ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Liquor Sale: పెగ్గు మీద పెగ్గు

ABN, Publish Date - Jul 09 , 2025 | 03:59 AM

రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. మద్యం ప్రియులు పెగ్గు మీద పెగ్గు కొడుతూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా బీరు అమ్మకాలు ఏకంగా 129శాతం పెరగడం విశేషం. లిక్కర్‌ విక్రయాలు దాదాపు 24శాతం పెరిగాయి.

  • రాష్ట్రంలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు

  • లిక్కర్‌ 24శాతం.. బీరు ఏకంగా 129శాతం

  • మొదటి క్వార్టర్‌లోనే 7,890 కోట్లు

  • అదనపు విక్రయాలతో అధిక ఆదాయం

  • నెలకు సగటున 2,300 కోట్లు రాబడి

  • టాప్‌లో తిరుపతి.. చివరన అల్లూరి

  • పశ్చిమలో రివర్స్‌ ట్రెండ్‌.. జిల్లాలో

  • పెరిగిన నకిలీ మద్యం విక్రయాలు

(అమరావతి, ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. మద్యం ప్రియులు పెగ్గు మీద పెగ్గు కొడుతూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా బీరు అమ్మకాలు ఏకంగా 129శాతం పెరగడం విశేషం. లిక్కర్‌ విక్రయాలు దాదాపు 24శాతం పెరిగాయి. గత వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం బ్రాండ్లు తాగలేక మద్యం వినియోగదారుల్లో అనేక మంది నాటుసారా, గంజాయి వైపు మళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాసిరకం బ్రాండ్లకు ఫుల్‌స్టాప్‌ పడింది. మరోవైపు క్వార్టర్‌ రూ.99కే జాతీయ స్థాయి కంపెనీల మద్యం రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. గత ప్రభుత్వంలో కనుమరుగైన పాపులర్‌ బ్రాండ్లు తిరిగొచ్చాయి. ఫలితంగా నాటుసారా, గంజాయి తగ్గింది. బ్రాండ్‌ మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మొదటి క్వార్టర్‌లో భారీగా అమ్మకాలు పెరగడంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది.

అమ్మకాలు ఇలా

గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 82.98 లక్షల కేసుల మద్యం అమ్మితే, ఈ ఆర్థిక సంవత్సరంలో 102.7 లక్షల కేసుల మద్యం అమ్ముడైంది. అంటే 23.77 శాతం పెరిగింది. బీరు గతేడాది మొదటి క్వార్టర్‌లో 28.22 లక్షల కేసులు అమ్మితే, ఈ ఏడాది మొదటి క్వార్టర్‌లో 64.6లక్షల కేసులు అమ్మారు. అంటే 128.9శాతం పెరిగింది. ఫలితంగా గతేడాది మొదటి క్వార్టర్‌లో 7,086 కోట్ల విలువైన మద్యం అమ్ముడైతే, ఈ ఏడాది అది రూ.7,889కోట్లకు పెరిగింది. దీంతో గతేడాది 6,050.87కోట్ల ఆదాయం వస్తే, ఈ ఏడాది 6,899 కోట్లు వచ్చింది. ఆదాయం 14.02 శాతం పెరిగింది. నెలకు రూ.2300 కోట్ల ఆదాయం సమకూరుతోంది.

అమ్మకాల స్థాయిలో ఆదాయం లేదు

వాస్తవానికి లిక్కర్‌లో 24శాతం, బీరులో 129శాతం అమ్మకాలు పెరిగితే అంతే స్థాయిలో ఆదాయం కూడా పెరగాలి. కానీ అమ్మకాల విలువ 11.33శాతం, ఆదాయం 14.02శాతం మాత్రమే పెరిగింది. దానికి కారణం కూటమి ప్రభుత్వంలో క్వార్టర్‌ రూ. 99 మద్యం ప్రవేశపెట్టడమే. వినియోగదారులపై భారం పెరగకుండా నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం రూ.99 బ్రాండ్లను తీసుకొచ్చింది. ఆ బ్రాండ్ల అమ్మకాలు మొత్తం మార్కెట్‌ విలువలో దాదాపు 30శాతంగా ఉన్నాయి. దీంతో అమ్మకాలు పెరిగినా.. విలువ, ఆదాయంలో అది కనిపించడం లేదు. గత ప్రభుత్వంలో తక్కువ స్థాయి మద్యం బ్రాండ్ల ధరలను కూడా అమాంతం పెంచారు. కమీషన్ల కోసం ఆమేరకు పెంచగా, ప్రభుత్వం మారగానే కంపెనీలే స్వచ్ఛందంగా ధరలను తగ్గించుకున్నాయి. అమ్మకాల విలువ, ఆదాయం తగ్గడంలో ఈ రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి.

తిరుపతిలో అత్యధిక అమ్మకాలు

అమ్మకాల్లో తిరుపతి టాప్‌లో నిలిచింది. మొదటి క్వార్టర్‌లో ఈ జిల్లాలో ఏకంగా రూ.494 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఆ తర్వాత విశాఖపట్నంలో రూ.492 కోట్లు, నెల్లూరులో రూ.416కోట్లు, ఎన్టీఆర్‌లో రూ.408 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో రూ.71కోట్ల మద్యం అమ్ముడైంది. పార్వతీపురం మన్యంలో రూ.110 కోట్లు మాత్రమే అమ్మారు. అమ్మకాల వృద్ధిరేటు పరంగా చూస్తే కర్నూలులో 59, అల్లూరి జిల్లాలో 54, శ్రీసత్యసాయి జిల్లాలో 51, చిత్తూరులో 46శాతం అమ్మకాలు పెరిగాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమ్మకాల విలువ పెరిగితే ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలో 2.34శాతం అమ్మకాలు తగ్గాయి. ఈ జిల్లాలో నకిలీ మద్యం అమ్మకాలు పెరగడం దీనికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారికి సన్నిహితంగా ఉండే ఓ అధికారి జిల్లాలో ఎమ్మార్పీ ఉల్లంఘనలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆ అధికారిని ఎవరూ ఏం అనలేని పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఇది జిల్లాస్థాయిలో అధికారుల మధ్య సమన్వయాన్ని దెబ్బతీసింది. ఫలితంగా రాష్ట్రమంతా ఒక దారిలో వెళ్తుంటే, పశ్చిమ రివర్స్‌ ట్రెండ్‌లో నడుస్తోంది.

బార్ల విక్రయాలు కారణమే..

అమ్మకాలు పెరగడానికి గత ప్రభుత్వ విధానాలు ప్రధాన కారణం అయితే, బార్ల అక్రమాలను పూర్తిగా వదిలేయడం మరో కారణంగా కనిపిస్తోంది. వచ్చే ఆగస్టుతో బార్‌ పాలసీ గడువు ముగుస్తుంది. సెప్టెంబరు నుంచి కొత్త బార్‌ పాలసీ అమల్లోకి వస్తుంది. దీంతో బార్‌ లైసెన్సీలు ఇష్టారాజ్యంగా మద్యం అమ్ముతున్నారు. బార్లను ఉదయం 11 నుంచి రాత్రి 11గంటల వరకు మాత్రమే తెరవాలి. కానీ ఉదయం 10గంటల నుంచే ఎక్కువ బార్లు తెరుచుకుని మద్యం అమ్మకాలు ప్రారంభిస్తున్నాయి. నిబంధనల ప్రకారం బార్‌లోనే మద్యం సేవించాలి. కానీ చాలావరకు బార్ల లైసెన్సీలు షాపుల తరహాలో బయటకు మద్యం సీసాలు అమ్మేస్తున్నారు. పాలసీ చివరి దశకు రావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అటు ఎక్సైజ్‌, ఇటు స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ రెండు విభాగాలు బార్లను నియంత్రించడంలో విఫలమవుతున్నాయి. గతంలో స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ నిఘా ఉందనే భయం బార్ల యాజమాన్యాల్లో కనిపించేది. ఇప్పుడు ఆ విభాగం కూడా పట్టించుకోకపోవడంతో కొన్ని బార్లలో 24గంటలూ మద్యం దొరుకుతోంది.

Updated Date - Jul 09 , 2025 | 04:00 AM