AP Legal Service : చిన్నారులపై లైంగిక అకృత్యాలు ఆందోళనకరం
ABN, Publish Date - Feb 16 , 2025 | 04:42 AM
చిన్నారులపై రోజురోజుకూ లైంగిక అకృత్యాలు పెరుగుతుండడం ఆందోళనకరమని ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నారులకు అవగాహన కల్పించడం అవశ్యం.. న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి బబిత
అమరావతి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): చిన్నారులపై రోజురోజుకూ లైంగిక అకృత్యాలు పెరుగుతుండడం ఆందోళనకరమని ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కేసుల్లో దగ్గరి బంధువులే అఘాయిత్యాలకు పాల్పడుతుండడం మరింత దారుణమన్నారు. చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏపీ న్యాయసేవాధికార సంస్థ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. శనివారం రాజధాని ప్రాంతంలోని శాఖమూరు గ్రామంలో విట్ న్యాయ కళాశాల విద్యార్థులతో ఇంటింటికీ తిరిగి.. చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోక్సో చట్టంపై గ్రామస్థులకు వివరించారు. ఈ కార్యక్రమాన్ని బబిత జెండా ఊపి ప్రారంభించారు. చిన్నారులకు మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు. నేరం జరగకుండా వారు అప్రమత్తమయ్యేలా చూడాలని చెప్పారు. రానున్న రోజుల్లో న్యాయ విద్యార్థులతో కలిసి అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జస్టిస్ రవినాథ్ తిల్హరి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బబిత తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ ఉపకార్యదర్శి అమర రంగేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఎన్.జేజేశ్వరరావు, గుంటూరు జడ్పీ డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, విట్ కళాశాల ప్రిన్సిపాల్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 16 , 2025 | 04:43 AM