ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt: రెవెన్యూ మాన్యువల్స్‌ సిద్ధం

ABN, Publish Date - Jul 11 , 2025 | 03:34 AM

భూముల చట్టాలు, వాటికి సంబంధించిన నియమ నిబంధనలను క్రోడీకరించి ఒకే వేదికపైకి తీసుకురావాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి. సుదీర్ఘ కసరత్తు తర్వాత రెవెన్యూ మాన్యువల్స్‌ సిద్ధమయ్యాయి.

  • సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌.. చట్టాలు, రూల్స్‌, జీవోలు

  • సకలం అందులోనే.. అధికారులు, ప్రజలకు అందుబాటులోకి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

భూముల చట్టాలు, వాటికి సంబంధించిన నియమ నిబంధనలను క్రోడీకరించి ఒకే వేదికపైకి తీసుకురావాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి. సుదీర్ఘ కసరత్తు తర్వాత రెవెన్యూ మాన్యువల్స్‌ సిద్ధమయ్యాయి. వీటిని అంశాల వారీగా క్రోడీకరించి.. ప్రభుత్వానికి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది రెవెన్యూశాఖ. సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌లో వీటిని అప్‌లోడ్‌ చేసింది. ప్రజలు ఎప్పుడంటే అప్పుడు ఆన్‌లైన్‌లో వీటిని పరిశీలించేలా ఏర్పాట్లు చేసింది. భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) జి.జయలక్ష్మి, అదనపు కమిషనర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి వీటిని రూపొందించారు. ఈ పరిణామం రెవెన్యూ చరిత్రలో తొలి కీలకఘట్టమని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు.

150 ఏళ్ల చరిత్ర ఉన్న వ్యవస్థ..

150 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన రెవెన్యూ వ్యవస్థ ఇప్పటికీ ఓ పట్టాన ప్రజలకు అర్థంకాదు. బ్రిటీ షుకాలం నాటి రెవెన్యూ చట్టాలు ఇంకా అమల్లో ఉన్నాయి. భూమి చట్టాలు, వాటి అమలును నిర్దేశించే నియమ నిబంధనలు, జీవోలు, మెమోలు, పలు భూ వివాదాలపై న్యాయస్థానాల తీర్పులు.. తదితర సమాచారం ఏదీ ప్రజలకు అందుబాటులో లేదు. ఇతర ప్రభుత్వ శాఖలకు ఈ సమాచారం కావాలంటే రెవెన్యూపైనే ఆధారపడాలి. ఏ చట్టంతో ఏం ఉపయోగం? రూల్స్‌ ఏం చెబుతున్నాయి? దరఖాస్తు చేసుకున్న ఎన్ని రోజుల్లో రైతులకు పాస్‌పుస్తకాలు ఇవ్వాలి? రెవెన్యూ సేవలను పారదర్శకంగా ఎలా చేపట్టాలో తదితర అనేక రూల్స్‌ ఉన్నాయి. అవి అమలవుతున్నాయా? లేదా అన్న పరిశీలన కూడా పెద్దగా జరగట్లేదు. ప్రభుత్వ, ఇనాం, ఎస్టేట్‌, అసైన్‌మెంట్‌, చుక్కల, పోరంబోకు, షరతుగల భూములు, ఇంకా గ్రామకంఠాలపై ఉన్న చట్టాలు, నిబంధనలు రెవెన్యూశాఖ దగ్గర ప్రజలకు అందుబాటులో లేవు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి, రెవెన్యూ చట్టాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని సీఎం చంద్రబాబు గతేడాది ఆగస్టులో రెవెన్యూశాఖకు దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం అదనపు సీసీఎల్‌ఏ ఎన్‌. ప్రభాకర్‌రెడ్డి చైర్మన్‌గా రెవెన్యూ మాన్యువల్‌ తయారీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అధ్యయనం చేసి, అన్నింటినీ క్రోడీకరించి రెవెన్యూ మాన్యువల్స్‌ను తయారు చేసింది. వాటిని సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఏమేమి ఉంటాయంటే..?

కీలకమైన రెవెన్యూ చట్టాలు, వాటి రూల్స్‌, అమలుకు సంబంధించి ప్రభుత్వం వివిధ సందర్భాల్లో జారీ చేసిన ఉత్తర్వులు, ఇంకా ఆయా చట్టాల అమలుపై కలెక్టర్లు, ఇతరులు లేవనెత్తిన అభ్యంతరాలు, సందేహాలపై వివరణలు ఇస్తూ సీసీఎల్‌ఏ ఇచ్చిన సర్క్యూలర్లను కూడా రెవెన్యూ మాన్యువల్స్‌లో పొందుపరిచారు. ఏపీ భూ కేటాయింపుల విధానం, ఇనాం, ఎస్టేట్‌ భూముల చట్టాల రద్దు, ఆ తర్వాత వాటి సెటిల్‌మెంట్‌ కోసం ఇచ్చిన రూల్స్‌ను తెలియజేసే అంశాలు, ఏపీ అసైన్‌మెంట్‌ చట్టం-1977(పీఓటీ), రెవెన్యూ విజిలెన్స్‌, బడ్జెట్‌, రెవెన్యూ పరిపాలన, ఉద్యోగుల సర్వీసు అంశాలు, పెన్షన్‌లు, జిల్లాల పునర్విభజన, రెవెన్యూ డివిజన్‌లు, మండలాల పునర్‌వ్యవస్థీకరణ, చుక్కల భూముల చట్టం, రూల్స్‌ తదితరాలనూ మాన్యువల్స్‌లో పొందుపరిచారు.

ఎలా పొందాలంటే..?

సీసీఎల్‌ఏ. ఏపీ.జీవోవీ.ఇన్‌ అనే వెబ్‌సైట్‌ను ఓపెన్‌చేసి జీఓస్‌, సర్క్యూలర్‌, మెమోస్‌, యాక్ట్స్‌, రూల్స్‌, బుక్స్‌ అనే అంశాల కింద కావాల్సిన సమాచారాన్ని ఒక్క క్లిక్‌ద్వారా పొందవచ్చు. భూ వివాదాలు, సమస్యలకు పరిష్కారం చూపే చట్టాలతోపాటు ప్రభుత్వం ఆయా సందర్భాల్లో జారీ చేసిన కీలకమైన జీవోలను కూడా ఈ మాన్యువల్స్‌ ద్వారా వీక్షించే అవకాశం ఉంది. దీనికి ఆధునిక సాంకేతికతనూ జోడించాలని కూడా రెవెన్యూశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఛాట్‌బోట్‌ విధానం తీసుకురాబోతోంది. ఇది అమల్లోకి వస్తే గూగుల్‌ జెమినీ, లేదా చాట్‌జీపీటీలో ఎలాగైతే డేటా సెర్చ్‌చేస్తే ఫీడ్‌బ్యాక్‌ వస్తుందో, రెవెన్యూ చాట్‌బోట్‌లోనూ అదే స్థాయిలో ఫీడ్‌బ్యాక్‌ వచ్చేలా ఏర్పాట్లుచేస్తున్నట్లు అదనపు సీసీఎల్‌ఏ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. ప్రజలకు రెవెన్యూడేటాను ఒకే వేదికగా అందించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు సుదీర్ఘ కసరత్తు ద్వారా ఫలించాయన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 03:34 AM