Jagan Liquor Impact: జగన్ ధనాశకు జనం బలి
ABN, Publish Date - Jul 22 , 2025 | 04:25 AM
వామ్మో... ఏపీ మద్యమా! వద్దు బాబోయ్! కుదిరితే ఎయిర్‌పోర్టులో నాకో బాటిల్ తీసుకురా! లేదంటే... హైదరాబాద్‌లోనో, బెంగళూరులోనో పట్టుకురా! ఏపీ సరుకు మాత్రం వద్దు... ఆ ఐదేళ్లూ మందుబాబుల మధ్య వినిపించిన మాట!
నరాలు నలిపి.. కిడ్నీలు, లివర్లు చిదిమి..
నాసిరకం మద్యంతో ఒళ్లు గుల్ల
ఆ ఐదేళ్లలో భారీగా కిడ్నీ,లివర్,నరాల వ్యాధులు
పదిరెట్లు పెరిగిన నరాల బలహీనతలు
రెండింతలైన కాలేయ రోగాలు
ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు గణాంకాలివి
చనిపోయిన వారెందరో లెక్కల్లేవు
నరాలు నిర్వీర్యమై జనం వణికిపోనీ!
కలుషితం కడగలేక కాలేయం కుళ్లిపోనీ!
మూత్రపిండాలే మలినమై కుంగిపోనీ!
జవసత్వాలుడిగి.. కడకు మనిషే మట్టిలో కలిసిపోనీ..వాళ్లకేం లెక్కలేదు!
జనమేమైపోయినా చింతలేదు!
ఆ ముఠాకు ముడుపులు కావాలి!
కమీషన్లతో సొంత ఖజానా నిండాలి!
ప్యాలెస్‌లు కళకళ లాడుతూ ఉండాలి!
కాసుల కోసం కక్కుర్తి! అంతులేని ధనాశ! దీనికోసం జనం ప్రాణాలనే పణంగా పెట్టారు. కేవలం కమీషన్ల కోసం మద్యం విధానాన్ని మార్చారు. నాసిరకం మద్యంతో దుకాణాలను ముంచెత్తారు. ‘మద్యం’ అనే విషంతో మనుషుల ప్రాణాలతో ఆటాడుకున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో... అచ్చంగా మద్యం వల్ల తలెత్తిన నరాలు, కిడ్నీలు, కాలేయ వ్యాధులతో బాధపడిన వారి సంఖ్య అంతకుముందు ఐదేళ్లతో పోల్చితే అనేక రెట్లు పెరిగింది. ఇవేవో ఉత్తుత్తి ఆరోపణలు, కల్పిత గణాంకాలు కావు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు (జగన్ హయాంలో ఆరోగ్యశ్రీ) అధికారికంగా తేల్చిన లెక్కలు!
‘‘అందులో ఏం కలుపుతారో... ఏమో! తాగిన మూడు నాలుగు గంటలకే మళ్లీ మందువైపు మనసు లాగేస్తుంది. ఎంతగా నియంత్రించుకున్నా కుదరదు. మళ్లీ ఆ మందు తాగితేనే శరీరం అదుపులో ఉంటుంది. ఇలా రోజుకు మూడునాలుగు సార్లు జగన్ మందు తాగాల్సిందే. లేదంటే ఆ రోజు బతకలేమన్నంతలా చేసేస్తుంది!’’... జగన్ హయాంలో మందుకు బానిసైన వ్యక్తి చెప్పిన మాటలివి. జగన్ ఇచ్చిన మందు అంతలా జనాన్ని పిచ్చోళ్లను చేసింది.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘వామ్మో... ఏపీ మద్యమా! వద్దు బాబోయ్! కుదిరితే ఎయిర్‌పోర్టులో నాకో బాటిల్ తీసుకురా! లేదంటే... హైదరాబాద్‌లోనో, బెంగళూరులోనో పట్టుకురా! ఏపీ సరుకు మాత్రం వద్దు’... ఆ ఐదేళ్లూ మందుబాబుల మధ్య వినిపించిన మాట! జే-బ్రాండ్ లిక్కర్ అంతగా భయపెట్టింది. ఇవేవీ అనవసరమైన ఆందోళనలు, అవసరంలేని భయాలు కావు! జగన్ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించిన మద్యం నిజంగానే విషతుల్యమని ‘రోగాల సాక్షి’గా రుజువైంది. కేవలం ధనాశ, దురాశతో మద్యం విధానాన్ని మార్చేసి... చీప్ లిక్కర్ పేరుతో చెత్త మద్యాన్ని జనం నోళ్లల్లో పోశారు. జగన్ మందు దెబ్బకు జనం జవసత్వాలుడిగిపోయాయి. నరాలు చచ్చుబడిపోయాయి. మూత్రపిండాలు మొరాయించాయి. కాలేయాలు విఫలమయ్యాయి. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ట్రస్టు వద్ద నమోదైన అధికారిక గణాంకాల ప్రకారం... సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య జగన్ హయాంలో ఒక్కసారిగా పెరిగిపోయింది. కిడ్నీ, లివర్, నరాల వ్యాధిగ్రస్తుల సంఖ్య బయటపడింది. వీరంతా ‘ఆరోగ్యశ్రీ’ (ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవ) పరిధిలో చికిత్స చేయించుకున్న వారు మాత్రమే. ఆ పథకం పరిధిలోకి రాని, ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకున్న వారి సంఖ్య దీనికి అదనం. ప్రాణాలు కోల్పోయిన వారి లెక్కలూ తేలలేదు.
ఔను... విషం!
నాసిరకం మద్యంతో నాడీ వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. కిడ్నీలూ, కాలేయం దెబ్బతింటాయి. జే-బ్రాండ్లతో ఇదే జరిగింది. 2014-19 మధ్యకాలంలో కేవలం మద్యంతో లివర్ దెబ్బతిని, చికిత్స పొందిన వారి సంఖ్య 14,026. 2019-24 మధ్య ఆ సంఖ్య ఏకంగా 29,369కి పెరిగింది. జగన్ అధికారంలోకొచ్చిన 2019-20లోనే లివర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కరోనా కారణంగా ఆ తర్వాతి సంవత్సరం తగ్గినా... 2021-22 నుంచి పెరుగుతూ పోయింది. 2019-20లో మద్యం కారణంగా కాలేయం దెబ్బతిని చికిత్స పొందినవారి సంఖ్య 1492కాగా... జగన్ హయాంలో చివరి ఏడాది 2023-24లో అది 11,223కు చేరింది. మొత్తంగా ఐదేళ్లలో లివర్ బాధితుల సంఖ్య 14,026 నుంచి 29,369కి పెరిగింది. అంటే... రెట్టింపుకంటే ఎక్కువ! వీరిలో 24,519 మంది పురుషులే.
చచ్చుపడ్డ నరాలు...
జగన్ ఇచ్చిన నాసిరకం మద్యం తాగి వేల మంది నరాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ మద్యం దెబ్బకు నరాలు చచ్చుపడ్డాయి. 2014-19 మధ్యలో నరాల సమస్యలతో బాధపడేవారి సంఖ్య కేవలం 1,276 మాత్రమే ఉండేది. 2019-24 మధ్య ఆ సంఖ్య 12,663కి పెరిగింది. అంటే... దాదాపు పదిరెట్లు అధికం! నిజానికి.. మద్యం నరాల మీద పెద్దగా ప్రభావం చూపదు. మత్తు దిగిన తర్వాత సాధారణ స్థితిలోకి వస్తారు. కానీ.. జగన్ ఇచ్చిన నాసిరకం మద్యం మాత్రం నేరుగా నరాలపైనే ప్రభావం చూపిం ది. ఇది దీర్ఘకాలికంగా కొనసాగడంతో మెదడుపై దుష్ప్రభావం పడింది. నరాల సమస్య మనిషిని ఏ పనీచేయలేక, బయటకు వెళ్లలేక ఒంటరిని చేస్తుంది.
కిడ్నీలు పిండేశారు!
జగన్ మద్యం మూత్రపిండాలను దారుణంగా పిండేసింది. నాసిరకం మద్యం నేరుగా కిడ్నీలపై ప్రభావం చూపింది. 2014-15లో 7,427 మందిలో కిడ్నీ సమస్యలు తలెత్తాయి. ఆ సంఖ్య... 2019-20కి 15,363కు పెరిగింది. 2023-24కు ఏకంగా 23,553కు చేరింది. మొత్తంగా 2014-19 మధ్యకాలంలో మద్యంవల్ల 49,060 మంది కిడ్నీ సమస్యలతో బాధపడగా... 2019-24లో ఆ సంఖ్య 90,385 వేలకు పెరిగింది. మొత్తంగా కిడ్నీ కేసులు 84ు పెరిగాయి. వీరిలో అనేకమంది ఇప్పటికీ డయాలసిస్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు.
మధ్య వయస్సుపై మహమ్మారి
జగన్ మద్యం దెబ్బకు మధ్య వయస్సు వారి ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
మద్యం వల్ల లివర్ దెబ్బతిన్న వారిలో 35 - 54 మధ్య ఏళ్ల వయస్సు వారే అధికం. అందులో 35-44 మధ్య వయస్సు వారు 987 మంది. 45-54 మధ్య వయస్సు వారు 1140.
కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో 35-44 ఏళ్ల మధ్య వయస్కులు 5217 మంది కాగా, 45-54 మధ్య వయస్సు వారు 7479 మంది ఉన్నారు.
నరాలు దెబ్బతిన్న వారిలో 35-44 ఏళ్ల మధ్య వయస్కులు 625 మంది, 45-54 మధ్య వయస్సు వారిలో 1140 మంది ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అజ్ఞాతంలోకి పేర్ని నాని.. గాలిస్తున్న పోలీసులు..
విచారణకు హాజరు కాలేను: మాజీ మంత్రి నారాయణ స్వామి
For More Andhra Pradesh News
Updated Date - Jul 22 , 2025 | 06:21 AM