బాలుడిని బలిగొన్న బియ్యం డబ్బా
ABN, Publish Date - May 11 , 2025 | 01:21 AM
సరదాగా ఆడుకుంటూ బియ్యం డబ్బాలో కూర్చొన్న ఏడేళ్ల బాలుడిపై మూత పడటంతో బయటకు రాలేక, ఊపిరాడక మృతి చెందాడు. అప్పటి దాకా తమ కళ్ల ముందే ఆడుకుంటున్న కన్న కొడుకు అసువులు బాయటంతో తల్లిదండ్రుల వేదనకు అంతులేకుండా పోయింది. చూపరులకు కన్నీళ్లు తెప్పిస్తున్న హృదయ విదారక ఘటన ఎన్‌టీఆర్ జిల్లా కంచికచర్లలో శుక్రవారం జరిగింది.
- సరదాగా ఆడుకోబోతే... మూతపడి ఊపిరి ఆగింది
- కంచికచర్లలో ఘటన.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
సరదాగా ఆడుకుంటూ బియ్యం డబ్బాలో కూర్చొన్న ఏడేళ్ల బాలుడిపై మూత పడటంతో బయటకు రాలేక, ఊపిరాడక మృతి చెందాడు. అప్పటి దాకా తమ కళ్ల ముందే ఆడుకుంటున్న కన్న కొడుకు అసువులు బాయటంతో తల్లిదండ్రుల వేదనకు అంతులేకుండా పోయింది. చూపరులకు కన్నీళ్లు తెప్పిస్తున్న హృదయ విదారక ఘటన ఎన్‌టీఆర్ జిల్లా కంచికచర్లలో శుక్రవారం జరిగింది.
కంచికచర్ల, మే 10 (ఆంధ్రజ్యోతి): కంచికచర్ల అరుంధతీకాలనీకి చెందిన ఉలవలపూడి పవన్, సరస్వతి దంపతులకు ఇద్దరు కుమారులు. పవన్ ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, సరస్వతి ఇంటి వద్ద టైలరింగ్ చేస్తోంది. నిరుపేదలు కావటంతో రెక్కల కష్టంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమారులిద్దరికీ పెద్ద చదువులు చెప్పించి, ఉన్నతమైన భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో స్థానిక ఇంగ్లీషు మీడియం స్కూలులో చదివిస్తున్నారు. పెద్దకుమారుడు రెండో తరగతి, చిన్న కుమారుడు వినయ్ కుమార్(7)కు ఒకటో తరగతి పూర్తైంది. వేసవి సెలవుల కోసం పెద్ద కుమారుడు బంధువుల ఇంటికి వేరే గ్రామం వెళ్లాడు. రెండు రోజుల్లో జరగనున్న పవన్ తండ్రి సంస్మరణ కార్యక్రమం నిమిత్తం ఇంటిని శుభ్రం చేయాలనుకున్నారు. శుక్రవారం పవన్ కంపెనీకి వెళ్లగా, ఇంట్లో సామన్లు ఇంటిపైన (రూఫ్) పెట్టి సరస్వతి ఇల్లు శుభ్రం చేస్తుంది. ఆడుకునేందుకు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చిన్న కుమారుడు వినయ్‌కుమార్ ఇంటిపైకి వెళ్లాడు. ఆడుకుంటూ సరదాగా బియ్యం డబ్బాలో కూర్చోగానే మూత పడటంతో పాటుగా గొళ్లెం కూడా ఆటోమేటిక్‌గా పడింది. అభం శుభం తెలియని వినయ్ ఎంత ప్రయత్నించినప్పటికీ గొళ్లెం ఊడలేదు. మూత బిగుసుకుపోవటంతో ఒకవైపు డబ్బాలో గాలి తగలటం లేదు. మరోవైపు స్టెయిన్‌లెస్ స్టీల్ డబ్బా కావటంతో ఎండ తీవ్రతకు బాగా వేడెక్కింది. ఊపిరాడక పోవటంతో కొద్ది నిమిషాల వ్యవధిలోనే వినయ్ విగతజీవిగా మారిపోయాడు. వేడికి చర్మం కూడా ఎర్రగా కమిలిపోయింది. సాయంత్రమైనప్పటికీ చిన్న కుమారుడు ఇంటికి రాకపోవటంతో తల్లి సరస్వతి కంగారు పడుతూ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్థానికులకు తెలిపింది. అందరూ చుట్టు పక్కల పరిసరాలతో పాటుగా సమీప గ్రామాల్లో గాలించినప్పటికీ ఆచూకీ తెలియలేదు. శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంటిమీద కునుకు లేకుండా, అన్న పానీయాలు లేకుండా వినయ్ కోసం వెదుకుతూనే ఉన్నారు. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటిపైకి వెళ్లి బియ్యం డబ్బా తెరిచి చూడగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు చలనం లేకుండా విగతజీవిగా కనిపించాడు. వెంటనే స్థానికులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే వినయ్ మృతి చెందాడని వైద్యులు చెప్పగానే తల్లిదండ్రులు పవన్, సరస్వతి గుండెలు పగిలేలా రోదిస్తూ కుప్పకూలిపోయారు. శనివారం నందిగామలో పోస్టు మార్టం అనంతరం వినయ్ భౌతికకాయాన్ని ఇంటికి తీసుకువచ్చారు. ఈ ఘటన ప్రతి ఒక్కరిని కంటతడిపెట్టించింది. సాయంత్రం అంత్య క్రియలు నిర్వహించారు.
Updated Date - May 11 , 2025 | 01:22 AM