Sri Sathya Sai District: ఎస్‌బీఐలో రూ.37.92 లక్షలు చోరీ
ABN, Publish Date - Jul 29 , 2025 | 04:11 AM
గ్యాస్ కట్టర్‌తో కిటికీ గ్రిల్స్ కట్ చేసి బ్యాంకులోకి చొరబడిన దొంగలు రూ.37.92 లక్షల నగదు, 10 కిలోల బంగారు ఆభరణాలు చోరీ చేశారు.
10 కిలోల బంగారు ఆభరణాలు కూడా..
గ్యాస్ కట్టర్‌తో కిటికీ గ్రిల్స్ తొలగింపు
సేఫ్టీ లాకర్‌నూ తెరిచి సొత్తు అపహరణ
శ్రీసత్యసాయి జిల్లాలో ఘటన
హిందూపురం, జూలై 28(ఆంధ్రజ్యోతి): గ్యాస్ కట్టర్‌తో కిటికీ గ్రిల్స్ కట్ చేసి బ్యాంకులోకి చొరబడిన దొంగలు రూ.37.92 లక్షల నగదు, 10 కిలోల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామికవాడలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచిలో జరిగిందీ ఘటన. డీఎస్పీ మహేష్ తెలిపిన వివరాల మేరకు.. బ్యాంకు సిబ్బంది శుక్రవారం విధులు ముగించుకుని, బ్యాంకుకు తాళం వేసి వెళ్లారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో తిరిగి సోమవారం ఉదయం వచ్చేసరికి బ్యాంకు తలుపులు తెరిచి ఉన్నాయి. ఓ టేబుల్‌పై తాళాలు కనిపించాయి. స్ర్టాంగ్‌రూమ్ తలుపులు కూడా తెరిచి ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులకు, బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ మహేష్, సీఐ అబ్దుల్ కరీం వచ్చి పరిశీలించారు. బ్యాంకు వెనుకవైపు కిటికీ కడ్డీలను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. మొదట మాస్కు ధరించిన వ్యక్తి కిటికీ గుండా లోనికి ప్రవేశించినట్లు సీసీ కెమెరాలలో రికార్డైంది. అతను సీసీ కెమెరాలు, సైరన్ వైర్‌లను కోసేశాడు. ఆ తర్వాత మరికొందరు లోనికి చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 2 గంటలకు చోరీ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. లాకరులో ఉన్న రూ.37.92 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. సేఫ్టీ లాకర్‌ను గ్యాస్ కట్టర్‌తో తెరిచారు. ఓ బాక్సులో ఉన్న 10 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించాయి. బ్యాంకులో వేలిముద్రలను సేకరించారు.
Updated Date - Jul 29 , 2025 | 04:13 AM