రుణమాఫీ పొందిన రైతులకు కొత్త రుణాలివ్వాలి: మంత్రి తుమ్మల
ABN, Publish Date - Dec 30 , 2024 | 03:39 AM
రుణమాఫీ పొందిన రైతులకు కొత్తగా రుణాలివ్వాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకర్లను ఆదేశించారు.
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీ పొందిన రైతులకు కొత్తగా రుణాలివ్వాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకర్లను ఆదేశించారు. యాసంగి పంటల సాగు ప్రారంభమవుతున్న దశలోనే రైతులకు రుణాలివ్వాలని, బ్యాంకుల చుట్టూ రైతులను తిప్పించుకోవద్దని సూచించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు కార్యాలయాన్ని మంత్రి తుమ్మల ఆదివారం సందర్శించారు. రుణమాఫీ, బ్యాంకు పనితీరు, ఆర్థిక లావాదేవీలపై సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా సహకార బ్యాంకుల్లో పాలక వర్గాలు, అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని తప్పులు జరిగాయని, అలాంటివి పునరావృతం కావొద్దని మంత్రి సూచించారు. 2025 సంవత్సరం సహకార సంఘాలకు చాలా ప్రత్యేకమైనదని, దానికి తగినట్లుగా బ్యాంకర్లు అద్భుతమైన పనితీరు చూపించి రైతుల పురోగతిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార బ్యాంకు చైర్మన్ మార్నేని రవీంద్‌రావు, ఎండీ డాక్టర్ బి. గోపి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 30 , 2024 | 03:42 AM