Cycling Journey: సాహస నారి.. సైకిల్ యాత్ర
ABN, Publish Date - Jul 29 , 2025 | 06:41 AM
తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ.. 44 రోజుల పాటు ఏకంగా 1,300 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర! సైక్లింగ్‌పై ఫ్యాషన్‌తో ఆ సాహసయాత్రను...
44 రోజులు.. 1,300 కిలోమీటర్లు
అరకులోయ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ.. 44 రోజుల పాటు ఏకంగా 1,300 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర! సైక్లింగ్‌పై ఫ్యాషన్‌తో ఆ సాహసయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసింది తెలంగాణకు చెందిన వెన్నెల అనే ఓ యువతి. గతంలో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడంతో పాటు గత ఏడాది కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు కూడా సైకిల్ యాత్ర చేపట్టినట్లు ఆమె చెప్పారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనేది తన కోరిక అని పేర్కొన్నారు. వెన్నెల గత నెల 14న హైదరాబాద్ నుంచి సైకిల్‌పై బయలుదేరి.. తిరుపతి, తదితర ప్రాంతాలను సందర్శిస్తూ ఆదివారం అరకు లోయ చేరుకున్నారు. ఆమెకు ఆదివాసీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు సీహెచ్ మోహన్, అరకు జనసేన ఇన్‌చార్జి చిరంజీవి, నేచర్ నెస్ట్ రిసార్ట్స్ యాజమాన్యం సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెన్నెల తన ప్రయాణ విశేషాలను సోమవారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఆ వివరాలు ఆమె మాటల్లో.. హైదరాబాద్ నుంచి అరకులోయ వరకు సైకిల్ యాత్ర చేయాలని సంకల్పించి.. గత నెల 14న అక్కడ నుంచి బయలుదేరాను. మహిళా సాధికారత, వాహన చోదకులకు హెల్మెట్ ధారణపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగాను. ఈ ప్రయాణంలో చాలా మంది నన్ను ప్రోత్సహించారు. వారి ఇళ్లకు తీసుకెళ్లి ఆతిథ్యం ఇచ్చేవారు. కొన్నిసార్లు రాత్రి వేళల్లో పెట్రోల్ బంకుల వద్ద విశ్రాంతి తీసుకునేదాన్ని. నాకు తిరుపతి, అరకులోయ చాలా బాగా నచ్చాయి’ అని తెలిపారు.ఈ సందర్భంగా పలువురు ఆమెను ఘనంగా సత్కరించి, అభినందించారు.
Updated Date - Jul 29 , 2025 | 06:42 AM