దొంగ పట్టాలపై కదిలిన డొంక!
ABN, Publish Date - Jun 18 , 2025 | 01:28 AM
మచిలీపట్నం నియోజకవర్గంలో ఎన్నికల ముందు మాజీ మంత్రి పేర్ని నాని పంపిణీ చేసిన దొంగ ఇళ్ల పట్టాల వ్యవహారంపై డొంక కదిలింది. కరగ్రహారం, చిలకలపూడిలో 320 ఎకరాలకు పైగా భూమిలో అనర్హులకు పట్టాలు ఇచ్చిన విషయంపై, సీ్ట్రట్‌ఫీల్డ్ పేరుతో 870 మందికిపైగా పేదలకు పట్టాలు ఇచ్చిన అంశంపై మచిలీపట్నం ఆర్డీవో కె.స్వాతి, రెవెన్యూ అధికారులు మంగళవారం రాత్రి విచారణ చేపట్టారు. మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న రికార్డులను పరిశీలించారు. అసలు ఎంతమందికి పట్టాలు ఇచ్చారు.. వారిలో అర్హులు ఎంతమంది, అనర్హులు ఎంత మంది అనే అంశంపై రికార్డులను తనిఖీ చేస్తున్నారు. కొన్ని కీలకమైన ఆధారాలు లభ్యం కాగా, మరిన్ని వివరాల కోసం బుధవారం కూడా రెవెన్యూ రికార్డులను, ఇంటి పట్టాలకు సంబంధించిన పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు.
- ఎన్నికల వేళ పేదలకు ఇళ్ల పట్టాలు పంచిన మాజీ మంత్రి పేర్ని నాని
- నాడు తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి సంతకాలు పెట్టిస్తుంటే అడ్డుకున్న కూటమి నేతలు
- అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య వివాదంగా దొంగ పట్టాల వ్యవహారం
- మంగళవారం రాత్రి మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయంలలో అధికారుల తనిఖీలు
- నేడు తనిఖీలు కొనసాగించాలని ఆర్డీవో ఆదేశాలు
మచిలీపట్నం నియోజకవర్గంలో ఎన్నికల ముందు మాజీ మంత్రి పేర్ని నాని పంపిణీ చేసిన దొంగ ఇళ్ల పట్టాల వ్యవహారంపై డొంక కదిలింది. కరగ్రహారం, చిలకలపూడిలో 320 ఎకరాలకు పైగా భూమిలో అనర్హులకు పట్టాలు ఇచ్చిన విషయంపై, సీ్ట్రట్‌ఫీల్డ్ పేరుతో 870 మందికిపైగా పేదలకు పట్టాలు ఇచ్చిన అంశంపై మచిలీపట్నం ఆర్డీవో కె.స్వాతి, రెవెన్యూ అధికారులు మంగళవారం రాత్రి విచారణ చేపట్టారు. మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న రికార్డులను పరిశీలించారు. అసలు ఎంతమందికి పట్టాలు ఇచ్చారు.. వారిలో అర్హులు ఎంతమంది, అనర్హులు ఎంత మంది అనే అంశంపై రికార్డులను తనిఖీ చేస్తున్నారు. కొన్ని కీలకమైన ఆధారాలు లభ్యం కాగా, మరిన్ని వివరాల కోసం బుధవారం కూడా రెవెన్యూ రికార్డులను, ఇంటి పట్టాలకు సంబంధించిన పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు.
మచిలీపట్నం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి):
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో సర్వే చేయించి ఇళ్ల స్థలాలు లేని వారిని గుర్తించారు. మచిలీపట్నం నగరంలో 16 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఉత్తర్వులు జారీ చేశారు. నవశకం పథకంలో భాగంగా అప్పటి మునిసిపల్ కమిషనర్ కాంపిటేటివ్ అథారిటీని ఏర్పాటు చేశారు. ఆర్డీవో స్థాయిలో మచిలీపట్నం నియోజకవర్గంలో 19,200 మందికిపైగా ఇళ్లపట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. భూసేకరణ ప్రత్యేక అధికారిగా ఉన్న కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ మచిలీపట్నం రాగా, ముడా భూములను ఆయనకు అధికారులు చూపారు. ఈ భూములు నివాసానికి పనికిరావని తేల్చారు. దీంతో ప్రైవేటు భూములను సేకరించాలని నిర్ణయించారు. కరగ్రహారం, చిలకలపూడిలోని ప్రైవేటు భూములను పరిశీలించారు. కరగ్రహారంలో ఎకరం రూ.11.50 లక్షల ధర ఉండగా.. చిలకలపూడిలో రూ. 70 లక్షల వరకు ఎకరం భూమి ధర ఉంది. మధ్యేమార్గంగా ఈ రెండు ప్రాంతాల్లోని భూమి ధరను కలెక్టర్ రూ.39 లక్షలుగా నిర్ణయించారు. 320 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇందులో 60 ఎకరాలకుపైగా భూమికి సరైన పత్రాలు లేకపోవడంతో దీనికి సంబంధించిన నగదును కోర్టులో కట్టారు. సేకరించిన భూమిని ఏ నుంచి ఎల్ బ్లాక్‌లుగా విభజించి చదును చేశారు. ఇందులో అనర్హులకు సెంటు భూమి చొప్పున పట్టాలు ఇచ్చారనే అంశంపై పలు ఫిర్యాదులు అందాయి. దీంతో పాటు మచిలీపట్నం నగరంలో రహదారులు వెంబడి నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారికి ఇంటి పట్టాలు ఇవ్వడానికి పట్టాలు ముద్రించారని, ఇందుకు అప్పట్లో పనిచేసిన జేసీ మాధవీలత ప్రత్యేక లాగిన్ తీసుకుని పట్టాలు ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక నకిలీ పట్టాలపై తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సంతకాలు పెట్టిస్తున్నారని గ్రహించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, టీడీపీ, జనసేన నాయకులు రాత్రి 12 గంటల సమయంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో జేసీ గీతాంజలిశర్మ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి దొంగపట్టాల వ్యవహారంపై వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య రాజకీయపరంగా వివాదం నడుస్తోంది. తాజాగా దొంగపట్టాల విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్ అవుతారనే అంశంపై ఇటీవల కాలంలో ప్రచారం విస్తృతంగా సాగుతోంది. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అఽధికారులు మంగళవారం రాత్రి ఇంటి పట్టాల పంపిణీ అంశంపై విచారణ ప్రారంభించడంతో ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Updated Date - Jun 18 , 2025 | 01:28 AM