AP Electricity: జెన్కో జోరు
ABN, Publish Date - Jul 05 , 2025 | 03:31 AM
బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకు వెళ్లకుండానే.. డిమాండ్‌కు సరిపడా కరెంటును ఏపీ జెన్‌కో ఉత్పత్తి చేస్తోంది. శుక్రవారం రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసింది. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలు అందించిన సమాచారం మేరకు..
రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి
మార్కెట్లో కొనకుండానే కరెంటు సరఫరా
అందుబాటులోకి శ్రీశైలం జలవిద్యుత్
మొత్తం 199 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి
డిమాండ్‌కు సరిపడా అందడంతో..
బయట కొనుగోలు చేయని డిస్కంలు
అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకు వెళ్లకుండానే.. డిమాండ్‌కు సరిపడా కరెంటును ఏపీ జెన్‌కో ఉత్పత్తి చేస్తోంది. శుక్రవారం రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసింది. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలు అందించిన సమాచారం మేరకు.. శుక్రవారం 199.498 మిలియన్ యూనిట్లను అవి ఉత్పత్తి చేశాయి. దీంతో.. మార్కెట్లో ఒక్క యూనిట్‌ను కూడా కొనుగోలు చేయకుండా డిస్కంలు డిమాండ్‌ను తట్టుకున్నాయి. శుక్రవారం ఏపీ జెన్కో ఆధ్వర్యంలోని థర్మల్ విద్యుత్కేంద్రాల్లో 78.015 మిలియన్ యూనిట్లు, జలవిద్యుత్కేంద్రాల్లో 19.869 మిలియన్ యూనిట్లు, జెన్కో సోలార్ కేంద్రాల్లో 1.588 మిలియన్ యూనిట్లు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్లు 10.938 మిలియన్ యూనిట్లు, ఐపీపీ (సెయిల్, హెచ్‌ఎన్‌పీసీఎల్) 37,945 మిలియన్ యూనిట్లు, పవన విద్యుత్ 57.946 మిలియన్ యూనిట్లు, ప్రైవేటు సోలార్ 18.383 మిలియన్ యూనిట్లు, అంతర్రాష్ట్ర ఉత్పత్తి 1.206 మిలియన్ యూనిట్లు.. మొత్తం 199.498 మిలియన్ యూనిట్లను విద్యుత్ సంస్థలు అందించాయి. డిమాండ్ కూడా అంతే ఉండడంతో డిస్కంలు మార్కెట్లో కొనుగోలు చేయలేదు. శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతోంది. 720 మెగావాట్లు అందుబాటులోకి వచ్చింది. కృష్ణపట్నం థర్మల్ మూడో యూనిట్ నుంచి 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. వీటితో కలిపే 199.498 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. ఇంకోవైపు.. థర్మల్ విద్యుదుత్పత్తి బాగానే ఉన్నందున ప్లాంట్లలో బొగ్గు నిల్వలను ఇంకా పెంచాలని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. వీటీపీఎ్‌సలో రోజుకు 41,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా.. 13 రోజులకు సరిపడా 5,48,586 టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి.
ఆర్‌టీపీపీలో రోజుకు 28,500 టన్నులు అవసరం కాగా.. రెండున్నర రోజులకు సరిపడా 74,549 టన్నుల నిల్వలే ఉన్నాయి. కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్‌లో రోజుకు 29,000 టన్నుల బొగ్గు అవసరం కాగా.. భారీగా 2,30,020 టన్నుల నిల్వలు ఉన్నాయి. సెయిల్‌లో రోజుకు 20,000 మెట్రిక్ టన్నుల బొగ్గుకు గాను 4,72,705 టన్నుల నిల్వలు ఉన్నాయి.
బకాయిలతో డిస్కంలు విలవిల..
రూ.7,562.48 కోట్ల బకాయిలు రాష్ట్ర డిస్కంలను భయపెడుతున్నాయి. నెలలోపే విద్యుత్ బకాయిలను తీర్చాలన్న నిబంధనలను దాటిన మొత్తాలు రూ.3,513.34 కోట్లు ఉన్నాయి. ఈ నెలలో చెల్లించాల్సిన బకాయిలు రూ.4,049.14 కోట్లు. ఈ మొత్తాలను తీర్చడానికి నిధుల కోసం డిస్కంలు అన్వేషణ ప్రారంభించాయి. అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయడానికి సిద్ధమవుతున్నాయి.
Updated Date - Jul 05 , 2025 | 03:32 AM