స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి
ABN, Publish Date - Dec 24 , 2024 | 10:52 PM
దేవాపూర్‌లోని ఓరియంట్ సిమెంట్ కంపెనీలో స్ధానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభావిత గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని కంపెనీ పర్మినెంటు వర్కర్స్ లోకల్ యూనియన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు.
కాసిపేట, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): దేవాపూర్‌లోని ఓరియంట్ సిమెంట్ కంపెనీలో స్ధానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభావిత గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని కంపెనీ పర్మినెంటు వర్కర్స్ లోకల్ యూనియన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. మంగళవారం కంపెనీ ప్రధాన గేటు ఎదుట ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ నాలుగున్నర దశాబ్దాల క్రితం ఏర్పడ్డ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఓరియంట్ సిమెంట్ కంపెనీని సీకే బిర్లా యాజమాన్యం ఆదాని గ్రూపునకు అమ్మకం చేస్తున్న క్రమంలో స్ధానిక ఉద్యోగులకు, నిరుద్యోగులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
నాలుగో ప్లాంటు విస్తరణలో భాగంగా 4 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీఇచ్చారని, ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి పురోగతి లేదన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువకులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారని, కానీ ఆచరణకు నోచుకోలేదన్నారు. పరిసర గ్రామాలతో పాటు దేవాపూర్‌లో సీసీ రోడ్లు, విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. కంపెనీ ఏర్పాటు చేసిన పవర్‌ప్లాంట్ ద్వారా దేవాపూర్‌లోని ప్రతీ ఇంటికి ఉచితంగా కరెంటు ఇవ్వాలన్నారు. ప్రజా సంఘాల, కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. నాయకులు తట్ర భీంరావు, వై. శ్రీనివాస్, సార రాజయ్య, సామ సనత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, మడావి గంగారాం, సీపీఐకార్యదర్శి గట్టు సర్వేశం, భీమన్న, శంకర్, గోపాల్, సత్యనారాయణ, రాజిరెడ్డి, విలాస్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 24 , 2024 | 10:52 PM