోని ఓ మాజీ మంత్రి, మరి కొందరు తోడవ్వడం సదరు భూమి యజమానులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. కూటమి వచ్చాక అసైన్డ్‌ భూముల దందా నిలిచిపోయిందని ఒకవైపు ప్రభుత్వం చెబుతోంటే, తెరవెనుక ఈ నేత ఆ భూములను చెరపట్టి చీకటి ఒప్పందాలు చేసుకునే పనిలో ఉండటం ప్రభుత్వానికి పెనుసవాల్‌ విసరడమే.

జీవో అలా.. ఎన్‌వోసీ గొడవ ఇలా..

జీవో 279ని అనుసరించి.. మూడు కేటగిరీల డీ పట్టా భూములకు పదేళ్ల కాలపరిమితి దాటాక రిజిస్ట్రేషన్‌ చట్టం-1908లోని నిషేధ జాబితా 22(ఏ) నుంచి తొలగించాలి. దీంతో లబ్ధిదారులకు ఆ భూమిపై పూర్తి హక్కులు వస్తాయి. ఆ భూములను తాకట్టుపెట్టుకోవచ్చు. ఇంకా ఆర్ధిక అవసరాలకు అమ్ముకోవచ్చు. ఇందుకోసం జిల్లా కలెక్టర్‌ నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆ ఉత్తర్వులో ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ఈ కేటగిరీ భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలో జీవో 279 ప్రకారం ఎన్‌వోసీలు అడగ రాదని రిజిస్ట్రేషన్‌ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దీని అమలుకోసం అనేకానేక మార్గదర్శకాలు, సర్క్యూలర్‌ ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే, ఈ విషయం చాలా మందికి తెలియదు. ప్రభుత్వం నుంచి డీ పట్టా భూములు పొందిన మాజీ సైనికుల కుటుంబాలకు అసలు అవగాహనే లేదు. కలెక్టర్‌ దగ్గర ఎన్‌వోసీ తీసుకుంటేనే భూమి ఫ్రీ హోల్డ్‌ అవుతుందని, ఆ తర్వాతే రిజిస్ట్రేషన్‌ చేస్తారని రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు, కొందరు అధికారులు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. దీంతో అవసరమే లేని ఎన్‌వోసీ ఇప్పించడం పెద్ద వ్యాపారంగా మారింది. కొందరు ఎన్‌వోసీలు ఇప్పిస్తాం అంటూ కోట్లు దండుకుంటుంటే, మరి కొందరు కోట్ల విలువచేసే ఆ భూములనే కొట్టేస్తున్నారు. ఇందులో విశాఖకు చెందిన ఓ నేత సిద్ధహస్తుడు. గతంలో వైసీపీలో ఉన్న ఆయన ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. జగన్‌ ప్రభుత్వంలో వైసీపీ నేతగా ఆయన ఎన్‌వోసీలు ఇప్పించే వ్యాపారమే చేశారు. కూటమి వచ్చాక అదే పని మళ్లీ ప్రారంభించారు.

మనోరమ హిల్స్‌పై కన్ను...

ఎవ్వరికీ ఎలాంటి ఎన్‌వోసీలు ఇవ్వకూడదని రెవెన్యూశాఖలోని ఓ కీలక పెద్ద మనిషి విశాఖ అధికారులకు అనధికారిక హుకుం జారీ చేయించారు. ఒక వేళ ఏ భూమికైనా ఎన్‌వోసీ కావాలనుకుంటే రెవెన్యూశాఖలో అత్యున్నత స్థాయి నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకోవాలని, అంతిమంగా కలెక్టర్‌ ఆదేశాలు ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు ఇప్పించారు. ఇది జీవో 279కి పూర్తి విరుద్ధం. అయితే, ఇది అమలయితేనే తమ వద్దకు భూముల పంచాయతీలు వస్తాయని భావించిన రెవెన్యూ పెద్ద నిబంధనలకు విరుద్ధమైన పనులు చేసేలా అధికారులపై ఒత్తిడిచేశారు. ఇదే పనిగా, విశాఖకు చెందిన ఓ నేతతో ఎండాడలోని ఐదు ఎకరాల భూమి ఫైలును తెప్పించుకున్నారు. నాటి రెవెన్యూ అధికారితో కలిసి గుట్టుగా ఫైల్‌ను సెటిల్‌ చేయించారు. ఫలితంగా రెవెన్యూ పెద్దకు మూడు ఎకరాలు, విశాఖ నేతకు రెండు ఎకరాల భూమి దక్కింది. ఇప్పుడు ఈ భూమిని 700 గజాల చొప్పున విడగొట్టి అమ్మేస్తున్నారు. భూమికి అసలు యజమాని అయిన మాజీ సైనికుడి కుటుంబానికి ఈ నేత ఇచ్చిన సొమ్ము కేవలం రూ.25 లక్షల మాత్రమే. ఈ విషయం తెలిసి విశాఖకు చెందిన ఓ మాజీ మంత్రి భూమిని సెటిల్‌ చేయించిన నేతను పిలిపించారు. తనకు తెలియకుండా ఆ భూమికి ఎలా ఎన్‌వోసీ ఇప్పించారని నిలదీశారు. ఫలితంగా రెండున్నర కోట్ల ప్యాకేజీ మాట్లాడుకొని ఇంటికి తీసుకె ళ్లి సమర్పించినట్లు తెలిసింది. అయితే, ఇది సరిపోదని, మొత్తం రెండు ఎకరాలు తనకే కావాలని పేచీపెట్టడంతో, ప్రత్యామ్నాయంగా మనోరమ హిల్స్‌ పక్కనే ఉన్న మరో ఐదు ఎకరాల భూమిని సెటిల్‌ చేయిస్తానని మాటిచ్చినట్లు తెలిసింది. ఈ భూమి నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి కుటుంబం నియంత్రణలో ఉంది. అది కూడా ఓ మాజీ సైనికుడి కుటుంబం నుంచి లాక్కున్నదే. అయితే, ఎండాడలోని ఐదు ఎకరాల కేసు విజయవంతంగా సెటిల్‌ కావడంతో ఆ నేత పెందుర్తి, ఎండాడ, భీమిలి ప్రాంతాల్లోని 60 ఎకరాల డీపట్టాలపై కన్నేశారు. ఇప్పుడు పెద్ద దుకాణ మే తెరిచారు. విశాఖ కేంద్రంగా జరుగుతున్న కార్యక్రమాల్లో ఆయనకు పెద్దపీట వేయిస్తున్నారు. ఇటీవల ప్రధాని వచ్చినప్పుడు ఆయనకు ఎయిర్‌పోర్టులోనే స్వాగతం పలికేందుకే తన వెంట తీసుకెళ్లారు. అప్పట్లోనే ఈ వ్యవహారం రచ్చకెక్కింది.

Updated Date - Jun 15 , 2025 | 05:28 AM