Oil Palm Cultivation : పండేది ఇక్కడ.. అమ్మేది అక్కడ!
ABN, Publish Date - Jan 28 , 2025 | 04:53 AM
ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం.. ఉత్పత్తిలో ఏపీనే అగ్రస్థానంలో ఉంది. పంట ఇక్కడ సాగవుతుండగా.. దీనిని తెలంగాణ రాష్ట్రం దిగుబడి చేసుకుని అధిక ప్రయోజనాలు పొందుతోంది.
ఆయిల్‌పామ్‌కు రైతుకు ఆదరణ ఏదీ?
తెలంగాణకు తరలిపోతున్న ఉత్పత్తి
గత ప్రభుత్వ విధానాలతో జీఎస్టీ కోల్పోయిన ఏపీ
కేంద్ర రాయితీ పథకాలపైనా గతంలో నిర్లక్ష్యం
పెరగని సాగు విస్తీర్ణం.. రాష్ట్రానికి నష్టం
ఆయిల్‌పామ్‌కు కూటమి సర్కార్ ఊతమిచ్చేనా?
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం.. ఉత్పత్తిలో ఏపీనే అగ్రస్థానంలో ఉంది. పంట ఇక్కడ సాగవుతుండగా.. దీనిని తెలంగాణ రాష్ట్రం దిగుబడి చేసుకుని అధిక ప్రయోజనాలు పొందుతోంది. అక్కడి ఫ్యాక్టరీలో ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేట్ (ఓఈఆర్)ని చూపుతూ రైతులకు ఎక్కువ ధర ఇస్తోంది. ఏపీలో మాత్రం పెదవేగిలోని పాత ఫ్యాక్టరీలో తక్కువ ఓఈఆర్ వస్తుండటంతో తక్కువ ధర ఇస్తోంది. దీంతో రైతులు తెలంగాణవైపే మొగ్గుచూపుతున్నారు. ఆయిల్‌పామ్ ధరల నిర్ణయంలో సీఏసీపీ నిబంధన ప్రకారం ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేట్ (ఓఈఆర్)ని ప్రామాణికంగా తీసుకోవాలి. రాష్ట్ర పరిధిలో ఆయిల్ ఫెడ్ నిర్వహించే ఫ్యాక్టరీలో తాజా పండ్ల నుంచి తీసే నూనె శాతం ప్రకారం రైతులకు ధర చెల్లించాలి. కానీ గత ప్రభుత్వం ఆయిల్‌ఫెడ్ పరిధిలోని పెదవేగి ఫ్యాక్టరీని ఆధునీకరిస్తామని చెప్పి, తూతూమంత్రంగా రిపేరు చేసి వదిలేసింది. దీంతో ఆశించిన ఫలితం రాలేదు. తెలంగాణలోని ఫ్యాక్టరీలో 19% పైగా ఓఈఆర్ వస్తుంటే.. పెదవేగిలోని ఫ్యాక్టరీలో 17% కూడా రావట్లేదు. దేశంలోనే ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకతలో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. 5.66లక్షల ఎకరాలతో 49% ఏపీలోనే సాగవుతోంది. రాష్ట్రంలో 1.74లక్షల మంది రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. ఏటా 19లక్షల టన్నుల గెలలు ఉత్పత్తి అవుతున్నాయి. ఎకరానికి 7.92 టన్నుల దిగుబడి వస్తోంది. గంటకు 461 టన్నుల క్రషింగ్ సామర్ధ్యమున్న 13 ప్రొసెసింగ్ యూనిట్లున్నాయి. అయినప్పటికీ రైతులకు మాత్రం ఆశించిన ధర రావడం లేదు. ఇందుకు గత వైసీపీ సర్కార్ చేసిన తప్పిదాలే ప్రధాన కారణం. వీటిని కూటమి ప్రభుత్వం సరిదిద్ధుతుందా.. లేక వాటినే అనుసరిస్తుందా? అనే అనుమానాలు రైతుల్లో నెలకొన్నాయి.
గత ప్రభుత్వం కొత్త మండలాల కేటాయింపుపై పెట్టిన శ్రద్ధ.. ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంపు, అధిక దిగుబడి సాధించడంపై చూపలేదు. రైతులకు ప్లాంట్ మెటీరియల్ సబ్సిడీపై ఇవ్వకుండా, మైక్రో ఇరిగేషన్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసింది. కేంద్రం కేటాయించే 60ు నిధులకు రాష్ట్ర వాటా 40ు విడుదల చేయకపోవడంతో రైతులకు రాయితీలు అందలేదు. దీంతో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణంలో ఏపీ వెనుకబడింది. ఈ విషయంలో తెలంగాణ చాలా ముందంజలో ఉంది. ఫలితంగా గత ప్రభుత్వ హయాంలో ఆయిల్‌పామ్ రైతులు అన్నివిధాలా నష్టపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు ఆదేశాలు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిలను చెల్లించడంతోపాటు కేంద్రం ఇచ్చే నిధుల్ని సద్వినియోగం చేసుకుంటూ, అదనపు నిధుల సమీకరణకు ఉద్యాన శాఖ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే డ్రిప్ పరికరాలపై రైతులకు సబ్సిడీని 90 శాతానికి పెంచి, అందుకు అవసరమైన అదనపు నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. దీనివల్ల ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెరుగుదలతోపాటు అధిక ఉత్పత్తి సాధించే అవకాశం ఏర్పడుతుంది. ఆయిల్‌పామ్ ధరల నిర్ణయంలో కూడా గత ప్రభుత్వం శాస్త్రీయ విధానాలను పాటించలేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలైన కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ (సీఏసీపీ) నిబంధనలకు, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ (ఎన్‌ఎంఈవో) స్కీం కింద వయబిలిటీ గాప్ ప్రైస్ (వీజీపీ) నిబంధనలకు విరుద్ధంగా నాటి ప్రభుత్వం వ్యవహరించింది.
జీఎస్టీ కోల్పోయిన ఏపీ
గత ప్రభుత్వ విధానాలతో ఏపీకి మరో నష్టం కూడా జరిగింది. లక్ష టన్నుల మీద, క్రూడాయిల్‌పై వచ్చే జీఎస్టీ కూడా కోల్పోయింది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం లబ్ధి పొందింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఎడిబుల్ ఆయిల్ రంగంలో విదేశాలపై ఆధారపడే విధానం తగ్గించడం కోసం ఎన్‌ఎంఈవో అనే విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ మార్కెట్లలో ధర పడిపోయినా రైతులను ఆదుకోవటానికి వీజీపీ విధానం తెచ్చింది. దీనిని గత ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రస్తుతం అధిక ధరల కారణంగా రైతులకు నష్టం లేకపోయినా, భవిష్యత్‌లో వీజీపీ విధానం అమలుతో రైతులకు మేలు జరిగే పద్ధతిని కూడా ప్రభుత్వం పరిశీలించాలి. ఆయిల్‌పామ్ రంగానికి పునరుజ్జీవం కల్పించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇందుకోసం పెదవేగి ఫ్యాక్టరీని ఆఽధునికీకరించాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణకు లబ్ధి
జాతీయ ఆయిల్‌పామ్ దిగుబడిలో 5-8ు వాటా కూడా లేని తెలంగాణ విధానాలనే 8590ు దిగుబడి వచ్చే ఏపీ అనుసరించే కొత్త విధానానికి గత ప్రభుత్వం తెర లేపింది. ఓఈఆర్ అనేది ఫ్యాక్టరీ సామర్థ్యంతో పాటు ఆయిల్‌పామ్ సాగు ప్రాంత వాతావరణం, నేల స్వభావం, యాజమాన్య పద్ధతులు, పంట కోత సమయాన్ని బట్టి మారుతుంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, శాస్త్రీయ విధానాలను పాటించకుండా తెలంగాణ ఓఈఆర్‌ని ఏపీకి ఆపాదించింది. రాష్ట్రం విడిపోయే నాటికి తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం తక్కువగా, ఫ్యాక్టరీ సామర్థ్యం ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్రంలో పండిన పంట అక్కడి ఫ్యాక్టరీకి చాలక ఏపీ పంటను దొడ్డిదారిన తరలించడానికి దళారులను పెట్టుకుని, అధిక ధర ఆశ చూపి తరలించుకుపోయిందన్న విమర్శ ఉంది. ఈవిధంగా ఏపీ నుంచి ఏటా 70వేల నుంచి లక్ష టన్నుల వరకు ఆయిల్‌పామ్ తెలంగాణకు తరలిపోయింది. దొడ్డిదారిన తెలంగాణ ఫ్యాక్టరీ సమీకరించిన ఆయిల్‌పామ్ ఉత్పత్తిని చూపి, కేంద్రం నుంచి ఎక్కువ సబ్సిడీలు రాబట్టుకోగా, ఆమేరకు ఏపీ తీవ్రంగా నష్టపోయింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 28 , 2025 | 04:53 AM