Engineering Counseling: ఇంజనీరింగ్ అఫిలియేషన్లలో జాప్యం
ABN, Publish Date - Jun 18 , 2025 | 07:00 AM
ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ల ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. గతేడాది ఈ సమయానికి దాదాపుగా అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తికాగా, ఈ సంవత్సరం ఇంతవరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు.
తనిఖీలు ప్రారంభించని ఉన్నత విద్యాశాఖ
గతేడాది జూలై 1 నుంచే అడ్మిషన్ల ప్రక్రియ
ఈ ఏడాది ఆలస్యం.. విద్యార్థుల ఆందోళన
అమరావతి,జూన్ 17(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ల ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. గతేడాది ఈ సమయానికి దాదాపుగా అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తికాగా, ఈ సంవత్సరం ఇంతవరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ ఇప్పటికే అనుమతులు మంజూరు చేసింది. దీనికి అనుగుణంగా ఉన్నత విద్యాశాఖ కాలేజీల్లో సీట్ల భర్తీకి అనుమతులు ఇవ్వాలి. మరోవైపు కాలేజీల్లో తనిఖీలు చేపట్టి అఫిలియేషన్లు రెన్యువల్ చేయాలి. ఈ ఏడాది ఇప్పటికీ తనిఖీలు ప్రారంభించకపోవడంతో అడ్మిషన్లలో జాప్యం జరుగుతుందని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది జూలై 1 నుంచి రాష్ట్రంలో తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఇంకా అఫిలియేషన్ల ప్రక్రియే ప్రారంభం కాకపోవడంతో కౌన్సెలింగ్ ఆలస్యమయ్యే అవకాశం నెలకొంది. కాలేజీల తనిఖీలకు ఒక్కో కాలేజీకి ముగ్గురు చొప్పున అధికారులు కావాలి. రాష్ట్రంలో 287 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. అన్ని కాలేజీల్లో తనిఖీలకు నెలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో ఏపీ విద్యార్థుల్లో కొందరు తెలంగాణలో చదివేందుకు మొగ్గు చూపుతారేమోనని కాలేజీలు ఆందోళన చెందుతున్నాయి. గతేడాది కొత్త ప్రభుత్వం వచ్చాక జూలైలోనే అడ్మిషన్ల ప్రక్రియ ముగించింది. దీంతో 20 వేల వరకు అడ్మిషన్లు పెరిగాయి. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. దీంతో ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు పెరుగుతాయనే అంచనా ఉంది. కానీ, అఫిలియేషన్లలో జాప్యం అడ్మిషన్లపై ప్రభావం చూపుతుందేమోనని కాలేజీల యాజమాన్యాలు భావిస్తున్నాయి.
రిజిస్ర్టేషన్ పేరుతో దోపిడీపలు ప్రైవేటు కాలేజీలు రిజిస్ర్టేషన్ పేరుతో దోపిడీ చేస్తున్నాయి. ‘మీ కోసం సీటు నిలిపి ఉంచుతా’మంటూ చేస్తామంటూ విద్యార్థుల నుంచి రూ.10 నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నాయి. కన్వీనర్ కోటాలో కోరుకున్న సీటు వస్తుందో రాదోనన్న అనుమానం ఉన్నవారు కొన్ని కాలేజీలకు రిజిస్ర్టేషన్ ఫీజు చెల్లిస్తున్నారు. ఒకవేళ కన్వీనర్ కోటాలో మంచి సీటు లభిస్తే ఆ రిజిస్ర్టేషన్ డబ్బులు పోయినట్లే. మేనేజ్‌మెంట్ కోటాలో సీటు తీసుకున్నా చేరిన కాలేజీ తప్ప మిగిలిన కాలేజీల్లో కట్టిన రిజిస్ర్టేషన్ రుసుము వెనక్కి ఇవ్వరు. దీంతో విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది.
Updated Date - Jun 18 , 2025 | 07:01 AM