Minister TG Bharat: ఏడాదిలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు
ABN, Publish Date - Aug 04 , 2025 | 05:02 AM
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడగానే పారిశ్రామికవేత్తల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఏడాదిలోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.
పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సీఎం చంద్రబాబు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడగానే పారిశ్రామికవేత్తల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఏడాదిలోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ పెట్టుబడులు కార్యరూపం దాలిస్తే దేశంలోనే ఏపీ నంబరు-1 రాష్ట్రంగా మారనుందని పేర్కొన్నారు. ఆదివారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.4-5 వేల కోట్ల పెట్టుబడులు కూడా తీసుకురాలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడంతోపాటు 20 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. ‘‘ఏపీ బ్రాండ్‌ను గత వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. చంద్రబాబు సీఎం అయ్యాక పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు ముందుకు వస్తున్నాయి. సింగపూర్ పర్యటనలో క్షణం తీరికలేకుండా చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా ఆ దేశ అధ్యక్షుడు, మంత్రులు, ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహించారు’’ అని భరత్ చెప్పారు. మరోవైపు ఏపీపై విషం కక్కుతూ ఆ దేశ ప్రముఖ కంపెనీల ప్రతినిధులకు వైసీపీ నేతలు ఈ-మెయిళ్లు పంపారని, దీనిపై ప్రభుత్వం విచారణ చేయిస్తుందని తెలిపారు. ఈ-మెయిళ్లు పంపిన వ్యక్తులపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంతో కలసి వస్తాయని, మన రాష్ట్రంలో విచ్ఛినం కోసం పని చేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం దేశంలోనే అత్యున్నత పాలసీ తీసుకొస్తున్నామని, దీనిపై మంత్రి లోకేశ్ కసరత్తు చేస్తున్నారని వివరించారు. ‘‘రేపే ఎన్నికలు వచ్చినట్లు.. రేపే సీఎం అయిపోతున్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారు. కానీ, రాష్ట్రంలో రెండు దశాబ్దాలపాటు కూటమి ప్రభుత్వమే ఉంటుంది. జగన్ వందేళ్లు ఉండాలి. అదికూడా ప్రతిపక్షంలోనే ఉండాలి. చంద్రబాబు వందేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం.’’ అని అన్నారు. మద్యం కుంభకోణం కేసులో ‘ప్యాలెస్ కింగ్’ అరెస్టు తప్పదని, ఆ అరెస్టు ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.
Updated Date - Aug 04 , 2025 | 05:03 AM