ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ration Vehicles: గుదిబండ ఈ బండి

ABN, Publish Date - May 21 , 2025 | 04:30 AM

గత వైఎస్సార్ కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి రేషన్ వాహనాల వ్యవస్థ ప్రవేశపెట్టింది. అయితే ఈ వాహనాలు అనవసరమైన ఖర్చులు, బాకీలు పెంచడంతో ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థ తిరిగి రేషన్‌ షాపుల ద్వారా కొనసాగించనున్నారు.

అట్టహాసాలకు పోయి పౌర సరఫరాలను అస్తవ్యస్తంగా మార్చిన గత ప్రభుత్వం

రూ.కోట్లతో ఎండీయూల కొనుగోలు..

ఆపరేటర్లకు జీతాలతో కార్పొరేషన్‌ దివాలా

అవే వాహనాల్లో పేదల బియ్యం స్మగ్లింగ్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రజా పంపిణీ వ్యవస్థలో గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన రేషన్‌ వాహన వ్యవస్థను (ఎండీయూలు) రాష్ట్ర కేబినెట్‌ రద్దుచేసింది. రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా దాదాపు 30 వేల రేషన్‌ షాపుల ద్వారా సాఫీగా సాగిపోతున్న ప్రజాపంపిణీ వ్యవస్థలోకి ఎవరూ అడక్కపోయినా గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్‌ విధానాన్ని తీసుకువచ్చింది. దీనికోసం రూ. 539 కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి మొత్తం 9,260 ఎండీయూలను కొనుగోలు చేసింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామంటూ లబ్ధిదారుల నుంచి 10 శాతం వాటా తీసుకుని మిగిలిన 90 శాతం ప్రభుత్వమే భరించేలా ఒప్పందం చేసుకుంది. 2021 ఫిబ్రవరి నుంచి ఆర్భాటంగా రేషన్‌ వాహనాలను రోడ్లపైకి తెచ్చింది. ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ సరుకులను ఇంటింటికీ సరఫరా చేస్తున్నందుకు ఎండీయూ నిర్వాహకులకు ప్రభుత్వం నెలకు రూ. 21 వేలు చొప్పున చెల్లిస్తోంది. ఆ వాహనాలకు ఏటా బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించింది. ఇవన్నీ లెక్కిస్తే ఒక్కో రేషన్‌ వాహనానికి ప్రతి నెలా రూ. 27 వేలు చొప్పున రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ద్వారా చెల్లిస్తున్నారు. ఈ విధంగా ఎండీయూల కారణంగా ఇప్పటి వరకు రూ. 1,860 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. రేషన్‌ వాహనాలు లేనప్పుడు కూడా రేషన్‌ షాపుల ద్వారా సరుకుల పంపిణీ సజావుగానే సాగింది. కార్డుదారులకు సరుకులు పంపిణీ చేసిన డీలర్లకు ఆయా సరుకులపై కమీషన్‌ మాత్రమే చెల్లించేవారు. దాంతో ఒక్కో డీలరుకు నెలకు సగటున రూ.7 వేలకు మించి ఖర్చయ్యేది కాదు. ఇప్పుడు రేషన్‌ డీలర్లకు యథావిధిగా కమీషన్‌ చెల్లిస్తూనే.. ఎండీయూల ఆపరేటర్లకు నెలకు రూ. 21 వేలు చొప్పున ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. అంటే ముగ్గురు రేషన్‌ డీలర్లకు చెల్లించే కమీషన్‌ మొత్తాన్ని ఇప్పుడు ఒక ఎండీయూ ఆపరేటర్‌కే చెల్లించాల్సివస్తోంది. రేషన్‌ వాహనాల కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు ప్రతినెలా వాయిదాల (ఈఎంఐ) కింద సుమారు రూ. 247 కోట్లు, ఏటా సర్వీసు ఫీజు కింద రూ. 200 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వానికి ఈ బండి పెద్ద గుదిబండగా మారింది.


పంపిణీలో కొత్త బెడద

రేషన్‌ సరుకుల డెలివరీ కోసం రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నా కార్డుదారులకు మేలు జరగకపోగా.. కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. రేషన్‌ సరుకులను లబ్ధిదారుల ఇంటింటికి తీసుకువెళ్లి అందించాల్సిన రేషన్‌ వాహనాలను ఎక్కడో వీధి చివరన నిలిపి పంపిణీ చేస్తున్నారు. దీంతో డోర్‌ డెలివరీ విధానం వీధి డెలివరీగా మారింది. అది కూడా ప్రతి నెలా 1 నుంచి 17 వరకు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. మిగిలిన రోజులన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 500 పైగా ఎండీయూ ఆపరేటర్లు తమ వాహనాలను తిప్పడం మానేశారు.

పేదల బియ్యం ఓడలకు ఎత్తి..

రాష్ట్రంలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొందరు ఎండీయూ ఆపరేటర్లతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రేషన్‌ సరుకుల పంపిణీ పేరుతో ఇంటింటికీ తిరుగుతున్న ఎండీయూ ఆపరేటర్లలో కొందరు కార్డుదారుల నుంచి రేషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్నారు. ప్రభుత్వం కిలోకు రూ.43 పైగా ఖర్చు పెట్టి పేదలకు ఉచితంగా అందజేస్తున్న రేషన్‌ బియ్యాన్ని కార్డుదారుల నుంచి కేవలం రూ.10కే తీసుకోవడం, చాలామందికి సరుకులు ఇవ్వకుండానే వెళ్లిపోవడం, ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి నేరుగా ఎండీయూ వాహనాల్లోనే స్మగ్లర్ల అడ్డాలకు రేషన్‌ బియ్యాన్ని తరలించడం వంటి ఉదంతాలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా పోర్టులకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతులు చేస్తున్న విధానాన్ని కూటమి ప్రభుత్వం బట్టబయలు చేసింది.


రేషన్‌ బియ్యానికి బదులు నగదు..

రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యానికి బదులు నగదు చెల్లించే అంశంపై మంత్రిమండలి చర్చించినట్లు సమాచారం. కేజీ రూ. 43కు కొని ఉచితంగా అందజేస్తుంటే.. వాటిని తిరిగి రూ. 10కే ఎండీయూ ఆపరేటర్లకు ఇచ్చేస్తున్నారని, దీనివల్లే రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ వ్యవస్థీకృతమైందని మంత్రులు అభిప్రాయపడ్డారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘం

అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై సమగ్రంగా చర్చించి హేతుబద్ధమైన నిర్ణయాన్ని తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించారు. పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని నాలుగు మండలాలను, చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లోని ఒక మండలాన్ని మదనపల్లి రెవెన్యూ డివిజన్‌లో కలపాలని నిశ్చయించారు. దీనిపై ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వైసీపీ హయాంలో 2022లో నూతన జిల్లాలను ఏర్పాటు చేశారు. అయితే జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. మంగళవారం కేబినెట్‌ భేటీలో ఈ అంశంపై చర్చ జరిగింది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై వస్తున్న డిమాండ్లపై చర్చించి, నిర్ణయం తీసుకునేందుకు ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News


Updated Date - May 21 , 2025 | 04:30 AM