PVN Madhav: త్వరలోనే బయటకు లిక్కర్ స్కాం తిమింగలాలు
ABN, Publish Date - Aug 01 , 2025 | 04:50 AM
వైసీపీ హయాంలో ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకున్నారని, మద్యం వ్యాపారాన్ని ఆర్థిక దోపిడీకి చిరునామాగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు.
మద్యం వ్యాపారాన్ని దోపిడీకి చిరునామాగా మార్చారు
వైసీపీ హయాంలో అడ్డంగా దోచుకున్నారు: మాధవ్
పుట్టపర్తి రూరల్, జూలై 31(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకున్నారని, మద్యం వ్యాపారాన్ని ఆర్థిక దోపిడీకి చిరునామాగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. లిక్కర్ స్కాంలో ఉన్న పెద్ద తిమింగలాలు కూడా త్వరలోనే బయటపడతాయని చెప్పారు. చట్టం ఎవ్వరినీ ఉపేక్షించదని, తప్పు చేసినవారికి శిక్ష తప్పదని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో గురువారం జరిగిన శోభాయాత్ర, పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో కుగ్రామం నుంచి రాష్ట్ర రాజధాని వరకూ మద్యం స్కాం జరిగిందని పేర్కొన్నారు. మద్యం అమ్మకాల్లో డిజిటల్ లావాదేవీలు లేకుండా, నగదు లావాదేవీలు నిర్వహించి నాటి వైసీపీ ప్రభుత్వ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 01 , 2025 | 04:50 AM