Realestate: రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం..!
ABN, Publish Date - Jul 23 , 2025 | 01:03 AM
డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లు, సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీకి సంబంధించిన స్టాంప్ డ్యూటీని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇక రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెట్టనుంది. ర్యాపిడ్ గ్రోత ఏరియాగా ఉన్న విజయవాడ, గ్రేటర్ విలీన ప్రతిపాదిత గ్రామాల్లో సైతం కొద్ది కాలంగా నెలకొన్న స్తబ్దతకు ఇక ఫుల్‌స్టాప్ పడనుంది. రాజధాని ప్రాంత పరిధిలో కూడా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి.
కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లకు 3 శాతం స్టాంప్ డ్యూటీ తగ్గింపు
సేల్ కమ్ జీపీఏలకు కూడా 7.5 శాతం నుంచి 4 శాతానికి కుదింపు
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని సబ్ రిజిస్ర్టార్లకు ఆదేశాలు జారీ
డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లు, సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీకి సంబంధించిన స్టాంప్ డ్యూటీని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇక రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెట్టనుంది. ర్యాపిడ్ గ్రోత ఏరియాగా ఉన్న విజయవాడ, గ్రేటర్ విలీన ప్రతిపాదిత గ్రామాల్లో సైతం కొద్ది కాలంగా నెలకొన్న స్తబ్దతకు ఇక ఫుల్‌స్టాప్ పడనుంది. రాజధాని ప్రాంత పరిధిలో కూడా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు రిజిస్ర్టేషన్స్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని సబ్ రిజిస్ర్టార్లకు ఐజీ నుంచి ఆదేశాలు అందాయి. భూ యజమాని, బిల్డర్ మధ్య డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లకు ప్రస్తుతం వసూలు చేస్తున్న నాలుగు శాతం స్టాంప్ డ్యూటీని ఇక మీదట ఒక శాతం మాత్రమే వసూలు చేసేలా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. గతంలో ఒక శాతం స్టాంపు డ్యూటీ ఉండేది. ఆ తర్వాత దీనిని నాలుగు శాతం పెంపుదల చేశారు. ఒకే సారి మూడు శాతం పెంపుదల వల్ల స్టాంపు డ్యూటీ కట్టడం కష్టంగా ఉందన్న భావన బిల్డర్ల నుంచి వ్యక్తమవుతోంది. ఈ కారణంగా గిట్టుబాటు కావటం లేదని బిల్డర్లు వెనక్కి తగ్గుతున్నారు. దీంతో డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లు కూడా తగ్గిపోతున్నాయి. డెవలప్‌మెంట్ అగ్రిమెంట్స్ తగ్గిపోవటం వల్ల రిజిస్ర్టేషన్ శాఖకు ఆదాయం కూడా తగ్గిపోతోంది. డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లను గణనీయంగా పెంచేందుకు వీలుగా.. నాలుగు శాతంగా ఉన్న స్టాంపు డ్యూటీని ఒక శాతానికి తీసుకువచ్చారు.
అలాగే రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్స్ విషయంలో సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ)కి సంబంధించి కూడా కొన్ని మినహాయింపులు ప్రభుత్వం కల్పించింది. ఒక స్థలాన్ని జీపీఏ చేయించుకున్న వ్యక్తి ఆ స్థలాన్ని మరొకరికి విక్రయించినపుడు కొనుగోలు చేసిన వ్యక్తి 7.5 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉండేది. ఇక మీదట కేవలం నాలుగు శాతం స్టాంపు డ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది. దాదాపుగా 3.5 శాతం మేర స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వటం జరిగింది. గతంలో సేల్ కమ్ జీపీఏ చేయించుకున్న వారికి మాత్రమే ఈ మినహాయింపు ఉండేది. జీపీఏ చేయించుకున్న వ్యక్తి బయట వాళ్లకు విక్రయిస్తే ఈ మినహాయింపు ఉండేది కాదు. తాజాగా బయట వాళ్లకు అమ్మినా అదే మినహాయింపును అమలు చేస్తూ రిజిస్ర్టేషన్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల క్రెడాయ్ నేతృత్వంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి
రియల్ ఎస్టేట్ రంగాన్ని పురోగమింపచేటానికి వీలుగా ఇటీవల కాలంలో క్రెడాయ్ నేతృత్వంలో స్టాంపు డ్యూటీల విషయంలో ప్రభుత్వాన్ని మినహాయింపులు కోరటం జరిగింది. ఈ క్రమంలో రిజిస్ర్టేషన్స్ శాఖ ఇచ్చిన ఆదేశాలు రియల్ ఎస్టేట్ రంగంలో లే అవుట్, భవన నిర్మాణ రంగ ప్రాజెక్టులకు సంబంధించి డెవలప్‌మెంట్ అగ్రిమెంట్స్, సేల్ కమ్ జీపీఏలకు ఎంతో ఊరటను కలిగించనుంది. వాస్తవానికి ఈ రెండు మినహాయింపులు ఇవ్వటం వల్ల రిజిస్ర్టేషన్ శాఖ ఆదాయం మీద ప్రభావం చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో జోష్‌ను నింపటం కోసం ఈ రెండు మినహాయింపులను ఇచ్చారు.
Updated Date - Jul 23 , 2025 | 11:12 AM