ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court: అనంతబాబుకు ఝలక్‌

ABN, Publish Date - Jul 26 , 2025 | 03:55 AM

దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో చుక్కెదురైంది.

  • ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నో

  • డ్రైవర్‌ హత్య-డోర్‌ డెలివరీ కేసులో ఎమ్మెల్సీ నిందితుడు

  • తదుపరి దర్యాప్తుతో ఆయనకు ఎలాంటి హానీ జరగదు

  • ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించలేం: న్యాయమూర్తి

  • సవాల్‌ చేసే అర్హత అనంతబాబుకు లేదు..: ఏజీ

అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తునకు అనుమతిస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఈ నెల 22న ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి న్యాయస్థానం నిరాకరించింది. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించలేమని తేల్చిచెప్పింది. తదుపరి దర్యాప్తునకు మాత్రమే ట్రయల్‌ కోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తు చేసింది. అనంతబాబు ఇప్పటికే కేసులో నిందితుడిగా ఉన్నాడని, తదుపరి దర్యాప్తు వల్ల ఆయనకు ఎలాంటి హానీ జరుగదని స్పష్టంచేసింది. తదుపరి దర్యాప్తు పేరుతో పోలీసులు కేసును పునర్విచారణ చేయబోతున్నారని అనంతబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపఽథ్యంలో ఈ విషయంపై స్పష్టత ఇస్తూ ఆదేశాలిస్తామని మౌఖికంగా తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో 2022 మే 19న కాకినాడకు చెందిన దళిత యువకుడు, తన డ్రైవర్‌ అయిన సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. అతడి మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడి మృతదేహంపై 33 గాయాలు ఉన్నాయని.. ఈ కేసులో అనంతబాబును మాత్రమే నిందితుడిగా చేర్చారని, హత్యలో మరికొందరి పాత్ర కూడా ఉందంటూ సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. దర్యాప్తు అధికారి (ఐవో) సైతం కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతించాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయాధికారి.. ఇం దుకు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ అనంతబాబు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా అనంతబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపించారు. ఈ కేసు దర్యాప్తును పూర్తి చేసి 2022 ఆగస్టు 30న చార్జిషీటు కూడా దాఖలు చేశారని తెలిపారు. మృతుడి తల్లి సందేహాలు వ్యక్తం చేయడంతో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు లోతైన విచారణ జరిపారని.. కాల్‌ డేటాను విశ్లేషించారని. సీసీటీవీని పరిశీలించారని.. గన్‌మెన్‌ వాంగ్మూలాలనూ నమోదు చేశారని వెల్లడించారు. 2023 ఏప్రిల్‌లో అనుబంధ చార్జిషీటు దాఖలు చేశారని తెలిపారు. కొత్త అంశాలు, ఆధారాలు వెలుగులోకి రాకుండా తదుపరి దర్యాప్తునకు ఆదేశించడానికి వీల్లేదన్నారు. ఈ పేరుతో అమాయకులను నిందితులుగా చేరుస్తారనే ఆందోళన ఉందన్నారు. ఇప్పటికే విచారించిన సాక్షుల నుంచి మళ్లీ వాంగ్మూలాలు నమోదు చేసే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి వాటికి అనుమతిస్తే ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత కేసులను మళ్లీ దర్యాప్తు చేస్తుంటారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.

ఆ అర్హత అనంతబాబుకు లేదు..: ఏజీ

పోలీసుల తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేసే అర్హత అనంతబాబుకు లేదన్నారు. ‘కేసు డైరీని పరిశీలించాక.. మరికొందరు సాక్షులను విచారించాల్సిన అవసరం ఉందని దర్యాప్తు అధికారి నిర్ణయానికి వచ్చారు. అనుమతి కోరుతూ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్‌ వేశారు. వాస్తవానికి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కేసు తదుపరి దర్యాప్తు కోసం మేజిస్ట్రేట్‌ అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. అయితే కేసును ప్రొఫెషనల్‌గా విచారించాలనే ఉద్దేశంతోనే తదుపరి దర్యాప్తునకు అనుమతి కోరుతూ ఐవో పిటిషన్‌ వేశారు. అన్ని అంశాలూ పరిశీలించాకే ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ దశలో నిందితుడి వాదనలు వినాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. కేసు దర్యాప్తు అధికారిగా ఏఎస్పీ స్థాయి యువ ఐపీఎస్‌ అధికారి వ్యవహరిస్తున్నారని, ఆయనకు పదోన్నతి లభిస్తే దర్యాప్తు పురోగతిపై ప్రభావం పడుతుందని.. అనుభవజ్ఞుడైన సీనియర్‌ డీఎస్పీని ఐవోగా నియమిస్తే మంచిదని సూచించారు. కోర్టు సూచనలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని ఏజీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 03:57 AM