స్కేటింగ్ రోల్‌బాల్ క్రీడాకారుడు శ్రీశాంతకు ఘన స్వాగతం
ABN, Publish Date - Jul 07 , 2025 | 01:32 AM
కెన్యా దేశంలో జరిగిన స్కేటింగ్ రోల్‌బాల్ పోటీల్లో కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు పంచాయతీ శివారు కొండిపాలెం గ్రామానికి చెందిన మోటపర్తి రేణుకరాజు మనవడు మోటపర్తి శ్రీశాంత భారతదేశం తరఫున ఆడి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
-కెన్యాలో జరిగిన పోటీల్లో విజేతగా భారత జట్టు
-విజయంలో కీలకపాత్ర పోషించిన కొండిపాలెం కుర్రోడు
-తల్లిదండ్రులతో స్వగ్రామానికి రాక
-ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లిన గ్రామస్థులు
గుడ్లవల్లేరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి) :
కెన్యా దేశంలో జరిగిన స్కేటింగ్ రోల్‌బాల్ పోటీల్లో కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు పంచాయతీ శివారు కొండిపాలెం గ్రామానికి చెందిన మోటపర్తి రేణుకరాజు మనవడు మోటపర్తి శ్రీశాంత భారతదేశం తరఫున ఆడి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దేశ ప్రజల మన్ననలు అందుకున్నారు. రేణుకరాజుది గ్రామంలో సాధారణ రైతు కుటుంబం. ఆయన కుమారుడు మోటపర్తి రాంబాబు సీఆర్‌పీఎఫ్‌లో చేరి చత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన కుటుంబం చాంద్రాయనగుట్ట సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌లో ఉంటోంది. రాంబాబు, చైతన్య దంపతుల కుమారుడు శ్రీశాంత శివరాంపల్లి నేషనల్ పోలీస్ అకాడమీ కాలేజీలో ఇంటర్ చదువుకొంటూ సిల్పావాగ్రే ఉమెన్ కోచ్ వద్ద స్కేటింగ్ రోల్‌బాల్‌లో శిక్షణ తీసుకున్నారు. శివరాంపల్లి నేషనల్ పోలీస్ అకాడమీ టీమ్‌కు రెండు సార్లు నేషనల్స్ ఆడి ప్రతిభ చూపి భారత జట్టుకు శ్రీశాంత ఎంపికయ్యారు. కాగా, జూన్ 26, 27, 28, 29 తేదీల్లో కెన్యాలో జరిగిన పోటీల్లో భారత జట్టులో ఆడి విజయానికి కృషి చేశారు. కాగా, శ్రీశాంత తల్లిదండ్రులతో కలిసి ఆదివారం రాత్రి గ్రామానికి వచ్చారు. వడ్లమన్నాడు నుంచి శ్రీశాంతను గ్రామస్తులు ఊరేగింపుగా గ్రామానికి తీసుకెళ్లారు. వడ్లమన్నాడులో భారీగా బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. తాత రేణుకరాజుతో విజయోత్సవ కేక్‌ను కట్ చేయించారు. అనంతరం శ్రీశాంతను సన్మానించారు. శ్రీశాంతతో గ్రామస్థులు సెల్ఫీలు దిగి వారి తల్లిదుండ్రులు రాంబాబు, చైతన్య దంపతులను అభినందించారు. తన మనవడు ఇంత మంచి స్థాయికి ఎదగడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భగా రేణుకరాజు అన్నారు. ఇంతటి విజయం తర్వాత స్వగ్రామానికి రావడం, ఇక్కడి ప్రజలు, బంధువులు చూపిన ప్రేమాభిమానాలు మరువలేనివని శ్రీశాంత చెప్పారు. తన కోచ్ సిల్పావాగ్రే తన విజయానికి కారణమని వివరించారు. ఇంకా ఈ గేమ్‌లో నెక్ట్స్‌లెవల్ కోసం కృషిచేస్తానని చెప్పారు.
Updated Date - Jul 07 , 2025 | 01:32 AM